Skip to main content

TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్.. ప‌రీక్ష‌ల్లో విజయం సాధించాలంటే..

ప్రస్తుతం లక్షలాది విద్యార్థుల లక్ష్యం... టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్! ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అభ్యర్థులు ఎంతో కసరత్తు చేస్తున్నారు.
TSPSC Groups Success Plan
TSPSC Groups Success Plan

అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంత చేస్తున్నా జయాపజయాలపై సందేహాలు కలవరపెడుతున్నాయి. కొంత ఆందోళనకు గురవుతున్నారు. అయితే పోటీ గురించి ఆందోళన చెందనవసరం లేదని, వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే గెలుపు మార్గం దిశగా, సాఫీగా సాగిపోవచ్చంటున్న సబ్జెక్టు నిపుణుల సలహాలతో ప్రత్యేక కథనం..

పోటీని చూసి.. భయపడాల్సిన అవసరం లేదు..
గ్రూప్స్ అంటే ఖాళీలతో సంబంధం లేకుండా పోటీ లక్షల్లోనే ఉంటుందనేది నిస్సందేహం. ఉమ్మడి రాష్ట్రం గ్రూప్స్ పరీక్షలకు హాజరైన వారి సంఖ్య దీనికి నిదర్శనం. తెలంగాణలో తొలిసారిగా జరగనున్న గ్రూప్స్ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించనుంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలన్నీ గ్రూప్స్ ఔత్సాహికులతో నిండిపోయాయి. ఇంత తీవ్రంగా ఉన్న పోటీని చూసి, భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. సందిగ్ధత వీడి, సంసిద్ధత దిశగా నడవాలని సూచిస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఒత్తిడికి దూరం..
గ్రూప్స్ ఔత్సాహికులు ముందుగా ప్రిపరేషన్‌కు మానసికంగా సిద్ధమవాలి. ఒత్తిడి అనే మాటకు తావివ్వకూడదు. పోటీ లక్షల్లో ఉన్నా పోస్ట్ సాధించాలనే గట్టి సంకల్పం, విజయం సాధించగలమనే నిండైన ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించగలరు. సంకల్ప బలంతో విజయం దిశగా దూసుకెళ్లగలరు.

ఇది విజయానికి సరైన ప్రణాళిక కాదు..

Groups


అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రధానం. సమయ పాలన విషయంలో కొందరు ‘వారం ఆధారిత’ విధానాన్ని అనుసరిస్తారు. ఒక వారంలో ఒక సబ్జెక్టు, మరో వారం మరో సబ్జెక్టును చదువుతారు. ఇది విజయానికి సరైన ప్రణాళిక కాదు. పేపర్ల వారీగా సిలబస్‌ను విశ్లేషించుకొని, రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే అన్ని అంశాల మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది.
అంతకుముందు చదివిన అంశాలను రివిజన్ చేసేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి.

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

గుర్తుంచుకోండిలా..
చదివిన అంశాలన్నింటినీ గుర్తుంచుకోవటం కొంత కష్టమే. మెమరీ టిప్స్ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ టిప్స్ అభ్యర్థుల స్వీయసామర్థ్యం మేరకు వేర్వేరుగా ఉంటాయి. కొందరు విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా చదివిన అంశాలను గుర్తుంచుకుంటారు. ఉదాహరణకు జనరల్ సైన్స్‌లో ఏదైనా వ్యాధికి సంబంధించిన సమాచారం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ప్రచురించిన బొమ్మలు, సమాచార పట్టికలను మైండ్‌లో నిక్షిప్తం చేసుకుంటారు.
చదివిన అంశాలను గుర్తుంచుకునేందుకు మరో మార్గం షార్ట్ నోట్స్ రూపకల్పన. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యాంశాలను పాయింట్లుగా, లేదా తమకు అనుకూలమైన రీతిలో (చార్ట్‌లు, గ్రాఫ్‌లు వంటివి) షార్ట్‌నోట్స్ రూపొందించుకోవాలి.చదివిన అంశాలను ఇతరులతో చర్చించటం కూడా మెమరీ పరంగా బాగా ఉపయోగపడే విధానం.

సొంత నోట్స్‌తో..

Notes


సొంత నోట్స్ రూపొందించుకోవడం విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. నోట్స్ రూపకల్పనలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలి. చదివిన ప్రతి అంశాన్నీ నోట్స్‌లో పొందుపరిస్తే సమయం వృథా అవుతుంది. గణాంకాలు, సంవత్సరాలు, నివేదికలు-సిఫార్సులు వంటి ముఖ్యాంశాలను మాత్రమే రాసుకోవాలి. క్విక్ రివిజన్‌కు ఉపయోగపడేలా నోట్స్ రూపొందించుకోవాలి.
              అసలు చదువుతున్న అంశాల్లో ఏవి ముఖ్యమైనవనే సందేహం కలుగుతుంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలించటం వల్ల ఏ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. ప్రశ్న అడిగే విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు కూడా ముఖ్యమైనవి. సీనియర్ ఫ్యాకల్టీ, గత విజేతలు సూచనల మేరకు ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి.

Competitive Exams: పోటీప‌రీక్ష‌ల్లో కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే ఏం చేయాలి? ఎలా చ‌ద‌వాలి?

కష్టంగా కాదు.. 
కొందరు అభ్యర్థులు పుస్తకాలను ముందేసుకొని, అది ఒక విధిగా, చాలా కష్టంగా భావిస్తూ చదువుతారు. ఇలాంటి దృక్పథం వల్ల తక్కువ సమయంలోనే అయిష్టత ఏర్పడుతుంది. దీనికి పరిష్కారం.. జాయ్‌ఫుల్ రీడింగ్. ప్రతి అంశాన్నీ ఆస్వాదిస్తూ చదవాలి. చదవటాన్ని, సబ్జెక్టు అధ్యయనాన్ని హాబీగా మార్చుకోవాలి. ఒక అంశాన్ని చదువుతుంటే దానికి సంబంధించిన మరో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి.

If one cannot enjoy reading a book over and over again, there is no use in reading it at all
                                     -Oscar Wilde.

Confidence (విశ్వాసం), Consistency (స్థిరత్వం), Calmness (ప్రశాంతత). అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ఈ 3-C ఫార్ములాను దృష్టిలో ఉంచుకొంటే విజయం తలుపుతడుతుంది.

ప్రిపరేషన్ టిప్స్..
అభ్యర్థుల ప్రిపరేషన్ సరైన మార్గంలో సాగేందుకు ఉపయోగపడే మరో సాధనం.. స్విచ్ ఓవర్ సిస్టమ్! ఒక సబ్జెక్టు లేదా అంశాన్ని చదువుతున్నప్పుడు విసుగొస్తే వెంటనే తమకు ఆసక్తి ఉన్న మరో సబ్జెక్టు లేదా అంశంపై దృష్టిసారించాలి. అంతేకానీ, ఆసక్తి లేకున్నా పరీక్షల కోణంలో ముఖ్యమైంది కాబట్టి అదే అంశానికి గంటల కొద్దీ సమయం వెచ్చిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Government Jobs: ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌కు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేర‌కే ఉద్యోగాల భ‌ర్తీ

చదవడానికి సిద్ధమయ్యే ముందు..
ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసరించాల్సిన ముఖ్య వ్యూహం చెక్ లిస్ట్ రూపొందించుకోవడం. చదవడానికి సిద్ధమయ్యే ముందు దీన్ని తయారుచేసుకోవాలి.
➤ ప్రాధాన్యత వారీగా చదవాల్సిన అంశాలు
➤ కేటాయించాల్సిన సమయం
➤ బ్రేక్ టైం
➤రోజువారీ రివిజన్‌కు కేటాయించాల్సిన సమయం

పోటీప‌రీక్ష‌ల బిట్స్‌ కోసం క్లిక్ చేయండి

రి‘విజన్’ ఇలా..
గ్రూప్స్ అభ్యర్థులకు పరీక్షలో విజయం దిశగా మలి దశలో ఉపకరించే సాధనం రివిజన్ (పునశ్చరణ). దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రివిజన్‌కు ఉపయోగపడే కొన్ని ముఖ్య విధానాలు...
➤ చదివిన అంశంపై సహచరులు, ఇతరుల ద్వారా స్వీయ మూల్యాంకనం (self evaluation) చేసుకోవాలి.
➤ రివిజన్‌కు కూడా ప్రత్యేకంగా టైంటేబుల్ రూపొందించుకోవాలి.
➤ గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. సందేహాలను ఎప్పటికప్పుడు సహచరులు, సబ్జెక్టు నిపుణుల సహకారంతో నివృత్తి చేసుకోవాలి.

ఒత్తిడిపై గెలుపు ఇలా..
ఉద్యోగ పరీక్షలైనా, అకడమిక్ పరీక్షలైనా ప్రస్తుతం విద్యార్థులు ఆందోళనకు గురవటం అధికమవుతోంది. ఒత్తిడి బారినపడుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు.. ఒకటి సబ్జెక్టు అంశాల ప్రభావం కాగా, రెండోది ఇతరులతో పోల్చుకోవడం. వీటిని విడనాడితే ఒత్తిడి దరిచేరకుండా చేయొచ్చు. ఇది అభ్యర్థుల చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా సహచరులతో పోల్చుకోవడాన్ని మానుకోవాలి. సహచరుల్లో భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారుంటారు. కొందరు గంటల కొద్దీ చదువుతుంటారు. ఇలాంటి వారిని చూసి, తాము వెనుకబడుతున్నామేమో అనుకొని ఆందోళన చెందితే ఒత్తిడి మొదలవుతుంది. అది పరీక్ష వరకు సాగుతుంది. అందుకే అభ్యర్థులు ‘మన లక్ష్యం ఏమిటి? మనం ఎలా చదివితే విజయావకాశాలు మెరుగవుతాయి?’అనే విషయాలపైనే దృష్టిసారించాలి.
                   - డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి, సైకియాట్రిస్ట్.

పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే..
గ్రూప్స్ వంటి పోటీపరీక్షల్లో విజయం సాధించాలంటే రైటింగ్ ప్రాక్టీస్ ముఖ్యం. ఇలా చేస్తే మరింత కచ్చితత్వంతో ముందుకుసాగొచ్చు. అలాగని గంటల కొద్దీ సమయాన్ని రైటింగ్‌కు కేటాయించటం కూడా సరికాదు. ప్రతి టాపిక్‌కు సంబంధించి వ్యక్తిగతంగా కొంత సమయాన్ని నిర్దేశించుకొని, ఆ సమయంలో చదివిన అంశాలను రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత తాము చదివిన అంశాలు - రాసుకున్న అంశాలను సరిపోల్చుకొని, తప్పులను సరిదిద్దుకోవాలి. ఫలితంగా సబ్జెక్టు పరిజ్ఞానం పెరగడంతో పాటు చదివిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.
             - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.

Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

కోచింగ్ తీసుకుంటేనే... 
ప్రస్తుతం చాలా మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యమని భావిస్తున్నారు. కోచింగ్ అనేది అభ్యర్థులను విజయం దిశగా మార్గనిర్దేశనం చేసే సాధనం మాత్రమే. మిగిలిన బాధ్యత అంతా అభ్యర్థులదే. కోచింగ్ ద్వారా ఏ అంశాలు చదవాలి? ఎలా చదవాలి? ముఖ్యమైన అంశాలేంటి? అనే విషయాలపై స్పష్టత లభిస్తుంది. వాటి ఆధారంగా అభ్యర్థులు స్వీయ ప్రిపరేషన్ ద్వారా సబ్జెక్టులపై పట్టు సాధించాలి. కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులు కోచింగ్ తీసుకునే వారితో పోల్చుకుని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోచింగ్ లేకుండానే విజయం సాధించిన వారు గతంలో ఎందరో ఉన్నారు. అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యమే విజయాన్ని నిర్దేశిస్తుందన్నది గుర్తించాలి.
               - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ.

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

Published date : 27 Mar 2022 09:18PM

Photo Stories