Skip to main content

స్క్రీనింగ్ టు మెయిన్.. గ్రూప్-2 విజయానికి బాటలు..

ఏపీపీఎస్సీ గ్రూప్-2.. ఆరున్నర లక్షల మందికి పైగా పోటీపడుతున్న పరీక్ష. రెండంచెల విధానంలో జరగనున్న పరీక్షలో స్క్రీనింగ్‌లో నెగ్గితేనే.. మెయిన్‌కు మార్గం. దీంతో అభ్యర్థుల్లో ఒకింత ఆందోళన. స్క్రీనింగ్‌లో నెగ్గాలంటే.. అందుబాటులో ఉన్న సమయం రెండు నెలలు. ఆపై మెయిన్ ఎగ్జామినేషన్‌కు లభించే సమయం మరో మూడు నెలలు. ఈ క్రమంలో స్క్రీనింగ్‌లో నెగ్గి.. ఆపై మెయిన్‌లో మెరవాలంటే సరైన ప్రణాళిక ఉండాల్సిందే. గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్..
ఏపీపీఎస్సీ కొత్తగా అమల్లోకి తెచ్చిన విధానం స్క్రీనింగ్ టెస్ట్. దీన్నే ప్రిలిమ్స్‌గా పిలుస్తున్నారు. ఇందులో ప్రతిభ కనబరిస్తేనే మెయిన్ ఎగ్జామ్‌కు అర్హత లభిస్తుంది. దీంతో ముందుగా స్క్రీనింగ్ టెస్ట్‌లో రాణించడం తప్పనిసరి.

మూడు విభాగాలు.. 150 మార్కులు:
స్ర్కీనింగ్ టెస్ట్‌లో మూడు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలు అడుగుతారు. అవి..

కరెంట్ అఫైర్స్
రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కళలు, క్రీడలు, సంస్కృతి, పాలనకు సంబంధించి జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో మంచి మార్కుల సాధనకు గత ఏడాది కాలంలో ముఖ్యంగా గత ఆర్నెల్లలో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. ఉదాహరణకు ఒక అవార్డు-విజేత గురించి చదివేటప్పుడు ఆ అవార్డును ఏర్పాటు చేసిన సంవత్సరం, నిర్వాహక సంస్థ, మొదటి విజేత తదితర వివరాలను కూడా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమకాలీన అంశాలకు సంబంధించి తాజా ప్రభుత్వ విధానాలు, ఒప్పందాలు - లక్ష్యాలు - వైఫల్యాలు - కారణాలు వంటి వాటి గురించి అధ్యయనం చేయాలి.

భారత రాజ్యాంగం
సిలబస్‌లో నిర్దేశించిన అంశాల మేరకు ప్రిపరేషన్ కొనసాగించాలి. ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించి ఫ్యాక్ట్స్‌పై దృష్టిసారించాలి. అదే విధంగా రాజ్యాంగబద్ధ సంస్థలు- నియామకాలు, విధులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. అంతేకాకుండా ఈ విభాగానికి సంబంధించి అభ్యర్థులు ప్రధానంగా దృష్టిసారించాల్సిన మరో అంశం కేంద్ర- రాష్ట్ర సంంబంధాలు.

భారత్‌లో ఆర్థిక అభివృద్ధి
మధ్యయుగం, స్వాతంత్య్రానికి పూర్వం, తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను సిలబస్‌లో పొందుపరిచారు. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగంలో రాణించాలంటే చరిత్రతో అనుసంధానం చేసుకుంటూ వివిధ అంశాలను అధ్యయనం చేయాలి. మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆ సమయంలో ఆయా రాజ్యాలు, రాజులు.. వారి ఆర్థిక విధానాలు, వాణిజ్య విధానాల గురించి తెలుసుకోవాలి.

మెయిన్‌కు మెరుగ్గా..
స్ర్కీనింగ్ టెస్ట్‌లో సాధించిన మార్కులు, అందుబాటులో ఉన్న పోస్టుల ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా రూపొందించి, వారికి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
- పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. అవి..
పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
పేపర్-2: ఏపీ హిస్టరీ-ఇండియన్ కాన్‌స్టిట్యూషన్
పేపర్-3: ఎకానమీ (ఇండియా అండ్ ఏపీ)

స్క్రీనింగ్‌కు కొనసాగింపుగా
మెయిన్ ఎగ్జామినేషన్‌ను సిలబస్ పరంగా స్క్రీనింగ్ టెస్ట్‌కు కొనసాగింపుగా భావించొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల స్క్రీనింగ్‌కు ప్రిపేరవుతున్నప్పుడే మెయిన్ ఎగ్జామినేషన్ దృక్పథంతో చదవాలి. ఇలాచేస్తే ఒకే సమయంలో రెండు పరీక్షలకు సంసిద్ధత లభించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పేపర్ల వారీగా అనుసరించాల్సిన విధానం..

పేపర్-1 జనరల్ స్టడీస్-మెంటల్ ఎబిలిటీ
  • హిస్టరీ నుంచి ఏపీ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ వరకు అన్ని విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
  • పాలిటీలో రాజ్యాంగ వివాదాలు, ప్రభుత్వ విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • జనరల్ సైన్స్‌కు సంబంధించి కోర్ అంశాల నుంచి కాంటెంపరరీ డెవలప్‌మెంట్స్ వరకు అన్నిటిపై దృష్టిపెట్టాలి. బేసిక్స్‌కు సంబంధించి ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్తు, ఉష్ణం, యాంత్రికశాస్త్రం, ఆధునిక భౌతికశాస్త్రం, ఆయా అంశాలకు సంబంధించి శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు, ప్రయోగాలు, నోబెల్ అవార్డు గ్రహీతల గురించి తెలుసుకోవాలి.
  • సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంతరిక్షం, అణుశక్తి రంగం, సమాచార సాంకేతిరంగం, కంప్యూటర్లు, విద్యుత్ రంగం, క్షిపణులు, రక్షణ రంగ ప్రయోగాలు, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీపై దృష్టిసారించాలి.
  • హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్ర ముఖ్యంగా భారత స్వాతంత్య్ర ఉద్యమంపై అవగాహన తప్పనిసరి.
  • భారతదేశ, ఏపీ జాగ్రఫీలో నైసర్గిక స్వరూపాలు, నదులు, ప్రాజెక్టులు, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా వంటివాటిని చదవాలి.
  • రాష్ర్ట విభజన తర్వాత ఏర్పడిన పాలన, న్యాయ, సాంస్కృతిక, ఆర్థిక సమస్యలు, ఏపీ పునర్విభజన చట్టాన్ని అధ్యయనం చేయాలి.
  • మెంటల్ ఎబిలిటీలో నంబర్ సిరీస్; కోడింగ్డీ కోడింగ్; సీటింగ్ అరేంజ్‌మెంట్; స్క్వేర్ రూట్స్‌లపై పట్టు సాధించాలి.
పేపర్-2 ఏపీ హిస్టరీ అండ్ భారత రాజ్యాంగం
ఇందులో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర నుంచి 75, భారత రాజ్యాంగం నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. ఈ నేపథ్యంలో రెండిటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏపీ హిస్టరీలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, మతం - సాహిత్యం, కళలు - నిర్మాణాలు, 11-15 శతాబ్దాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన రాజ వంశాలు - నాటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్ర ప్రాంత నాయకులు పోషించిన పాత్ర, ముఖ్యమైన వ్యక్తులు, జైఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.

రెండో విభాగం పాలిటీకి సంబంధించి రాజ్యాంగ స్వరూపం, స్థానిక సంస్థలు అందుకు సంబంధించి చేసిన సవరణలు (73, 74)లపై అవగాహన పెంపొందించుకోవాలి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వాటికి సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణలు గురించి కూడా తెలుసుకోవాలి. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, మహిళా కమిషన్, బీసీ కమిషన్, జాతీయ, రాష్ర్ట మైనారిటీ కమిషన్లు, మానవ హక్కుల సంఘం, లోక్‌పాల్, లోకాయుక్త, సమాచార హక్కు చట్టం తదితర అంశాలపై అవగాహన తప్పనిసరి.

భారతదేశంలో రాజకీయ పార్టీలు, ఏక పార్టీ, బహుళ పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీ వ్యవస్థలపై అధ్యయనం చేయాలి.

పేపర్-3 ఇండియన్, ఏపీ ఎకానమీ
ఈ పేపర్లో మంచి మార్కులు సొంతం చేసుకోవాలంటే ఆర్థికశాస్త్రంలోని మూల భావనల నుంచి తాజాగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు- లక్ష్యాలు - లక్షిత వర్గాలు- ప్రస్తుతం ఆయా పథకాలు అమలవుతున్న తీరు గురించి తెలుసుకోవాలి. అదే విధంగా పంచవర్ష ప్రణాళికలు.. ఒక్కో ప్రణాళికలో పేర్కొన్న ప్రత్యేక లక్ష్యం గురించి అవగాహన అవసరం. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ విషయంలో సహజ వనరులు, ఆర్థిక అభివృద్ధి విధానాలు, ప్రస్తుత పరిస్థితి, రాష్ర్ట్ర విభజనకు ముందు, తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకుంటూ చదవాలి.
ఇలా స్క్రీనింగ్ నుంచి మెయిన్ వరకు ప్రతి పేపర్‌లోని అంశాలను ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేస్తే విజయావకాశాలు మెరుగవుతాయి.

స్క్రీనింగ్ + మెయిన్‌కు ఉమ్మడి వ్యూహాలు
  • పాలిటీ, ఎకానమీ అంశాలను చదివేటప్పుడు తులనాత్మక, కంపేరిటివ్ అప్రోచ్‌తో ముందుకు సాగితే తాజా పరిణామాలపై మరింత అవగాహన లభిస్తుంది.
  • మెటీరియల్ పరంగా ప్రతి సబ్జెక్టుకు ఒకట్రెండు ప్రామాణిక పుస్తకాలకు పరిమితం కావాలి. ఒకే సబ్జెక్ట్ కోసం నాలుగైదు పుస్తకాలు చదవడం వల్ల సమయం వృథా అవుతుంది.
  • స్క్రీనింగ్ టెస్ట్‌కు 15 రోజుల ముందు ఉమ్మడి ప్రిపరేషన్‌కు స్వస్తి చెప్పి.. పూర్తి సమయాన్ని స్క్రీనింగ్‌కే కేటాయించాలి.
  • చదివేటప్పుడు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ, ఎకానమీ విషయంలో మ్యాథమెటిక్స్, గణాంకాల పరంగా ప్రాక్టీస్ అప్రోచ్ ఎంతో కలిసొస్తుంది.
రిఫరెన్స్ పుస్తకాలు
  • ఇండియన్ పాలిటీ- లక్ష్మీకాంత్
  • ఇండియన్ ఎకానమీ- రమేశ్ సింగ్
  • ఇండియా, ఏపీ - సామాజిక, ఆర్థిక సర్వేలు
  • ఇండియన్ హిస్టరీ- బిపిన్ చంద్ర
  • ఏపీ హిస్టరీ- హనుమంతరావు
  • 50 ఇయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
  • వీటికి అదనంగా బీఏ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ పుస్తకాలు చదవడం లాభిస్తుంది.
Published date : 28 Dec 2016 05:49PM

Photo Stories