Skip to main content

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–2 కటాఫ్‌ మార్కులు ఎన్ని...!?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఫలితాలను నవంబర్‌ 16వ తేదీన ప్రకటించారు.

ఎగ్జిక్యూటివ్, నాన్‌ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీల్లో 982 పోస్టులకు 45,425 మంది మార్కుల లిస్ట్‌ విడుదలైంది.. మెరిట్‌ లిస్ట్‌ పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులు పొందిన మార్కులు అత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తున్న వైనం! గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలు ముగిసిన తర్వాత.. అత్యంత క్లిష్టం, లోతైన పరిజ్ఞానం అవసరం.. కటాఫ్‌ 310 మించదనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ.. ఫలితాలను చూస్తే.. ఈ అంచనాలు తలకిందులు అయ్యాయి. అత్యధిక మార్కులు 357.35గా నమోదవడమే ఇందుకు నిదర్శనం. గ్రూప్‌–2 ఫలితాల సరళి.. కటాఫ్‌ అంచనాలపై విశ్లేషణ...

ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో మొత్తం ఎనిమిది శాఖల్లో 442 పోస్ట్‌లు.. నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో 26 శాఖల్లో 540 పోస్ట్‌లకు ఏపీపీఎస్‌సీ గత జూలై 16,17 తేదీల్లో మూడు పేపర్లలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించింది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ నుంచి 49,106 మంది అర్హత పొందగా.. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో హాజరు 92శాతంగా నమోదైంది. వీటి ఫలితాలను నవంబర్‌ 16వ తేదీన ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. మొత్తం 45,425 మందితో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసింది. వీరిలో 217 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది.

అంచనాలను మించిన మార్కులు...
మెరిట్‌ లిస్ట్‌ను, అభ్యర్థులు పొందిన మార్కులను పరిశీలిస్తే.. పరీక్ష ముగిసిన తర్వాత కటాఫ్‌ అంచనాలను మించి అభ్యర్థులు మార్కులు సొంతం చేసుకోవడం గమనార్హం. వాస్తవానికి మూడు పేపర్లు ముగిసిన తర్వాత పరీక్ష క్లిష్టంగా ఉందని సబ్జెక్ట్‌లో లోతైన పరిజ్ఞానం ఉంటేనే సమాధానాలిచ్చే విధంగా ఉందని, ప్రశ్నలు అడిగిన క్రమంలో సిలబస్‌ పరంగా సమతుల్యత పాటించలేదని అధిక శాతం మంది అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌ పరీక్ష కావడంతో అభ్యర్థులు పేర్కొన్న వివరాల ప్రకారం–నిపుణులు సైతం కటాఫ్‌ 310లోపే ఉండొచ్చని అంచనా వేశారు. కానీ ఈ అంచనాలను మించిన రీతిలో అభ్యర్థులు మార్కులు సొంతం చేసుకున్నారు. విత్‌హెల్డ్‌లో ఉంచిన అభ్యర్థులను మినహాయిస్తే మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం.. అత్యధిక మార్కు 357.35గా నమోదైంది.

300పైగా మార్కులు పొందిన వారు 1072 :
మొత్తం అందుబాటులో ఉన్న పోస్ట్‌ల సంఖ్య 982. కాగా, మూడు వందలకు పైగా మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్య 1072గా ఉండటం గమనార్హం. 300 నుంచి 310 మార్కుల శ్రేణిలోనే 574 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక.. 1000వ స్థానంలో నిలిచిన అభ్యర్థికి 304.45 మార్కులు లభించాయి.

ఎన్ని మార్కులకు.. ఏ పోస్ట్‌?
అంచనాలకు మించి మార్కులు నమోదైన నేపథ్యంలో... ఇప్పుడు అభ్యర్థుల్లో తుది జాబితాపై ఉత్కంఠ నెలకొంది. రోస్టర్, రిజర్వేషన్స్‌ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితా రూపొందించనున్నారు. ఓపెన్‌ కేటగిరీలో అభ్యర్థులు తాము ప్రాధాన్యం ఇచ్చిన పోస్ట్‌కు ఎంపిక కావాలంటే... టాప్‌–100లో ఉంటేనే సాధ్యమని గత కొన్నేళ్లుగా నియామకాల సరళిని పరిశీలిస్తున్న ఓ అధికారి వ్యాఖ్యానించారు. గ్రూప్‌–2 అనగానే అభ్యర్థులు తొలిప్రాధాన్యంగా పేర్కొనే డిప్యూటీ తహశీల్దార్‌ పోస్ట్‌ను పొందాలంటే ఓపెన్‌ కేటగిరీలో 50 లేదా 100 లోపు మెరిట్‌తోనే సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జోన్‌ స్థాయిలో పోస్ట్‌ల సంఖ్య.. రిజర్వేషన్, రోస్టర్‌లు అమలు చేయడం, కొన్ని సందర్భాల్లో రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు సైతం ఓపెన్‌ కేటగిరీలో స్థానం పొందే అవకాశం ఉండటమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హతలు..
నోటిఫికేషన్‌లో కొన్ని పోస్ట్‌లకు ప్రత్యేక అర్హతలు నిర్దేశించారు. ఉదాహరణకు.. ఏపీ సెక్రటేరియట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(లా).. ఈ పోస్ట్‌కు తప్పనిసరిగా న్యాయశాస్త్ర పట్టభద్రులే అర్హులు. అదే విధంగా.. ఎక్సైజ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌.. ఈ పోస్ట్‌కు వయోపరిమితితోపాటు శారీరక అర్హత ప్రమాణాలు కూడా నిర్దేశించారు. అదేవిధంగా మరికొన్ని పోస్ట్‌లకు కూడా బీకాం, బీఏ(మ్యాథ్స్‌), ఆఫీస్‌ ఆటోమేషన్‌ వంటి ప్రత్యేక అర్హతలు అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి పోస్ట్‌లను ప్రా«థమ్యంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల విషయంలో.. మెరిట్‌ లిస్ట్‌లో 500 నుంచి 900 లోపు నిలిస్తే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

ఫైనల్‌ కటాఫ్‌ 310!
మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం– అభ్యర్థులు పొందిన మార్కుల సంఖ్య అత్యధికంగా కనిపిస్తున్నప్పటికీ.. పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. చివరి ఖాళీ భర్తీ అయ్యే సమయానికి రిజర్వ్‌డ్‌ కేటగిరీ, రోస్టర్‌ సిస్టమ్, పీహెచ్‌ రిజ్వరేషన్‌లను దృష్టిలో పెట్టుకుంటే ఫైనల్‌ కటాఫ్‌ 290 నుంచి 310 మార్కుల మధ్యలో నమోదవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

టాప్‌–10 లిస్ట్‌ జాబితా :
మెరిట్‌ లిస్ట్‌లో టాప్‌–10 జాబితాలో నిలిచిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు..

సంఖ్య పేపర్‌–1 పేపర్‌–2 పేపర్‌–3 మొత్తం
1 117 124.29 115.86 357.15
2 113 117.35 122.07 352.42
3 109 123.47 117.93 350.40
4 113 128.57 107.59 349.16
5 109 123.47 115.86 348.33
6 115 119.39 112.76 347.15
7 103 134.69 107.59 345.28
8 110 115.31 117.93 343.24
9 113 116.33 113.79 343.12
10 111 124.49 107.59 343.08
మూడు వందలకు పైగా మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్యా శ్రేణి...
మార్కుల శ్రేణి
అభ్యర్థుల సంఖ్య
350–360 3
340–350 14
330–340 45
320–330 135
310–320 301
300–310 574
మొత్తం 1072

గమనిక: ఈ గణాంకాలన్నీ విత్‌హెల్డ్‌లో ఉంచిన అభ్యర్థులను మినహాయించి ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన ఫలితాల ఆధారంగా రూపొందించినవి. విత్‌హెల్డ్‌లో ఉంచిన అభ్యర్థుల విషయంలో ఏపీపీఎస్‌సీ నిర్ణయం తీసుకుంటే..ఈ సంఖ్యల్లో మార్పు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.

పేపర్ల వారీగా అత్యధిక మార్కులివే..
వాస్తవానికి పరీక్ష ముగిసిన తర్వాత చాలామంది అభ్యర్థులు, సబ్జెక్ట్‌ నిపుణులు ప్రతి సబ్జెక్ట్‌ విషయంలోనూ గరిష్టంగా 110 నుంచి 115 మార్కులు పొందే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజా ఫలితాలు, మార్కులను పరిశీలిస్తే.. ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో.. పేపర్ల వారీగా అత్యధిక మార్కుల వివరాలు.

పేపర్‌–1: 122 మార్కులు
పేపర్‌–2: 134.69
పేపర్‌–3: 122.07

పేపర్ల వారీగా టాప్‌–10 మెరిట్‌ లిస్ట్‌ :

పేపర్‌–1

పేపర్‌–2

పేపర్‌–3

122 134.69 122.07
120 129.59 120.00
119 128.57 118.97
118 126.53 117.93
118 126.53 117.93
118 125.51 117.93
117 124.49 116.90
116 124.49 116.90
116 124.49 116.90
116 124.49 116.90

ఇష్టపడి చదివితేనే మంచి మార్కులు...
‘సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంచుకుని ఇష్టపడి చదవడం అలవర్చుకోవాలి. 2011 గ్రూప్‌–2లో నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ లభించినా.. ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ లక్ష్యంగా కృషి చేశాను. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూనే ప్రిపరేషన్‌ సాగించాను. ఫలితంగానే రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలవగలిగాను. నేను ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న డీటీ ఉద్యోగమే లభిస్తుందని భావిస్తున్నాను’ అని మెరిట్‌ లిస్ట్‌లో 352.42 మార్కులతో రెండో స్థానంలో నిలిచిన విజయనగరం జిల్లా లక్ష్మీవరం గ్రామానికి చెందిన రామలప్పనాయుడు తెలిపారు.
Published date : 30 Nov 2017 04:34PM

Photo Stories