Skip to main content

యురేనియం (U) రసాయన మూలకం విధ్వంసాన్ని సృష్టిస్తుందా..?

యురేనియం... ప్రాధాన్యత... పరిణామాలు
మనకు బాంబుల గురించి, వాటికి అవసరమైన లోహాల గురించి, అణువిద్యుత్ గురించి ప్రసక్తి వచ్చినప్పుడు యురేనియం పేరు వినబడుతుంది. ఈ మధ్య నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపొద్దని దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. అసలు యురేనియం అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకంత ప్రాధాన్యమిస్తోంది? సాధారణ మానవుడు యురేనియం పేరు వింటే ఎందుకంత భయపడుతున్నాడు? దాని కథ ఏంటో చూద్దాం!

యురేనియం అంటే ఏమిటి?
యురేనియం అంటే ధార్మిక శక్తి అధికంగా ఉండే ఒక రసాయన మూలకం. రసాయనికపరంగా వ్యవహరించేటప్పుడు దీనికి (U) అనే చిహ్నం వాడతారు. దీని పరమాణువు సంఖ్య 92. యురేనియంలో 92 ప్రోట్రాన్స్, 92 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది దానంతట అదే ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెలువరిస్తుంది. యురేనస్ గ్రహం పేరు మీద దీనికి యురేనియం అని నామకరణం చేశారు. యురేనియంలో అధికభాగం వెండిరంగులో ఉండే అనేక పసుపు రంగు ఛాయలు మెరుస్తాయి. అయితే యురేనియం అంత ఎక్కువగా దొరకదు. కానీ ఖనిజాల కోసం భూమిని తొలిచి వెదుకుతున్న సమయంలో యురేనియం నిల్వల సంగతి సులభంగా తెలిసిపోతుంది. కారణం యురేనియం ధార్మిక శక్తి ప్రభావం ఆ ఖనిజం నిలువలున్న చోట స్పష్టంగా వ్యక్తమవుతుంది. సాంకేతిక పరికరాలకు ఈ ప్రభావం అందుతుంది. యురేనియంలోని అణువులు ఇతర లోహాల అణువుల కన్నా బరువుగా ఉంటాయి. యురేనియం ఐసోటోప్‌లలోని అణువులను రెండు భాగాలుగా సగానికి విడదీయవచ్చు. దీని వల్ల విపరీతమైన శక్తి విడుదలవుతుంది. అణుబాంబుల తయారీకి శుద్ధి చేసిన యురేనియంను వాడతారు. అణురియాక్టర్లలో విద్యుదుత్పాదనకూ వాడతారు. యురేనియం నుంచి ఫ్లుటోనియంను కూడా రాబట్టవచ్చు.

యురేనియాన్ని కనుగొన్నదెవరు ?
యురేనియంను జర్మనీ రసాయనిక శాస్త్రవేత్త మార్టిన్‌క్లాప్రోత్ 1789లో కనుగొన్నారు. యురేనియం రేడియో ధార్మికత లక్షణాన్ని 1896లో హెన్రీ ఆంటోని బెక్యూరెల్ అనే శాస్త్రవేత్త తొలిసారి గుర్తించారు. శుద్ధి చేసిన యురేనియం వెండి రంగులో ఉంటుంది. యురేనియం సహజ సిద్ధంగా వెండికంటే దాదాపు 40 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. యురేనియం అణువులను విడగొట్టడం ద్వారా శక్తిని రాబట్టవచ్చని 1938లో ఒట్టోహన్, ఫిట్జ్, ్ట్రాట్స్‌మన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఖనిజాల నుంచి ఎలా వేరు చేస్తారు?
ముడి ఖనిజాన్ని ముందు బాగా వేడి చేస్తారు. ఫలితంగా అందులో ఉన్న కర్భన, గంధక సంబంధ పదార్థాలు తొలిగిపోతాయి. తర్వాత ఆమ్ల, క్షార ద్రవాలతో ఖనిజాన్ని శుద్ధిచేస్తారు. దీనివల్ల యురేనియం మినహాయించి మిగిలిన మూలకాలు ఇతర రూపాల్లోకి మారిపోతాయి. మిగిలిన ద్రవానికి సోడియం హైడ్రాకై ్సడ్, మెగ్నిషియం వంటి వాటిని కలుపుతారు. దీంతో యురేనియం ఉన్న పదార్థం అవక్షేపంగా మిగిలిపోతుంది. ఇది పసుపురంగులో ఉంటుంది. దీన్నే ఎల్లో కేక్ అంటారు. దీనిని మళ్లీ శుద్ధిచేసి అణువిద్యుత్ రియాక్టర్లలో ఉపయోగిస్తారు. ఎల్లో కేక్ నైట్రిక్ యాసిడ్‌తో కలిపి ఒక ద్రావణంగా తయారు చేస్తారు. ఈ ద్రావణానికి ట్రై బ్యూటైల్ ఫాస్పేట్, కిరోసిన్ లేదా తగిన హైడ్రోకార్బన్‌లను కలపడం ద్వారా యురేనియంను వేరు చేస్తారు. దీనికి ఆమ్లంతో కలిపిన నీటిని చేరుస్తారు. దీనివల్ల శుద్ధ యురేనైల్ నైట్రేట్ వేరవుతుంది. ఈ యురేనైల్ నైట్రేట్‌కు కొన్ని రసాయనాలను కలుపుతారు. అప్పుడు జరిగే రసాయన చర్య వల్ల యురేనియం ఫ్లోరైడ్ ఏర్పడుతుంది. దీని నుంచి ఫ్లోరైడ్‌ను వేరు చేస్తారు. అప్పుడు అణువిద్యుత్ రియాక్టర్లలో వాడే యురేనియం లోహం తయారవుతుంది.

వ్యర్ధాలను ఏం చేస్తారు?
యురేనియం ప్రాజెక్టులో ముడి యురేనియం శుద్ధి చేయగా వచ్చే వ్యర్థ పదార్థాలను టైలింగ్ పాండ్‌కు తరలిస్తారు. ఈ వేస్ట్‌ను సున్నపురాయిని మరికొన్ని రసాయన పదార్థాలను పంపి తటస్థీకరించడం ద్వారా పర్యావరణానకి హానీ కలుగకుండా నిర్వీర్యం చేస్తారు. కడప జిల్లా తుమ్మలపల్లెలో ఉన్న యునేనియం మైనింగ్స్‌లో వ్యర్థాలను ఇలా చేయడం లేదు. ఓపెన్ టైలింగ్ పాండ్ వల్ల భూ గర్భజలాలు కాలుష్యమయ్యాయి. ఇంకా సాగుభూమి కలుషితమై పంటలు పండటానికి అనుకూలంగా లేదు. గాలి, నీరు, నేల కాలుష్యమవటంవల్ల తీవ్ర అనారోగ్య పరిస్థితులను అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు.

యురేనియం ప్రాధాన్యత ఏమిటి?
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే దాదాపు 92 మూలకాల్లో యురేనియం ఒకటి. పీరియాడిక్ టేబుల్‌లోని మొత్తం మూలకాల్లో దీని ద్వారా మాత్రమే అధిక అణువిద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణకు 10 లక్షల కిలోల బొగ్గును మండిస్తే ఎంత విద్యుత్తు వస్తుందో, అర కిలో యురేనియం ద్వారా అంత విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అలాగే ఒక టన్ను యురేనియం ద్వారా దాదాపు నాలుగు కోట్ల కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది 16 వేల టన్నుల బొగ్గు, లేదా 8 వేల బ్యారెళ్ల ముడిచమురు ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుకు సమానం. అస్థిరమైన అణు నిర్మాణం, రేడియో ధార్మికత లక్షణాలు దీనికి కారణం. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ ఉత్పత్తిలో యురేనియం కీలక పాత్ర పోషిస్తుంది. నేల, నీరు మనిషితో పాటు అన్ని జంతువుల్లో అతి తక్కువ మోతాదులో యురేనియం ఉంటుంది. కానీ వీటి నుంచి వాణిజ్య స్థాయిలో యురేనియంను ఉత్పత్తి చేయలేం. అందువల్ల యురేనియం ఎక్కువగా ఉన్న ఖనిజాలను గుర్తించి వాటినుంచి యురేనియంను వేరుచేసి ఉపయోగిస్తారు. యురేనియం సాధారణంగా పిచ్‌బ్లెండ్, యురేనైట్ అనే ఖనిజాల్లో ఎక్కువ శాతం ఉంటుంది.

దీనిలోని రేడియే ధార్మిక కిరణాలు వ్యవసాయానికి, పరిశ్రమల్లో, బయాలజీలో, వైద్య శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా అణువిద్యుత్తు, అణ్వాస్త్రాల్లో రంగురంగుల అద్దాల తయారీలోనూ యురేనియంను ఉపయోగిస్తారు. చిన్నచిన్న అణురియాక్టర్లలో యురేనియం ఐసోటోపులను తయారు చేసి వైద్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 85 శాతం, అంతకంటే ఎక్కువగా శుద్ధిచేసిన ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తారు. అణ్వాస్త్రాల్లో ఉపయోగించే ప్లూటోనియం కూడా యురేనియం ద్వారానే లభిస్తుంది. అణు రియాక్టర్లలో ఇంధనంగా యురేనియంను వాడిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాల్లో ఫ్లూటోనియం ఒకటి. ఇంత విలువ కలిగిన యురేనియం నిల్వలు మన దేశంలో మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లభ్యమవుతుందని కేంద్ర అణుపరిశోధన సంస్థ గుర్తించింది. మన దేశంలో మొత్త 7 అణువిద్యుత్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వాటిల్లో 22 నూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా, మన దేశంలో జాదుగూడలో, కడప జిల్లా తుమ్మలపల్లెలో ఉన్న యునేనియం మైనింగ్స్ ద్వారా ఇప్పటి వరకు యురేనియాన్ని నూక్లియర్ రియాక్టర్లకు సప్లయి చేశారు. అంతేకాకుండా అణు ఒప్పందం ప్రకారం 300 కేజీల వరకు మాత్రమే యురేనియంను దిగుమతి చే సుకోవాలి. పెరుగుతున్న అవసరాల రిత్యా ఇది సరిపోదు. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో లభ్యమౌతున్న యురేనియాన్ని వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగా నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఏమంటోంది?
పెరుగుతున్న అణు ఇంధన అవసరాలను తీర్చేందుకు యురేనియం ఉత్పత్తిని నాలుగురెట్లు ఎక్కువ చేయనున్నట్లు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) తెల్పింది. రెండు అవసరాల కోసం ఈ యురేనియం అన్వేషణ. యురేనియం ముడి పదార్థంగా దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని 22,000 మెగావాట్లకు తీసుకెళ్లడం, దేశ రక్షణ కోసం బాంబుల తయారీకి దీని ఉప ఉత్పత్తిని వాడటం లక్ష్యం. చెప్పు కోవడానికి ఈ కారణాలు బాగానే ఉన్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అణు విద్యుదుత్పత్తి అసాధారణ ఖర్చుతో కూడుకున్నదే కాక ప్రమాదభరితమైంది. యురేనియం నిల్వల అన్వేషణ, తవ్వకాల కోసం కేంద్రం సాగిస్తున్న అంచెలంచెల ప్రయత్నాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతమున్న ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచేలా రూ.1,05,700 కోట్ల ఖర్చుతో 13 గనులను ఏర్పాటు చేసే యత్నాల్లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐల్) ఉంది.

నల్లమలలో యురేనియం తవ్వకం... నిర్వచనం లేని అభివృద్ధి వంటిదేనా...?
యురేనియం వెలికితీసి అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని కేంద్రం చెబుతోంది. కానీ యురేనియం భూమిలో ఉన్నంత వరకు జీవకోటికి ఎలాంటి హాని లేదు. యురేనియం తవ్వకాలు, వెలికితీత, రవాణా, నిల్వ, వినియోగం.. ఇవన్నీ భయం కలిగించేవే! దాని స్వభావం-ప్రభావం అలాంటిది. దానిని బయటకు తీసేటప్పుడు వెలువడే రేడియేషన్ వల్ల భూమి, వాతావరణం, నీళ్లు పూర్తిగా కలుషితమవుతాయి. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిగితే వన్యప్రాణులతో పాటుగా మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. నల్లమలలో 112 చెంచుపెంటల్లో దాదాపు 12 వేల మంది చెంచులు నివసిస్తున్నారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న చెంచులు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. నల్లలో యురేనియం తవ్వకాలు జరిపితే ఎంతోమంది ఉపాధిని కోల్పోయి నిరాశ్రయులుగా మారతారు. కేంద్రప్రభుత్వం యురేనియం తవ్వకాలకు కృష్ణానది నీటిని వినియోగించడమే కాకుండా అడవిలో 4వేల బోర్లను తవ్వించేందుకు నిర్ణయించింది. బోర్ల తవ్వకాలు, వాహనాల శబ్ధాలు, జన సంచారంతో నల్లమల అటవీ ప్రాంతానికి, పెద్ద పులులతో సహా సుమారు 70 రకాల వన్యప్రాణులకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీంతో ఆ ప్రాంతం బోరు బావులు, కృష్ణానది ప్రాజెక్టులోని నీరు పూర్తిగా కలుషితమయంగా మారుతాయి. యురేనియాన్ని వెలికితీసే క్రమంలో నీటితో పాటుగా వాతావరణం కలుషితంగా మారుతుంది. తద్వారా చర్మవ్యాధులు రావడంతో పాటుగా రేడియేషన్ తీవ్రత పెరిగి ప్రజలకు భయానకమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పుట్టబోయే శిశువులు అంగవైకల్యం, రోగాల బారిన పడతారు. ఇక పంటలు కూడా పండవు. యురేనియం శుద్ధికి కృష్ణా జలాలను వినియోగిస్తే మత్స్య సంపద నాశనమవుతుందని పర్యావరణ వేత్తలంటున్నారు.

అలాగే హైదరాబాద్ వాసులకు మంచి నీరు బదులు విషపు నీరు సరఫరా అవుతుందని, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డితో పాటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు.. కృష్ణానది నీటిని వినియోగించే ప్రాంతాలు అన్నీ యురేనియంతో ప్రత్యక్ష, పరోక్షంగా దెబ్బతింటాయి. ఈ కారణాల రిత్యా దేశ వ్యాప్తంగా పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజలు ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. పారిస్ వంటి అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో పర్యావరణ అంశాల్ని, జీవవైవిధ్య ప్రమాదాల్ని ఎత్తి చూపుతూ ఐక్యరాజ్యసమితి (యూఎన్) తదితర సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారు. అరుదైన జాతులు అంతరించిపోయే ప్రమాదాల్ని ఎత్తిచూపి ప్రపంచ దృష్టి ఆకర్షిస్తున్నారు.

మరోవైపు తవ్వకాలకు సంబంధించిన సన్నాహాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ముమ్మరం చేసింది. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో 21 వేల ఎకరాల విస్తీర్ణంలో నమూనాల సేకరణకు కేంద్ర అణుశక్తి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని మొత్తం 83 కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యతలను తెలుసుకునేందుకు అనుమతించాలని తెలంగాణ అటవీ శాఖను కోరింది. న్యూక్లియర్ పదార్థాలు, అణు ధార్మికత వల్ల పర్యావరణ విధ్వంసమే కాక అడవులు-ఇతర సహజ వనరులు, తరాల తరబడి జీవరాశి ఆయురారోగ్యాలు క్షీణిస్తాయి. అణు వ్యర్థాలు, ఆ కణాలు కలిసిన నీరు, చివరకు ఆ రేణువుల ధూళి, గాలి కూడా ప్రమాదమే! తవ్వకాలు, వెలికితీత జరుగుతున్న చోట ఇప్పటికే కాలుష్యాల దుష్ప్ర భావంతో క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు, రేడియేషన్ ప్రభావంతో గర్భస్రావాలు, అంగ వైకల్య జననాలు... ఇలా ఎన్నెన్నో సమస్యలతో జనం సతమతమౌతున్నారు. అందుకే, అగ్ర రాజ్యాలన్నీ ఈ రకం ఉత్పత్తిని నిలిపివేశాయి. దేశ రక్షణకు అవసరమైన అణు బాంబులు మన వద్ద ఉన్నాయి. బాంబుల తయారీకి అవసరమైన యురేనియం, ఉప ఉత్పత్తులు ఇప్పటికే టన్నుల కొద్ది ఉన్నాయి. ఆరు దేశాల నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటున్నాము. అంతర్జాతీయ ఆంక్షల తొలగింపు నేపథ్యంలో ఇంకా దిగుమతి చేసుకోవచ్చు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా యురేనియం తవ్వకాలు, అదీ, అపార సహజ సంపదకు నెలవైన నల్లమల అడవుల్లో చేయడం దారుణం. అడవికి, ఔషధ మొక్కల వంటి విలువైన అటవీ సంపదకు, పులుల అభయారణ్యానికి, చెంచులు, వన్యప్రాణులు ఇతర జీవరాశికి నష్టమే కాకుండా భూగర్భ జలాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు సమీపంగా ఉన్నందున ఆ నీళ్లు కలుషితమవుతాయి. వాటిని తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాలు, గ్రామాల తాగు, సాగు అవసరాలకు వాడుతున్నందున సగటు మనిషి మనుగడ, భవిష్యత్తరాల బతుకు అగమ్యగోచరమౌతుంది.

కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తి (క్లీన్ ఎనర్జీ) అయినంత మాత్రాన ఇంత ఖర్చుకు, ఇన్ని ప్రమాదాలకూ సిద్ధపడాల్సిందేనా? అంటే...యూనిట్ అణు విద్యుత్ ఉత్పత్తి వ్యయమే రూ.30 వరకుంటుంది. భద్రతకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ, దీర్ఘకాలిక ఖర్చుల్నీ లెక్కిస్తే యూనిట్ ధర ఇంకా పెరగొచ్చని పాలసీనిపుణులు అంటున్నారు. ఇంత చేశాక కూడా ప్రమాదాలు జరగవనే గ్యారెంటీ లేదు. రష్యా, జపాన్ వంటి సాంకేతిక నైపుణ్యపు దేశాలే చెర్నోబిల్, ఫుకుషిమా ప్రమాదాలపుడు విలవిల్లాడాయి. ఇక, అందులో వందో వంతు భద్రతకూ భరోసాలేని మన వంటి దేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి? ఎన్ని వేల, లక్షల కుటుంబాలకు, భవిష్యత్తరాలకది శాపంగా మారుతుందో ఊహకూ అందని భయం! ప్యారిస్ ఒప్పందం ప్రకారం శిలాజ ఇంధన వినియోగం తగ్గించి, పునర్వినియోగ యోగ్య ఇంధనాలకు వెళ్లాలనే మాట నిజమే! అయితే, అది అణువిద్యుత్తే కానవసరం లేదు. అడవుల్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికన్నా అటవీ అధికారులపైనే ఎక్కువగా ఉంది. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం గనిలో వెలికితీతకు చెందిన సమస్యలన్నింటినీ అధిగమించామని, ప్రస్తుతం అక్కడి నుంచి ఉత్పత్తి సాఫీగా జరుగుతోందని యూసీఐఎల్ అంటోంది. వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రాజెక్టుల కోసం అడవుల్ని నరికినపుడు ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం లభించే నష్టపరిహార (కంపా) నిధుల్నీ సవ్యంగా వినియోగించరు. జనం అప్రమత్తం కావడమొకటే పరిష్కారం.

పరిణామాలు ఎలా ఉంటాయి?
స్పందనకు ప్రతిస్పందన రసాయన శాస్త్ర భాషలో చెప్పాలంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అణ్వాయుధాలు, అణువిద్యుత్తు తయారీకి మాత్రమే యురేనియంను ప్రపంచదేశాలు ప్రధానంగా వినియోగిస్తున్నాయి. వాటి పరిణామాలు (విపత్తులు, ప్రయోగాల రూపంలో) చాలా మటుకు రుచి చూశాయి. జీరో కాలుష్యం కోసం ఏర్పాటు చేయబడిన విధానం బెడిసి కొడితే అంతా కాలుష్యమయం అవుతుంది.
అందుకు ఉదాహరణలు ఇవిగో..
  • అణ్వాయుధాలు వాడితే... రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అంటే 1945లో నూక్లియర్ వెపన్స్, అటామిక్ వెపన్స్‌ను కేవలం రెండు సార్లు మాత్రమే యూఎస్ ప్రయోగించింది. హిరోషిమా, నాగసాకి...ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. దేశ భద్రతకు అణ్వాయుధాలు ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఒకదానిపై మరొకటి ఇటువంటి అణ్వాయుధాలు ప్రయోగిస్తే మనుగడ శూన్యం.
  • అణువిద్యుత్తు రియాక్టర్లలో లోపం తలెత్తితే.. సహజ వనరులు అధికంగా ఉన్న సోవియట్ యూనియన్ కాలుష్య రహిత విద్యుత్తును ఉత్పత్తి చేయాలని రెండు రెట్లు అధిక ఖర్చుతో కూడుకున్న యురేనియం, గ్రాఫైట్ డిజైన్ రియాక్టర్ ఉన్న నూక్లియర్ పవర్ ప్లాంట్‌ను 1954లో ప్రారంభించింది. ఒక చిన్న పొరపాటు వల్ల 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ (ఉకెయిన్) నూక్లియర్ పవర్‌ప్లాంట్ డిజాస్టర్ జరిగింది. 50 టన్నుల నూక్లియర్ ఫ్యూయల్ వాతావరణంలో కలిసి పోయింది. ఇది హిరోషిమా కంటే 10 రెట్లు ఎక్కువ. రేడియేషన్ సోవియట్ యూనియన్‌తో పాటు, యూరఫ్ వరకు వ్యాపించింది. నూక్లియర్ పవర్ వల్ల 30 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచంలోనే అత్యంత రెడియో యాక్టివ్ ఏరియాగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 99 కి పైగా నూక్లియర్ డిజాస్టర్స్ జరిగాయి. ఫలితంగా ఆయా ప్రదేశాల్లో వర్షాలు పడకపోవడం, తరతరాలను వీడని మొండి వ్యాధులు, భూమి కలుషితమై పంటలు పండక పోవడం, వృక్ష, జీవ సంపద కోల్పోయి... దుర్భర పరిస్థితులగుండా వెళ్తున్నాయి.

ప్రత్యామ్నాయ మార్గాలు లేవా?
ఉన్నాయి. ఆలోచిస్తే ఆరువేల ఉపాయాలు అనే సామెత ఊరికే పుట్టలేదు. భారీ ప్రాజెక్టులు కాకుండా చిన్న, మధ్యతరగతి జల విద్యుత్తు, సౌర, పవన విద్యుత్తు...ఇలా చాలా ఉన్నాయి.. అవి ప్రమాదరహితం. కాలుష్య రహితమైన సౌర విద్యుదుత్పత్తి వ్యయం ఇప్పటికే బాగా తగ్గింది. ఇంకా తగ్గించే పరిశోధనలు జరుగుతున్నాయి. వందల, వేల ఎకరాల్లో పలకలు (ప్యానల్స్) వేయడం కాకుండా వికేంద్రీకృత పద్ధతిన ఇళ్లపైన, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేసుకునే వ్యవస్థను బలోపేతం చేయాలి. అణువిద్యుత్తే అనివార్యమైతే ప్రత్యామ్నాయ మార్గాలు వెదకాలే గానీ... అడవులను కల్లోల పరచి ప్రకృతి సంపదను విధ్వంసం చేయడం, పర్యావరణాన్ని మరింత నాశనం చేసే దిశగా అడుగులు వేయడం సరైనపని కాదు. ఎనర్టీ అల్టర్‌న్నేటివ్స్‌లో నూక్లియర్ ఒకటి మాత్రమే. అదే ప్రత్యామ్నాయం కాదు. అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలే తప్ప బలాన్ని, ఆధిపత్యాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే పర్యావసానం అందరూ అనుభవించాల్సిందే!
Published date : 09 Oct 2019 01:21PM

Photo Stories