Skip to main content

మిషన్ శక్తి ప్రయోగం విజయవంతం

ఆపరేషన్ ‘మిషన్ శక్తి’ పేరుతో భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి(ఏశాట్) ప్రయోగం విజయవంతమైంది.
ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న డా.ఏపీజే అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి భారత రక్షణశాఖ, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) సంయుక్తంగా మార్చి 27న ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. భూదిగువ కక్ష్యలో 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న పనిచేయని ఓ ఉపగ్రహాన్ని ఏశాట్ క్షిపణి 3 నిమిషాల్లో కూల్చివేసింది. దీంతో అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం సాధించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.

మూడుదశల్లో ప్రయోగం...
ఏశాట్ క్షిపణి ప్రయోగాన్ని ప్రధానంగా మూడుదశల్లో నిర్వహించారు. తొలుత భారత భూభాగంపై నిఘాపెట్టిన ఓ ఉపగ్రహాన్ని భూమిపైన ఉన్న రాడార్లు గుర్తించాయి. ఓసారి టార్గెట్‌ను లాక్‌చేసిన అనంతరం మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రెండోదశలో భాగంగా భూమి నుంచి నిర్ణీత ఎత్తులోకి వెళ్లాక ఏశాట్‌కు అమర్చిన హీట్‌షీల్డ్స్ తొలగిపోయాయి. మూడో దశలో భాగంగా రాడార్ సాయంతో ఏశాట్ క్షిపణి లక్ష్యంవైపు దూసుకుపోయి నిర్దేశిత ఉపగ్రహాన్ని కూల్చివేసింది.

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి...
అంతరిక్షంలోని శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల ఏశాట్ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. ఖండాంతర క్షిపణి కార్యక్రమం (ఐడీబీఎం)లో భాగంగా అభివృద్ధి చేసిన ఏశాట్ క్షిపణిని మిషన శక్తి ప్రయోగంలో ఉపయోగించారు. వ్యూహాత్మక రక్షణ అవసరాలకోసం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితమే ఆమోదముద్ర లభించిందని డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు.

జాతినుద్దేశించి మోదీ ప్రసంగం...
మార్చి 27న జాతినుద్దేశించి కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మోదీ ప్రసంగిస్తూ... భారత్ ‘శాటిలైట్ విధ్వంసక క్షిపణి’(ఏశాట్)ని విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు. ఇప్పటివరకూ భూ,జల, వాయు మార్గాల్లో పటిష్టంగా ఉన్న మనం అంతరిక్షంలోనూ మన ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నామని చెప్పారు. ఏశాట్ ప్రయోగం సందర్భంగా భారత్ ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.

మరోవైపు భారత్ దగ్గర 2007 నుంచి ఏశాట్ సాంకేతికత ఉందని ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ తెలిపారు. కానీ ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ప్రయోగాన్ని చేపట్టలేదని వెల్లడించారు.

ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదు...
ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్చి 27న జాతినుద్దేశించి ప్రసంగించడం ద్వారా ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి ఫిర్యాదు చేశాయి. దేశ రక్షణకు సంబంధించిన అంశాలు, ప్రకటనలపై ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదని ఈసీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ వ్యవహారంపై విచారణకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
Published date : 28 Mar 2019 05:37PM

Photo Stories