Skip to main content

ఇస్రో చరిత్రలోనే ‘బరువైన’ ప్రయోగం

ఇస్రో చరిత్రలోనే తొలిసారిగా జూలై 10న వాణిజ్యపరంగా అత్యధిక బరువైన పేలోడ్‌ను ఇస్రో.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ) ద్వారా నింగికి పంపేందుకు సిద్ధమవుతోంది.
ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ‘సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్(ఎస్‌ఎస్‌టీఎల్)’ రూపొందించిన ఐదు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ28 ద్వారా నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రోకు కీలక మైలురాయి అయిన నేపథ్యంలో ఈ ప్రయోగం గురించి పలు విశేషాలు...
  • బ్రిటన్ ఉపగ్రహాలివే.. డీఎంసీ3-1, డీఎంసీ3-2, డీఎంసీ3-3, సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్‌సెయిల్. వీటిలో డీఎంసీ3 ఉపగ్రహాలు ఒక్కోటి 447 కిలోలు, సీబీఎన్‌టీ-1 శాటిలైట్ 91 కిలోలు, డీ-ఆర్బిట్‌సెయిల్ 7 కిలోలు మొత్తం 1,440 కిలోల బరువుంటాయి.
  • డీఎంసీ3 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ 647 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలోకి, ఒక్కో ఉపగ్రహానికి మధ్య 120 డిగ్రీల కోణంలో తేడా ఉండేలా ప్రవేశపెట్టనుంది.
  • ప్రతిరోజూ భూమిపై ఏ లక్ష్యాన్ని నిర్దేశించినా, ఇవి ఫొటోలు తీయగలవు. ప్రధానంగా వనరులను సర్వే చేయడం, పర్యావరణ అధ్యయనం, ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ వంటి వాటికి ఇవి ఉపయోగపడనున్నాయి.
  • ఒక్కోటి 3 మీటర్ల పొడవుండే మూడు ఉపగ్రహాలనూ ప్రస్తుత పేలోడ్‌లోనే ఉంచి ప్రయోగించడమనేది ఇస్రోకు సవాలు కానుంది. ఇందుకోసం వృత్తాకార లాంచర్ అడాప్టర్‌ను, త్రికోణాకారంలోని మల్టిపుల్ శాటిలైట్ అడాప్టర్-వెర్షన్ 2(ఎంఎస్‌ఏ-వీ2) వేదికనూ ఇస్రో ప్రత్యేకంగా తయారు చేసింది.
  • ఇక సీబీఎన్‌టీ-1, డీ-ఆర్బిట్‌సెయిల్ ఉపగ్రహాలను సాంకేతికత ప్రదర్శన కోసమే బ్రిటన్ రూపొందించింది. సీబీఎన్‌టీ-1ని భూ పరిశీలన టెక్నాలజీని పరీక్షించుకోవడం కోసం పంపనుండగా.. పలుచని తెరచాప లాంటి సెయిల్ ఆధారంగా వస్తువులను క్రమంగా దిగువ కక్ష్యలోకి రప్పించే టెక్నాలజీని పరీక్షించుకోవడం కోసం డీ-ఆర్బిట్‌సెయిల్ నానో ఉపగ్రహాన్ని పంపనున్నారు.
Published date : 07 Jul 2015 01:13PM

Photo Stories