Skip to main content

దిగ్విజయంగా నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ - 40

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది.
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత జనవరి 12న ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్‌ఎల్వీ సీ-40 వాహకనౌక కార్టోశాట్-2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్‌ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే.

మైలురాయిగా 100వ ఉపగ్రహం...
నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్‌లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్‌ఎల్వీ మిషన్ ఇదే.

ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్-2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్‌లాండ్, ఫ్రాన్‌‌స, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి.
Published date : 13 Jan 2018 02:46PM

Photo Stories