Skip to main content

దేశంలో మొట్టమొదటి లిథియం రిఫైనరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?

బ్యాటరీ-గ్రేడ్ పదార్థాలను ఉత్పత్తి చేయడానికి లిథియం ధాతువును ప్రాసెస్ చేసే భారతదేశపు మొదటి లిథియం రిఫైనరీ గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నారు. లిథియం అనేది రాయి. దాని సింబ‌ల్ ఎల్ఐ. అణు సంఖ్య 3 ఉన్న రసాయన మూలకం. ఇది మృదువైన, వెండి-తెలుపు క్షార లోహం. ప్రామాణిక పరిస్థితులలో, ఇది తేలికైన లోహం, తేలికైన ఘన మూలకం.
అన్ని క్షార లోహాల మాదిరిగా, లిథియం అధిక రియాక్టివ్, మండేది గుణం క‌ల‌ది. ఖనిజ నూనెలో నిల్వ చేయాలి. లిథియం-అయాన్ బ్యాటరీ లేదా లి-అయాన్ బ్యాటరీ ఒక రకమైన పునర్వినియోగపరచదగిన బ్యాటరీ. లిథియం-అయాన్ బ్యాటరీలను సాధారణంగా పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉపయోగిస్తారు. సైనిక, ఏరోస్పేస్ అనువర్తనాలకు ఆదరణ పెరుగుతోంది.

దేశంలో అతి పెద్ద విద్యుత్ వ్యాపారం, పునరుత్పాదక ఇంధన సంస్థలలో ఒకటైన మణికరన్ పవర్ లిమిటెడ్ ఈ రిఫైనరీని స్థాపించడానికి సిద్ధమవుతోంది. ఈ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి వారు ప్రస్తుతం సనంద్, ధోలేరాలోని రెండు ప్రదేశాలను చూసి ఏది మంచిదో అన్వేషిస్తున్నారు.

లిథియం అనేది భారతదేశంలో సాధారణంగా కనిపించని అరుదైన మూల‌కం. అందుకు ఈ కంపెనీ, ఆస్ట్రేలియా నుంచి లిథియం ధాతువును దిగుమతి చేసుకోని దాన్ని ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే విధంగా కనిపిస్తున్నందున, లిథియం బ్యాటరీల దేశీయ తయారీకి ముడి పదార్థాల సరఫరాను భద్రపరచడానికి గుజరాత్‌కు ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ సహాయపడుతుందని భావిస్తున్నారు.

2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను 30% కి పెంచాలని భారతదేశం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన లిథియాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలో అత్యధిక లిథియం ఉత్పత్తి చేసే దేశాలు ఆస్ట్రేలియా, చిలీ, చైనా, అర్జెంటీనా, జింబాబ్వే, పోర్చుగల్.
Published date : 26 Jan 2021 02:49PM

Photo Stories