అంతరిక్ష ప్రయోగాలు
Sakshi Education
- పీఎస్‌ఎల్‌వీ-సీ42
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. 2018, సెప్టెంబర్ 16న పీఎస్‌ఎల్‌వీ-సీ42 వాహక నౌక ద్వారా బ్రిటన్‌కు చెందిన భూపరిశీలక ఉపగ్రహాలు నోవాసార్ (NovaSAR), ఎస్1-4లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నోవాసార్ అనేది ఎస్-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్) ఉపగ్రహం. దీని లిఫ్ట్ ఆఫ్ బరువు 445 కిలోలు. దీనిద్వారా అటవీ పరిశీలన, భూపరిశీలనతో పాటు వివిధ విపత్తుల గురించి తెలుసుకోవచ్చు. ఉపగ్రహంలోని ఎస్‌ఏఆర్ పేలోడ్‌ను ఉపయోగించి సముద్ర వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయొచ్చు. సముద్రంలో రాకపోకలు సాగించే నౌకలకు వాతావరణ సమాచారాన్ని అందజేయొచ్చు. అవసరం మేరకు నౌకల గమనాన్ని గుర్తించొచ్చు.
ఎస్1-4.. హై రిజల్యూషన్ ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం. దీని లిఫ్ట్ ఆఫ్ బరువు 444 కిలోలు. ఇది భూమికి సంబంధించి అత్యంత స్పష్టతతో సమాచారం అందిస్తుంది. పర్యావరణం, పట్టణ నిర్వహణ, విపత్తులు తదితరాల అధ్యయనానికి ఉపయోగపడుతుంది.
- పీఎస్‌ఎల్‌వీ-సీ43/హైసిస్ మిషన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 2018, నవంబర్ 29న పీఎస్‌ఎల్‌వీ-సీ43 ద్వారా 31 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటిలో భారత్‌కు చెందిన హైసిస్ (HysIS-హైపర్ స్ప్రెక్టల్ ఇమేజింగ్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర ఎనిమిది దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలున్నాయి. ఈ ప్రయోగ నిర్వహణకు దాదాపు రెండు గంటలు పట్టింది. ముఖ్యంగా పీఎస్‌ఎల్‌వీ-సీ43లో 4వ దశ(ద్రవస్థితి ఇంధనం)ను రెండుసార్లు మండించారు. మొదటిసారి మండించడం ద్వారా హైసిస్‌ను 636 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తిత ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టారు. తర్వాత విదేశీ ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా కక్ష్యలో చేర్చారు.
గతంలో రెండుసార్లు ఇస్రో సుదీర్ఘ ప్రయోగాలు చేపట్టింది. అవి.. 1. పీఎస్‌ఎల్‌వీ-సీ40 (2018, జనవరి 12; 31 ఉపగ్రహాలు) ప్రయోగం. దీనికి దాదాపు రెండు గంటల 21 నిమిషాలు పట్టింది. 2. పీఎస్‌ఎల్‌వీ-సీ35 (2016, సెప్టెంబర్ 26; 8 ఉపగ్రహాలు) ప్రయోగం.
హైసిస్ ప్రత్యేకతలు
- ‘చోటాభీమ్’గా పేరొందిన హైసిస్ ఉపగ్రహాన్ని భూ పరిశీలన అవసరాల కోసం ఇస్రో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించింది. దీని బరువు 380 కిలోలు. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లు.
- ఇందులోని పేలోడ్లు: విజిబుల్ అండ్ నియర్ ఇన్‌ఫ్రారెడ్ (వీఎన్‌ఐఆర్), షార్ట్‌వేవ్ ఇన్‌ఫ్రారెడ్(ఎస్‌డబ్ల్యూఐఆర్) బ్యాండ్లలో రెండు స్పెక్ట్రోమీటర్లు.
- వ్యవసాయం, అడవులు, భూసర్వే, భూగర్భ జలాలు, తీరప్రాంతాలు, దేశీయ జలమార్గాలు, పరిశ్రమల కాలుష్యం తదితర రంగాలకు హైసిస్ సేవలందించనుంది. ఉపగ్రహంలోని హైపర్ స్ప్రెక్టల్ ఇమేజింగ్ కెమెరా సహాయంతో స్పష్టమైన చిత్రాలు తీసేందుకు వీలవుతుంది. ముఖ్యంగా ఇది గతంలో ఉపయోగించిన ఆప్టికల్ లేదా రిమోట్ సెన్సింగ్ కెమెరాల కంటే స్పష్టమైన చిత్రాలు తీస్తుంది. దీనివల్ల దేశ సరిహద్దుల్లో భద్రతా వ్యవస్థ బలోపేతమవుతుంది.
- హైసిస్‌కు ముందు హైపర్ స్ప్రెక్టల్ ఇమేజింగ్ సాంకేతికతను ఇస్రో రెండుసార్లు ఉపయోగించింది. తొలిసారిగా 2008, ఏప్రిల్ 28న కార్టోశాట్-2ఏతో పాటు ప్రయోగించిన ఇండియన్ మినీ శాటిలైట్ (ఐఎంఎస్)-1లో ఉపయోగించారు. రెండోసారి 2008, అక్టోబర్ 22న చేపట్టిన చంద్రయాన్-1లో చంద్రుని ఉపరితలంపై ఖనిజాల అన్వేషణ కోసం వినియోగించారు. అయితే హైసిస్‌లో హెపర్ స్ప్రెక్టల్ ఇమేజింగ్ సాంకేతికత పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించడం విశేషం.
- పీఎస్‌ఎల్‌వీ-సీ43.. కోర్ అలోన్ వెర్షన్ అంతరిక్ష వాహక నౌక. దీని బరువు తక్కువగా ఉంటుంది.
- పీఎస్‌ఎల్‌వీ-సీ44
ఇస్రో 2019, జనవరి 24న పీఎస్‌ఎల్‌వీ-సీ44 వాహక నౌక సహాయంతో మైక్రోశాట్-ఆర్, కలాంశాట్-వీ2 ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో ఇది 46వ ప్రయోగం. సాధారణంగా పీఎస్‌ఎల్‌వీలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. కానీ, పీఎస్‌ఎల్‌వీ-సీ44లో కేవలం రెండు స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగించి పీఎస్‌ఎల్‌వీ-డీఎల్‌గా పేరు పెట్టారు. ఈ వాహక నౌక ఎత్తు 44.4 మీటర్లు.
కలాంశాట్-వీ2: దీన్ని తమిళనాడుకు చెందిన విద్యార్థులు రూపొందించారు. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీన్ని 453 కి.మీ. ఎత్తులో సూర్యానువర్తిత ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టారు.
మైక్రోశాట్-ఆర్: ఈ ఉపగ్రహాన్ని దేశ రక్షణ అవసరాల కోసం రూపొందించారు. దీన్ని 274 కి.మీ. ఎత్తులో కక్ష్యలో ప్రవేశపెట్టారు.
- జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ2/ జీశాట్-29 మిషన్
ఇస్రో 2018, నవంబర్ 14న సతీశ్‌ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ2 వాహక నౌక ద్వారా జీశాట్-29 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టింది. జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి ఉపగ్రహాన్ని విజయవంతంగా చేర్చింది.
జీశాట్-29 ఉపగ్రహం: ఇది మల్టీ బీమ్, మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. పదేళ్లపాటు సేవలందించేలా దీన్ని ప్రయోగించారు. పూర్తిస్థాయిలో సమాచార వ్యవస్థలు అందుబాటులో లేని జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి, అంతర్జాల సేవలు అందించేందుకు వీలుగా పేలోడ్‌లను రూపొందించారు.
ఉపగ్రహంలోని పేలోడ్లు: కేయూ బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్‌బీమ్స్, కేఏ-బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్‌బీమ్స్, వన్ యూజర్ స్టీరబుల్ బీమ్, క్యూ/వీ-బ్యాండ్ కమ్యూనికేషన్ పేలోడ్, జియో హై రిజల్యూషన్ కెమెరా, ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్. జియో స్టేషనరీ హైరిజల్యూషన్ కెమెరాతో 55 మీటర్ల రిజల్యూషన్‌తో చిత్రాలు తీయొచ్చు. కేయూ బ్యాండ్, కేఏ బ్యాండ్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కమ్యూనికేషన్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్ కార్యక్రమాల ప్రసారం తేలికవుతుంది. జీశాట్-29తో మారుమూల ప్రాంతాలు ఇంటర్నెట్‌తో అనుసంధానమవుతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరులు, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. సైనిక అవసరాలనూ తీర్చుతుంది.
జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-డీ2: మూడు దశలున్న ఈ వాహక నౌక బరువు 640 టన్నులు. ఎత్తు 43.494 మీటర్లు. 4 టన్నుల బరువుగల ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 ద్వారా జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టొచ్చు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే గగన్‌యాన్‌కు జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ను ఇస్రో ఉపయోగించనుంది.
Published date : 04 Mar 2019 03:06PM