జైపూర్ సాహిత్యోత్సవం (జేఎల్‌ఎఫ్)
Sakshi Education
జైపూర్ సాహిత్యోత్సవం (జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)ను ఏటా జనవరిలో జైపూర్‌లో నిర్వహిస్తారు. 2006లో ప్రారంభమైన జేఎల్‌ఎఫ్ ఆసియా ఖండంలో కెల్లా అతిపెద్ద సాహిత్య ఉత్సవం.
8వ జేఎల్‌ఎఫ్‌ను 2015 జనవరి 21 నుంచి 25 వరకు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని డిగ్గీ ప్యాలెస్‌లో నిర్వహించారు. నమిత గోఖలే, విలియం డాల్‌రింపుల్ ఈ ఉత్సవానికి డెరైక్టర్లుగా వ్యవహరించారు. నోబెల్ సాహితీ బహుమతి గ్రహీత వి.ఎస్. నైపాల్, 2013 మ్యాన్ బుకర్ ప్రైజ్ గ్రహీత అయిన న్యూజిలాండ్ రచయిత్రి ఎలినార్ కాటన్‌తో పాటు భారత్‌కు చెందిన ప్రఖ్యాత రచయితలు కేదార్‌నాథ్ సింగ్, నీల్ ముఖర్జీ, అమీష్ త్రిపాఠీ, చేతన్ భగత్ తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 2015 జనవరి 21న దీన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రారంభించారు. తొలిరోజున పులిట్జర్ బహుమతి గ్రహీత విజయ్ శేషాద్రి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అరవింద్ కృష్ణ మెహరోత్రా ప్రసంగించారు.
- సర్ వి.ఎస్. నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఫర్ మిష్టర్ బిస్వాస్’ పుస్తకం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
- కవిత్వం విభాగంలో అందజేసే కుష్వంత్ సింగ్ మెమోరియల్ ప్రైజ్‌ను అరుంధతి సుబ్రమణ్యం అనే రచయిత్రికి ప్రదానం చేశారు. ఈమె రచించిన ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’కు ఈ బహుమతి లభించింది.
- నాలుగో రోజైన జనవరి 24న భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
- జైపూర్ సాహితీ ఉత్సవంలో ప్రతిష్టాత్మక ‘డీఎస్‌సీ ప్రైజ్ ఫర్ సౌత్ ఏసియాన్ లిటరేచర్ 2015’ను భారత - అమెరికన్ రచయిత్రి ఝుంపా లాహిరికి ప్రకటించారు. ‘ద లో ల్యాండ్’ పుస్తకానికి గాను ఆమెకు ఈ బహుమతి లభించింది. ఈ అవార్డు కింద 50 వేల అమెరికన్ డాలర్ల నగదు అందజేస్తారు. ‘ద లో ల్యాండ్’ పుస్తకం 2013 మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు కూడా షార్‌ట లిస్ట్ అయ్యింది.
సం. | రచయిత/ రచయిత్రి | దేశం | నవల పేరు |
2011 | హెచ్.ఎం. నఖ్వీ | పాకిస్తాన్ | హోమ్‌బాయ్ |
2012 | షెహాన్ కరుణ తిలక | శ్రీలంక | చైనామ్యాన్ |
2013 | జీత్ థాయిల్ | భారత్ | నార్కోపోలీస్ |
2014 | సైరస్ మిస్త్రీ | భారత్ | క్రానికల్ ఆఫ్ ఎ కార్ప్స్ బేరర్ |
2015 | ఝుంపా లాహిరి | భారతీయ అమెరికన్ | ద లో ల్యాండ్ |
Published date : 03 Feb 2015 10:59AM