Skip to main content

సోషల్ మీడియా – సమీక్ష

ఇంటర్నెట్ లో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు మానవ హక్కుల పరిరక్షణకు, అసమానతలపై పోరాటానికి, మానవాభివృద్ధినీ, ప్రగతినీ పెంచడానికీ దోహదం చేస్తున్నాయి. కనుక అన్ని దేశాలూ అంతర్జాలాన్ని సార్వజనీన మీడియాగా భావించి ప్రజకలందజేయడానికి తగిన ప్రాధాన్యతనివ్వాలి. – ఐక్యరాజ్య సమితి

ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్, సోషల్ మీడియా అత్యంత ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్యంగా అరబ్ దేశాలలో విప్లవాలకు కారణం సోషల్ మీడియానే. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడంలో సోషల్ మీడియా తన వంతు పాత్రను విజయవంతంగా నిర్వర్తించింది. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా సమాచారం క్షణాల్లో చేరే అవకాశం ఉండడం వల్ల వెంటనే నిరసనలు, ఉద్యమాలు, ఉద్రిక్తతలు గురించి సమాచారం చేరవేయడంలో సోషల్నెట్వర్క్ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ప్రారంభంలో వ్యక్తిగత స్థాయిలో దూరప్రాంతాలోని స్నేహితుల్ని, బంధువుల్ని కలపడానికి ఉపయోగపడే సోషల్మీడియా ప్రస్తుతం వ్యాపారాలు, వృత్తులు, మార్కెటింగ్ వంటి వాటిని వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకో కోణం చూస్తే గాలివార్తలు వ్యాపింపజేయడం, నేరాలకు దోహదం చేయడం, అభాండాలు వేయడం వంటి పనుల వల్ల పోలీసు కేసులైన సంఘటనలు ఎక్కవుగానే కనిపిస్తున్నాయి. ఇలా అనేక కార్యకలాపాలతో సోషల్ మీడియా చాలా వేగవంతంగా విస్తరిస్తోంది.

మనిషి సంఘజీవి కాబట్టి సహజంగా సామాజిక పరిచయాలను కోరుకుంటాడు. దీనిలో తనకు ముందే పరిచయమున్న ఒక వ్యక్తి ద్వారా అతనికి పరిచయ మున్నమరో వ్యక్తిని కలుసుకొంటాడు. ఈ విధంగా అనేక మంది కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకొంటాడు. దీన్ని కొన్ని సార్లు ఫ్రెండ్-ఆఫ్-ఎ-ఫ్రెండ్ అని కూడా అంటారు. ప్రధానంగా ఇటువంటి ఉద్దేశ్యంతో మొదలైన సైట్స్ నే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ అంటారు. సాధారణంగా కొన్ని నెట్ వర్కింగ్‌సైట్స్ పూర్తిగా సామాజిక పరమైనవి. ఇవి తమ వినియోగ దారులను స్నేహితులను పెంపొందించుకోవడానికి లేక రోమాంటిక్ రిలేషన్ షిప్స్ కొరకు మాత్రమే అనుమతిస్తాయి. మరికొందరు తమ వ్యాపారాన్నివిస్తరించించేందుకు వీటిని వినియోగిస్తున్నారు.

సోషల్ నెట్ వర్కింగ్ సర్వీసు (సామాజిక అనుసంధాన వేదిక సేవలు)
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని చర్చిల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ జె.ఎ. బార్నెస్ 1950వ దశాబ్దంలో మొట్టమొదటిసారిగా సోషల్ నెట్ వర్కింగ్ అనే పదాన్ని ఉపయోగించాడు. కుటుంబం, వృత్తి, అభిరుచి, అలవాట్ల ప్రాతిపదికగా ఏర్పడే ప్రజా బృందాలనే సోషల్ నెట్ వర్క్ లుగా బార్నెస్ నిర్వచించారు. అయితే ప్రస్తుతం ఈ పదాన్ని కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఆధారిత నెట్ వర్కింగ్ వెబ్ సైట్లకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఇంటర్నెట్ (అంతర్జాలం) ద్వారా లభించే ఆన్ లైన్ వేదికను సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ అంటున్నారు. దీని ద్వారా వివిధ వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాలు ఏర్పడి సోషల్ నెట్ వర్క్లుగా మారతాయి. ఇవి ఒకే రకమైన అభిరుచులు కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడవచ్చు. లేదా ఒకే ప్రయోజనాలు, కార్యక్రమాలు, నేపథ్యాలు కలిగిన వ్యక్తులు, బృందాల మధ్య ఏర్పడేవి కావచ్చు లేదా నిజజీవితంలో స్నేహితులు, బంధువుల మధ్య ఏర్పడేవి కావచ్చు. ఈ సోషల్ వెబ్ సైట్లలో ప్రతీ వ్యక్తీ తన పేరు, వివరాలు, వృత్తి, ఆసక్తి, అభిరుచులతో కూడిన ప్రొఫైల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా స్నేహితులతోనూ, కొత్తగా మిత్రులయ్యే వారితోనూ ఆన్ లైన్లో సంభాషించవచ్చు, బంధాలు పెంచుకోవచ్చు.

సోషల్ మీడియా
వెబ్ ఆధారిత, మొబైల్ ఆధారిత సాంకేతికతలను భావ ప్రసారానికి ఉపయోగించడం, తద్వారా వివిధ సంస్థలు, వర్గాలు, వ్యక్తుల మధ్య కంప్యూటర్లు, ఫోన్లలోనే చర్చలు, సంభాషణలు జరగడాన్ని స్థూలంగా సోషల్ మీడియాగా చెప్పుకోవచ్చు. వినియోగదారులు ఉత్పత్తి చేసే సమాచారం (కంటెంట్) ఆధారంగానే నడిచే వెబ్ ఆధారిత సైట్లను లేదా సాంకేతికతలను లేదా ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషనల్లను సోషల్ మీడియా అంటారు. సోషల్ మీడియా అప్లికేషన్లు పలురకాలుగా విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్ మ్యాగజైన్లు, ఫోరంలు, వెబ్ బ్లాగులు, మైక్రో బ్లాగులు, వికీస్, పాడ్ కాస్ట్ లు, బొమ్మలు, వీడియోలు, రేటింగ్, సోషల్ బుక్ మార్కెటింగ్ సైట్లు మొదలైనవి సోషల్ మీడియాకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ అప్లికేషన్లలోని సమాచారాన్ని లేదా అంశాలను బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు.
  1. వివిధ రచయితలు, వెబ్ వినియోగదారులు, విశ్లేషకులు తదితరులు అంతా కలిసి తయారు చేసేవి (ఉదా: వికీ పిడియా, గూగుల్ మొదలైనవి).
  2. వివిధ అంశాలపై ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేసే బ్లాగులు, మైక్రో బ్లాగులు (ఉదా: ట్విట్టర్ లాంటివి).
  3. సమాచారం లేదా కంటెంట్ ను అందించేవి (యూట్యూబ్)
  4. నెట్ లో గేమ్ లు ఆడేవి.
  5. స్నేహితులతోనూ, వెబ్ ద్వారా స్నేహితులైన వారితోనూ కమ్యునికేషన్లు జరిపే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు (ఫేస్ బుక్ లాంటివి) వీటిలో ఫేస్ బుక్, ట్విట్టర్, మై స్పేస్ లు అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు.
భారతదేశంలో సోషల్ మీడియా
సమాచార సాంకేతిక రంగాలకు ప్రాధాన్యతనిచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని శరవేగంగా నేర్చుకొని, ప్రపంచదేశాలకు విస్తృత సేవలందిస్తూ, ఈ రంగంలో మొదటి వరుస దేశాల్లో స్థానం సంపాదించుకుంది భారతదేశం. అలాగే అంతర్జాలాన్ని వేగంగా అందుకుని దాని ప్రయోజనాల్ని పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు పలు కొత్త ఆవిష్కరణలకు భారతీయులు దారివేశారు. ఈ రంగంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు అందుబాటులోకిరావడంతో పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అతి స్వల్పకాలంలోనే మనదేశంలో, ముఖ్యంగా యువతలో ఈ సైట్లు అమితమైన ప్రజాదరణను పొందాయి.

భారత్ లో సోషల్ మీడియా విస్తరణపై నీల్సన్ కంపెనీ చేసిన సర్వే నివేదిక ప్రకారం మనదేశంలో సోషల్ మీడియా ఏటా 100 శాతం వృద్ధి చెందుతోంది. 2012 చివరి నాటికి 4కోట్ల 5 లక్షల వినియోగదారులున్నారని లెక్కగట్టారు. వీరిలో 86 శాతం మంది మొబైల్ ఫోన్ల ద్వారా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తుండగా, 60 శాతం మంది కంప్యూటర్ల ద్వారా వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాని వ్యాపార విస్తరణకి సరికొత్త ఆవిష్కరణగా భారతీయులు భావిస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ వినియోగదారుల్లో సగానికి పైగా తమ సైట్లలో కనిపించే వివిధ బ్రాండ్లను గుర్తిస్తున్నారు.

భారత్, ఇతర ప్రపంచ దేశాలలో సంప్రదాయ మీడియాకి సోషల్ మీడియా పెనుసవాలు విసురుతోంది. పరస్పరం మాట్లాడుకునే పాత తరహా పద్ధతిని సోషల్ మీడియా దెబ్బతీస్తున్నదనే విమర్శలు ఉన్నప్పటికీ కొత్త కొత్త పద్ధతుల్లో ఈ లోటును పూడుస్తుంది.

సోషల్ నెట్ వర్కింగ్, సోషల్ మీడియా వృద్ధికి దోహదం చేసిన ప్రముఖ సాధనాలలో మొబైల్ ఫోన్ ఒకటి. నీల్సన్ నివేదిక ప్రకారం సోషల్ మీడియాతో అనుసంధానానికి చాలా మంది స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్ లను వాడుతున్నారు. వాటికున్న అధిక కనెక్టివిటీ కారణంగా వినియోగదారులకు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా, ఎలా కావాలన్నా సోషల్ మీడియా వాడుకునే స్వేచ్ఛ లభించింది.

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఎంఎఐ) నివేదిక ప్రకారం పట్టణ భారతంలో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 2012 డిసెంబర్ నాటికి 6కోట్ల 2లక్షల చేరుకుంది. పట్టణ ప్రాంత భారతీయులలో విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు సోషల్ మీడియాను వాడుతున్నారు.

సోషల్ మీడియాను చురుకుగా వాడుతున్న భారతీయుల సంఖ్య 3కోట్ల 2 లక్షల మంది (మొబైల్ ఇంటర్నెట్ బేస్ లో 82 శాతం). సాధారణంగా పద్ధతిలో వాడే....... ఇంటర్నెట్ కంటే 72 శాతం వారితో పోల్చినట్లయితే మొబైల్ యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులలో ఎక్కువగా (82శాతం) సోషల్ మీడియాను వాడుతున్నారు. భారతదేశంలోని 35 పెద్ద నగరాలను పరిశీలించినట్లయితే (మొత్తం 2కోట్ల 3 లక్షల మంది) 77 శాతం లేదా కోటి8 లక్షలు మొబైల్ ఫోన్ తో సోషల్ నెట్వర్క్ని వాడుతున్నారు. మొబైల్ ద్వారా సోషల్ నెట్ వర్క్ సగటు వినియోగం వారంలో ఏడు రోజులు. భారతదేశంలో ఎక్కువగా అంటే 97 శాతం మంది ఫేస్ బుక్ ను వాడుతున్నారు.

అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు దొరకడం కూడా ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం, సోషల్నెట్వర్క్ వినియోగం పెరగడానికి ప్రధానకారణం. వివిధ పరికరాల ఆధారంగా సోషల్ మీడియా వినియోగంపై పరిశోధన చేయగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణ ప్రాంతంలో 3 కోట్ల 9 లక్షల యాక్టివ్ మొబైల్ (మొబైల్ లో ఇంటర్నెట్ ను తరచుగా వాడే) వినియోగదారులు ఉన్నారు. ఇది మొత్తం భారతదేశంలో అధికంగా ఇంటర్నెట్ వాడే వినియోగదారుల సంఖ్యలో సగం. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులను కలిపితే మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 8కోట్లు ఉంటుంది. వాస్తవానికి మొబైల్ ద్వారా ఇంటర్నెట్ ను అధికంగా సోషల్ నెట్ వర్కింగ్ కోసమే వాడతామని నీల్సన్ సర్వేలో మూడింట ఒక వంతు 33 శాతం మంది చెప్పగా, కేవలం ఈ –మెయిల్ కోసం వాడతామని కొద్దిగా తక్కువ 32 శాతం మంది తెలిపారు. సగటున భారతీయులు రోజుకు 30 నిమిషాల చొప్పున సోషల్ మీడియా సైట్ లను వాడుతుంటారు. ఇందులో ఎక్కువ మంది యువకులు 84 శాతం, కాలేజీ విద్యార్థులు 82 శాతం ఉన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 25 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న జనాభా 50 శాతం పైగా ఉంది. అలాగే 65 శాతానికి పైగా జనాభా 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉన్నారు. 2020 నాటికి సగటు భారతీయుని వయసు 29 సంవత్సరాలుగా ఉండబోతుందని అంచనా. చౌక మొబైల్ ఫోన్ లు బాగా అందుబాటులోకి రావడంతో రానున్న కొద్ది సంవత్సరాలలో భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం, అందులో సోషల్ మీడియా నెట్ వర్కింగ్ గణనీయంగా పెరుగుతుందని చెప్పవచ్చు. భారతదేశంలో సోషల్ మీడియా -2012 అనే అంశంపై ఐఎఎంఎఐ ప్రకటించిన నివేదికలో ఈ కింది విధంగా పేర్కొన్నారు.

‘‘నేడు మొబైల్ ఫోన్ ల ద్వారా సోషల్ నెట్ వర్కింగ్ పెరుగుతూనే ఉందని స్పష్టమవుతోంది. మొబైల్ ఫోన్ ల వ్యాప్తి, ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లలను, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్ ఫోన్ లను కొనే వ్యక్తుల సంఖ్య పెరగుతుండటంతో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. అందుబాటు ధరలో ఇంటర్నెట్ ప్లాన్ లు ఉండడం కూడా వినియోగదారులు పెరుగుదలకు అదనపు అంశంగా ఉపకరిస్తుంది. ’’

నెటిజన్ – సిటిజన్ అంతరం
టెలివిజన్, పత్రికల స్థాయిలో సోషల్ మీడియా ఏ మేరకు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుందనే అంశంపై ఇప్పటికి స్పష్టత రాలేదు. ఇంటర్నెట్ అందుబాటు, వినియోగంలో గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలు ఉన్నాయి. దీనిని నెటిజన్-సిటిజన్ అంతరం అనవచ్చు. అయితే బెంగళూరులో చెలరేగిన ఘర్షణలు డిసెంబర్ లో ఢిల్లీ యువతి గ్యాంగ్ రేప్ నేపథ్యంలో అప్పటికప్పుడు వేలాది మంది గుంపులు గుంపులుగా ప్రజలు ఇండియా గేట్ వద్దకు చేరిన ఘటనలు ఇందుకు అతీతం. (అదే సమయంలో సోషల్ మీడియా చొరవతో కైరోలోని తహ్రీర్ స్క్వేర్, ఢాకాలోని షాబాగ్ లో జరిగిన ప్రజా ఉద్యమాల గురించి భారతీయులందరికీ తెలయదని భావించక్కర్లేదు.) ప్రస్తుతం మూడొంతులకు మించి అంటే 34 శాతం సోషల్ మీడియా వినియోగదారులు ఎనిమిది మెట్రో పాలిటన్ నగరాలలోనే ఉన్నారు. పావు వంతు కంటే తక్కువ మంది 2 లక్షల కంటే తక్కువ జనాభా గల చిన్న పట్టణాల్లో ఉన్నారు. ఇంకా 11 శాతం మంది అంతకంటే తక్కువ జనాభా గల చిన్న పట్టణాలలో నివసిస్తున్నారు. ఐఎఎంఎఐ ప్రకారం 72 శాతం లేదా 58 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. భారతదేశంలో 2006 లో మొట్టమొదటి ఇంటర్నెట్ నివేదిక గ్రామీణ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోగా 2012 నివేదికలో కేవలం 35 పెద్ద నగరాల గురించి మాత్రమే నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా సోషల్ మీడియా లేదా నెట్ వర్కింగ్ లకు అవకాశం ఉండదు. మొబైల్ టెలిఫోన్ ఇంత అద్భుతమైన రీతిలో అభివృద్ధి చెందేదే కాదు. ఇంటర్నెట్ అందుబాటు దేశవ్యాప్తంగా పెరిగే అవకాశమున్నప్పటికీ సోషల్ మీడియా ఇప్పటి మాదిరిగానే కేవలం ఆంగ్లభాష తెలిసిన వర్గాలకే పరిమితం కానుంది. ఇది సోషల్ మీడియా ఆశించిన వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశముంది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా పెరగుతూనే ఉంది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ విషయంలో తీవ్రమైన అంతరాలు ఉండడం సోషల్ మీడియా వినియోగానికి ఆటంకంగా మారింది.

భవితవ్యం
కానీ క్రమంగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండడం, మొబైల్ ఫోన్, చేతిలో అమరే వైర్ లెస్ పరికరాల ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం వంటి అంశాలు ప్రత్యేకించి దేశంలో సోషల్ మీడియా ప్రభావం పెరుగుదలను సూచిస్తున్నాయి. ఇది సామాజిక, ఆర్థిక రంగాలలో వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన, లోతైన సమాచారాన్ని అందజేయడం ద్వారా అనేక రూపాలలో ప్రభావం చూపనుంది. అలాగే కళలు, వ్యాపారాలు, వాణిజ్య రంగాలను రూపుదిద్దడంలో, అణగారిన వర్గాలను సాధికారత పరచడంలో, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. అదే సమయంలో తప్పుడు సమాచారం పుకార్లు వ్యాప్తి చేయడం ద్వారా అయోమయం, అరాచకాలకు కూడా దారి తీస్తుంది.

రెండంచుల కత్తి అనే సామెతి మాదిరిగానే ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియాకు కూడా రెండు వైపుల పదునుంది. అవి సానుకూల – ప్రతికూల, మంచి-చెడు, సృష్టించడం- ధ్వంసం చేయడం వంటివి. అంతేకాకుండా సోషల్ మీడియా సామాజిక, ఆర్థిక, రాజకీయ ధోరణులను తక్కువ, ఎక్కువ చేయడం, కొత్తవి సృష్టించడం వంటివి కూడా చేస్తుంది. ఇంటర్నెట్ లో విజ్ఞానం, సమాచారం, అశ్లీలం ఒకే రీతిలో అందుబాటులో ఉన్నట్లుగానే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రపంచ, దేశ వర్తమాన వాస్తవాలు, ప్రభావాలు సమపాళ్లలో ఉంటాయి. ఇది ఆర్థిక వృద్ధిని పెంచడం, మానవాభివృద్ధికి దోహదం చేయడంతో పాటు రచనా చౌర్యానికి, కొత్త తరహా నేరాలు, అలవాట్లు, నైతిక విలువల పతనం, వాస్తవిక జీవితం నుండి దూరం చేయడం వంటి పరిణామాలకు కూడా అవకాశాలు కల్పిస్తుంది.

సోషల్ మీడియా ప్రభావాలు
సోషల్ మీడియా వ్యక్తిగత వ్యసనంగా మారిపోతోంది. సోషల్ మీడియా సైట్లలో సభ్యులు కానివారు తామేదో కోల్పోతున్నామని భయపడిపోతున్నారు.

ప్రయోజనాలు
కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడం, వినోద కాలక్షేపమే లక్ష్యాలుగా ఏర్పడిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ప్రస్తుతం అనేక అంశాలకు కీలక కేంద్రాలుగా మారాయి. అరబ్ విప్లవం, సామాజిక ఉద్యమాలు వంటివి జరగడానికి ప్రజలను చైతన్యం చేయడం వెనుక కీలక పాత్ర పోషించడంతో పాటు వ్యాపారాలు, సేవలు, రాజకీయాలు, వాదవివాదాలు, వివిధ పుస్తకాలు, సినిమాలపై విశ్లేషణలు తదితరాలన్నింటికీ కేంద్రం అవుతుంది.

ఒక వ్యక్తిగత, కుటుంబ, వృత్తిగత సంబంధాల్లో అనుభూతులు, ఉద్వేగాలు, అనుభవాలను పంచుకోవడానికి ఇంతకంటే మంచి మార్గాలు ఎవరికీ దొరకడం లేదంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ముఖాముఖి సంభాషణలు, చర్చలు, వివాదాల్లో ఎదుటి వ్యక్తిని లేదా వ్యక్తుల్ని మనం అన్ని వేళలా జయించలేం. అసలు కొన్ని సార్లు మన వాదనకు విలువే దక్కదు. కానీ ఈ సోషల్ మీడియా సైట్లలో ఎవరికి వారు తాము చెప్పిందే సరైనదని పొంగిపోవచ్చు. నచ్చినవారు లైక్ అంటారు. నచ్చనివారు ఏం అన్నా, విమర్శించినా మనం పట్టించుకోనక్కర్లేదు. ముఖాముఖి సంభాషణలకు సిగ్గుపడేవారు, సామాజిక సంబంధాలు నెలకొల్పుకునే కళ లేనివారు, కుంగుబాటులో ఉన్నవారు, తదితరులకు ఈ సోషల్ మీడియా వరంగా మారింది. తమ గోడునంతా వీటి ద్వారా వెళ్లబోసుకునే అవకాశం దొరుకుతోంది. తమ అభిప్రాయాలు, బాధలు వినేందుకు అనేక మంది ఉన్నారనే భావన చాలా మందికి మానసిక బలం ఇస్తోంది. అందుకే యువతరమే కాక పెద్దవారు కూడా వీటి పట్ల అత్యంత ఆదరణ కనబరుస్తున్నారు.

ఇక రాజకీయాలు, సామాజిక సమస్యలు వంటి వాటికి సోషల్ మీడియా సైట్లు అత్యుత్తమ వేదికలుగా మారాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ ద్వారా రాజకీయ ప్రచారం జరిపి రెండో సారి అధ్యక్షుడయ్యాడు. ఆయన మొదటిసారి ఎన్నికైనప్పుడు కూడా ఆన్ లైన్ ద్వారా పార్టీ ప్రచారానికి విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు ఫేస్ బుక్, ట్విట్టర్లలో అకౌంట్లు తెరిచి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం (అన్నా హజారే తదితరులు) భారీగా ప్రజాదరణకు నోచుకోవడానికి సోషల్ నెట్ వర్క్ సైట్లే కారణం. ఎన్నికల ప్రచారానికి వివిధ పార్టీలు సోషల్ నెట్ వర్క్ సైట్లను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి.

సోషల్ మీడియా ద్వారా వ్యాపార ప్రచారం చేసుకుంటూ సోషల్ బిజినెస్ జరుపుతున్న వారి సంఖ్య రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. మన దేశంలో 65శాతం పారిశ్రామిక సంస్థలు ఇప్పటికే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా ప్రచారాలు జరుపుతున్నాయని అంచనా.

సినిమా ప్రచారానికి కూడా సోషల్ మీడియా కీలకంగా మారింది. కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా సినిమా పాటలు, సీన్లు తదితరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సినిమాలకు విపరీతంగా ఉచిత ప్రచారం దొరుకుతోంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కొలవెరి డీ పాటే దీనికి పెద్ద ఉదాహరణ.

ఔత్సాహికులైన యువకులు తమ వీడియోలు, పాటలు, కథలు, ఏమైనా సరే యూట్యూబ్, ఫేస్ బుక్ లలోకి అప్ లోడ్ చేస్తే కొన్ని గంటట్లోనే వాటికి అత్యంత ప్రచారం, ఆదరణ దక్కుతున్నాయి. గతంలో ఇలాంటి వారి సంగతి ఏళ్ల తరబడి ఎవరూ పట్టించుకునేవారు కాదు.

దుష్ప్రభావాలు
సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అభిప్రాయాలనే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారనీ, మెదడుతో పనిలేకుండా పోతోందనీ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా సైట్లు వాస్తవానికి పూర్తిగా అసాంఘిక మీడియా అనీ, వీటి వల్ల వ్యక్తులు, కుటుంబాలు, బృందాల మధ్య వ్యక్తిగతంగా కలుసుకోవడం, ఇతర సంబంధాలు తగ్గి పోతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా మీద వెచ్చించడం వల్ల యువతరానికి మెదడుతో పనిలేకుండా పోయి, మానసిక, శారీరక పెరుగుదల తగ్గిపోయి నిలువ ఉన్ననీటిలో నాచు పట్టినట్లు దెబ్బతింటారని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సమాజంలో మనుషుల మధ్య అంత: సంబంధాలను సోషల్ వెబ్ సైట్లు తగ్గించివేసి తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు. ఇది వరకు వ్యక్తిగతమైన వివరాలు, సమాచారం ఇతరులకు తెలియడాన్ని చాలా మంది ఇష్టపడేవారు కాదు. కానీ ఈ సోషల్ మీడియా వల్ల ప్రతీ వ్యక్తీ వారివ్యక్తిగత వివరాలన్నింటినీ ఇంటర్నెట్ లో కొన్ని లక్షల మందికి అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాదు ప్రతీ రోజూ తామేం చేస్తున్నామో, తమ జీవితంలో అతి చిన్న వాటి నుంచీ అతి పెద్ద వాటి దాకా జరుగుతున్న మార్పులేమిటో కొంచెం కూడా గోప్యత లేకుండా బయటపెడుతున్నారు. తమ అభిరుచులే కాదు ఇష్టాయిష్టాలు, అసూయాద్వేషాలన్నింటినీ కూడా ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నారు. అదలా ఉంచి ఎవరి మీదనైనా కోపతాపాల్ని, ప్రతికూల ఉద్వేగాల్ని అన్నింటినీ ఈ వెబ్ సైట్లలో వెళ్లబుచ్చుతున్నారు. కొందరిని విమర్శించి రచ్చకెక్కిస్తున్నారు. ఈ ట్రెండ్ మారకపోతే సోషల్ నెట్ వర్క్ ప్రయోజనాల కంటే ప్రతికూల ప్రభావమే ఎక్కువనే మాట త్వరలోనే నిజమవుతుందని విమర్శకలు హెచ్చరిస్తున్నారు.

వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు వివాదాలు, విభేదాలు, విషాదాలు – దేన్నీ వదలకుండా ఆన్ లైన్ లోకి తెచ్చేసి వ్యక్తులకు ప్రైవేటు జీవితాలే మిగలకుండా చేస్తున్నాయన్న విమర్శలు ప్రధానంగా వినిపిస్తుంటే, సోషల్ మీడియా వల్ల ప్రజల్లో అనవసరమైన, అనుత్పాదక ఆసక్తులు, అలవాట్లు, వ్యయాలు పెరుగుతున్నాయనేది మరో విమర్శ. ఈ సైట్లలో ప్రసిద్ధ వ్యక్తుల మీద ఆరోపణలు, అభాండాలు, పుకార్లు యథేచ్ఛగా షికార్లు చేస్తున్నాయి. వీటిలోని విచ్చలవిడి వ్యాఖ్యానాలు, సమాచారం వల్ల పిల్లల్లో మానసికారోగ్యం దెబ్బతింటోందని నిపుణులంటున్నారు.

భావప్రకటన స్వేచ్ఛ చర్చ
సోషల్ మీడియా వెబ్ సైట్ లలో చర్చ, సృష్టి, సహకారం, పంచుకోవడం, లిఖిత సమాచారాన్ని మరింత మెరుగు పరచడం, ఆడియో, వీడియోలను పంచుకోవడం వంటి సామర్థ్యాలు, సౌకర్యాలు ఉంటాయి. సోషల్ మీడియాను ఇంటర్నెట్ ప్రజాస్వామికీకరణకు దారితీసిందని, భావ ప్రకటన స్వేచ్ఛ, స్వేచ్ఛాయుతంగా అభిప్రాయాల ప్రకటన వంటి ఆదర్శాలను కాపాడుతున్నదని చెప్పుకుంటున్నాం. అదే సమయంలో ఇంటర్నెట్ సౌకర్యంతో స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్లు తదితర చేతిలో ఇమిడే పరికరాల ద్వారా సమాచార ప్రభావం అనేక రెట్లు పెరుగుతోంది. యువతను పెడమార్గంలోకి లాగే సమాచారం, వీడియోలు అందుబాటులో ఉండడమే కాకుండా, దురుద్దేశ్యాలు కూడిన వ్యక్తులు వీటిని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా పెరిగాయి. సైబర్ బుల్లీయింగ్(బెదిరింపు), సైబర్ స్టాకింగ్(వెంటాడడం), పుకార్లు సృష్టించడం వంటివి వాటిల్లో కొన్ని మాత్రమే.

అసోంలో కోక్రాఝహర్ లో2012 జూలై 25న బోడో తెగ బెంగాలీ ముస్లింలకు మధ్య జరిగిన జాతుల ఘర్షణ వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఘర్షణలను ప్రధాన స్రవంతిలోని మీడియా పూర్థి స్థాయిలో కథనాలను ఇవ్వలేదు. దీనిపై సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అంతే కాకుండా స్వయంగా రంగంలో దిగి పీడిత ప్రాంతాలలో సోషల్ మీడియా ఖాతాదారులు పర్యటించి సమాచారాన్ని నెట్ లో పెట్టారు. పునరావాస కేంద్రాలు, ఆసుపత్రులు, సహాయ చర్యలు వంటి వివరాలను కూడా వెబ్ సైట్ లలో ఉంచారు. అదే సమయంలో సోషల్ మీడియాలో అవాంఛనీయ పుకార్లు షికార్టు చేయడం, అందులోని చెడు పార్శ్వాన్ని బయటపెట్టింది. ఆగస్టు నెలలో సోషల్ మీడియాలో షికారు చేసిన ఈ పుకార్లు మొబైల్ ఫోన్లు, మెసేజ్ ల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి భారతదేశ దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో, ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, ముంబై, పూణెలలో నివసించే ఈశాన్య భారతీయులను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో వారంతా ముస్లిం మతతత్వవాదులు తమను లక్ష్యంగా చేసుకుంటారనే వార్తలతో భీతిల్లి, తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా పోటెత్తడంతో మునుపెన్నడూ లేని రీతిలో రైళ్లలో రద్దీ పెరిగింది.

ఈశాన్యవాసులపై దాడులకు ప్రేరేపించే అభ్యంతర కర సమాచారాన్ని పుకార్లను వ్యాప్తి చేసే సమాచారాన్ని తొలగించడంలో అధికారులకు సహకరించడం లేదని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. సోషల్ మీడియాలోని ఇలాంటి ప్రతికూల అంశాన్ని విస్తృత దృష్టితో పరిశీలించాలి. అడ్డుకోవడం అనే హక్కును భావ వ్యక్తీకరణ హక్కును కాలరాసేందుకు ఇష్టాను సారంగా ఉపయోగిస్తున్నారనే ఒక వాదన ఉంది. అలాగే మొదట స్వేచ్ఛ, తరువాత నైతికత వస్తుందా? అనే మరో వాదన కూడా ఉంది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణను 19(2) ద్వారా ఎందుకు నియంత్రించాలి?

సముచిత పరిమితులు విధింపునకు అవకాశమిచ్చే 19(2) అధికరణను, ప్రతి భారతీయ పౌరుడికి ప్రాథమిక హక్కుగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని సూచిస్తున్న 19(1)(ఎ) అధికరణపై ప్రయోగించడం గురించి భారత రాజ్యాంగంలో పేర్కొన్నారు. అయితే సముచిత అనే పదాన్ని నిర్వచించడంలోనే అసలు సమస్య. సముచితమైన అనే అంశాన్ని ఎవరు నిర్ణయించాలి? ఒక వేళ న్యాయస్థానాలు నిర్ణయించినట్లయితే ఎవరికీ పెద్దగా అభ్యంతారాలు ఉండవు. కానీ సముచిత పరిమితులు అనే పదానికి సమాజంలోని వివిధ వర్గాలు(చట్టాలను అమలు చేసే యంత్రాంగం మొదలు మతతత్వ వాద సంస్థల వరకు) వివిధ సందర్భాలలో, వాటికి తోచిన విధంగా ఇష్టానుసారంగా నిర్వచనాలు ఇస్తూ అయోమయం, గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితికి కొన్ని ఉదాహరణలే సాక్ష్యం. పుదుచ్ఛేరికి చెందిన రవి శ్రీనివాసన్ అనే వ్యాపారిని పోలీసులు వేకువ సమయంలో అరెస్టు చేశారు. రాబర్ట్ వాద్రా కంటే తాను(కార్తీ) ఎక్కువ ఆస్తులు కూడగట్టుకున్నట్లు శ్రీనివాసన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడని కార్తీ చిదంబరం(ఆర్థిక మంత్రి పి చిదంబరం తనయుడు) ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

ముంబాయి నగరం పాల్ఘాడ్ ప్రాంతానికి చెందిన షాహీన్ ధాదా , రీనూ శ్రీనివాసన్ అనే ఇద్దరు యువతులను జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు. శివసేన నేత బాల్ థాకరే మరణించిన రోజున ముంబాయి నగరంలో బంద్ లాంటి వాతావరణం నెలకొందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ షాహీన్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆ కామెంట్ ను రీమా లైక్ చేసింది. స్థానిక శివసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తరువాత దానిని ఉపసంహరించుకున్నారు. యువతులను అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ (కురుక్షేత్ర) ఫిర్యాదుదారుడు కానట్లయితే జీ నెట్ వర్క్ కు చెందిన ఇద్దరు సంపాదకులు సుధీర్ చౌదరి, సమీర్ అహ్లూవాలియాలను(వారిపై ఉన్న బలవంతంగా డబ్బు కోరడం, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలున్నాయి.) గత నవంబర్ లో అంత త్వరితగతిన అరెస్టు చేసేవారా?

కార్టూనిస్ట అసీమ్ త్రివేదిని 2012 సెప్టెంబర్ లో దేశ ద్రోహం అభియోగం కింద అరెస్టు చేశారు. అతని కార్టూన్ లు అధికారంలో ఉన్న వ్యక్తులను చికాకు పరిచాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వ్యంగ్య కార్టూన్ ను నెట్ పెట్టినందుకు జాధవ్ పూర్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్రను అరెస్టు చేశారు.సోషల్ మీడియాలో కొంత మంది నెట్ వినియోగదారులు ప్రముఖ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ప్రైవసీకి భరోసా ఇచ్చే చట్టాలను, కాపీ రైట్ చట్టాలను, ఇతర మానవ హక్కుల చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారు.

సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ – హెచ్చరికలు
సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ సంబంధాలను, సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి చేరవేస్తాయి. వెబ్సైట్స్ వ్యక్తిగత సమాచారాన్ని అడిగినపుడు ఎంత వరకు సమాచారాన్ని ఇవ్వవచ్చు అన్న విషయాన్ని నిర్ధారించు కోవాలి. ప్రతి ఒక్కరూ ఇతర వ్యక్తులను కలిసేటపుడు అవసరమైనంత జాగ్రత్త తీసుకోలేరు. ఎందుకంటే ఇంటర్‌నెట్ ఊరు పేరు లేని (ఎవరో తెలియని వారితో ) పరిచయాలు ఏర్పడేందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రత్యక్షంగా ఒకరికొకరు ముఖాముఖి జరిపే సంభాషణలు లేక పరిచయాలు ఉండవు కాబట్టి భద్రత/ రక్షణ మీద అనుమానం ఏర్పడుతుంది.

ఇంటర్నెట్ ద్వారా సమాచారం తీసుకున్న కొత్త ఫ్రెండ్ దాన్ని తమ స్నేహితులను కూడా చదవమని పంపవచ్చు. దీనివల్ల వ్యక్తిగత సమాచారం ఇంకెవరికో వెళుతుందన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఏదైనా సమాచారం స్నేహాన్ని, మంచిని పెంచేదిగా ఉంటే ఫర్వేలదు. కాని ఈ సైట్స్ ను ఉపయోగించే ఎక్కువ మంది తమకు దొరికిన సమాచారన్ని చెడుగా ఉపయోగించుకునే సంఘటనలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైనా సమాచారం అడిగినపుడు మనం ఎంత వరకు, ఏకోణంలో ఇవ్వాలనేదానిమీద స్పష్టత ఉండాలి. వ్యక్తిగత సమాచారం మనుషులను ఇబ్బందిపెట్టాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తులకు లభ్యమైతే అది మనకు పెద్ద ఇబ్బందే అవుతుంది. మనల్ని ఆర్థికంగా దోచుకోవాలనుకొనే వారు ముందుగా మన సమాచారాన్ని ఉపయోగించుకొని మనతో ఆన్‌లైన్ ద్వారా రిలేషన్‌షిప్స్ పెంపొందించుకొని ఆ తరువాత మనల్ని వ్యక్తి గతంగా ఏ మాత్రం అనుమానంరాని వ్యక్తులుగా వచ్చి కలుస్తామని చెబుతారు. అది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. మన వ్యక్తిగత సమాచారం వలన మనపై ‘సోషల్ ఇంజనీరింగ్ అటాక్’ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం చెప్పిన అలవాట్లు, మన ప్రదేశాలు, ఇష్టా ఇష్టాలు, స్నేహితులు మొదలైన వాటిని ఉపయోగించుకొని ఎవరైన చెడ్డవ్యక్తి మనల్ని అన్ని విధాలుగా నమ్మించి మన వ్యక్తిగత లేక ఫైనాన్సియల్ సమాచారాన్ని పొందడానికి తగిన వ్యక్తిగా/సంస్థగా మనల్ని ఒప్పించి తద్వారా ఆ సమాచారాన్ని సేకరించవచ్చు.

సోషల్ నెట్ వర్కింగ్ - రక్షణ
మనమిచ్చే వ్యక్తి గత సమాచారాన్ని అవసరమైనంత మేరకు పరిమితం గానే ఉంచాలి. మనల్ని ఇబ్బందులకు గురిచేసే సమాచారాన్ని ఎటువంటి పరిస్థితులలో పంపించకూడదు. (ఉదా. చిరునామా, వ్యక్తిగత , వ్యాపార కార్యక్రమాలను గురించి సమాచారం, మొదలైనవి.) మనమిచ్చేసమాచారం ఎవరు చూసినా మనకే విధమైన అసౌకర్యం కలుగకుండా ఉండేటంతే మాత్రమే ఇవ్వాలి. అంతేకాదు ఒక్కసారి మన సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేసిన తరువాత దాన్ని మీరు వెనుకకు తీసుకోలేము. ఎందుకంటే ఒక వేళ మనం ఆ సమాచారాన్ని మన సైట్ నుంచి తొలగించినప్పటికీ, దాని యొక్క saved లేక catched వెర్షన్స్ ఇంకా ఇతర వ్యక్తుల యొక్క మెషీన్‌లలో ఉండే ఉంటాయి.

కొత్త వ్యక్తుల పట్ల, అపరిచితుల పట్ల జాగ్రత్త వహించాలి. మోసం చేయాలనుకు నేవారు, క్రూరమైన ఆలోచనలు ఉన్నవారు ఎప్పుడూ తప్పుడు సమాచారాన్నే ఇంటర్నెట్ ఉంచుతారు. ఇలాంటి వాళ్ళు పరిచయాలు పెంచుకుని ఇతరులను ఇబ్బందులకు చేస్తారు. ఈ సైట్స్ ద్వారా మనల్ని సంప్రదించిన వ్యక్తులను మన పరిమితులకు లోబడే అనుమతించాలి. అనవసరమైన, ముఖ్యమైన సమాచార మేదీ వారికి చెప్పకూడదు. మనకు పరిచయం లేని వ్యక్తులతో నెట్‌లో సంభాషించేటప్పుడు విచక్షణ పాటించాలి. మనం ఆన్‌లైన్‌లో చదివినదంతా నిజమని నమ్మరాదు. చాలా మంది తమ ఐడెంటిటీతో సహా అనేక ఇతర అంశాలన్నీ తప్పుడువే అయి వుండి మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. ఇది తప్పనిసరిగా చెడు ఆలోచనలతోనే చేయడం జరగదు. కొన్నిసార్లు ఆనాలోచితంగానూ, ఉన్న దానికన్నా అతిగా చెప్పడం కోసం, లేక జోక్ గా కూడా అయి వుండవచ్చు. మనమేదైనా సమాచారం మీద ఏదైనా చర్య తీసుకోదలచినపుడు సమగ్రమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఆ సమాచారం యొక్క నిబద్ధత గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆపై నిర్ణయం తీసుకోవాలి.

ప్రైవసీ పాలసీ గురించి చెక్ చేసుకోవాలి. కొన్ని సైట్స్ తమ దగ్గరున్న e-మెయిల్ అడ్రస్‌లు, యూజర్ ప్రిఫరెన్సెస్‌ను ఇతర కంపెనీలతో పంచుకొంటాయి. ఇది కూడా స్పాం పెరగడానికి ఒక కారణమవుతుంది. మరికొన్ని సైట్స్ తమ e-మెయిల్ మెసేజ్‌లను వరుసగా, తరచుగా మనం చెప్పిన వారికి వారు దాన్ని చూసి దానిలో చేరే వరకు పంపుతూనే ఉంటాయి.

సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ - పిల్లలు
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వల్ల పిల్లలకు ప్రమాదం. ఎక్కువ శాతం ఈ సైట్స్ లో వయస్సు పరిమితి ఉంటుంది. దీనికి పిల్లలు తమ వయస్సును ఎక్కువ చేసి చూపించి దానిలో చేరతారు. ఇంటర్నెట్ భద్రత గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. పిల్లల ఆన్‌లైన్ అలవాట్లను గురించి ఎప్పటికపుడు తెలుసుకొంటూ, సరైన సైట్స్ ఏవో తెలియజేస్తూ తల్లి దండ్రులు ఫిల్లలు ఇంటర్‌నెట్‌ను సురక్షితంగా ఉపయోగించుకొనే బాధ్యతగల పౌరులుగా జాగ్రత్తలు తీసుకోవాలి.

తల్లి దండ్రులకు సూచనలు:
ఫిల్లలకు సోషల్‌నెట్ వర్కింగ్ సైట్స్ ఎంత ప్రమాదమంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మనతో పాటు మనకు తెలియకుండా మన ఇంట్లోనే నివసిస్తూ మన ఫిల్లల మనసును, ఆలోచనలను, చేష్టలను ప్రభావితం చేయగలిగేలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి సైట్స్ నుంచి పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ప్రతి ఒక్క తల్లి దండ్రుల మీదా ఉంటుంది.
  1. రహస్య, వ్యక్తి గతమైన సమాచారం ఏమిటో పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేయాలి.
  2. పిల్లలకు తమకు వచ్చే సమాచారాన్నిఇతరులతో కలిసి కూడా సౌకర్యవంతంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడగలిగే సమాచారాన్ని మాత్రమే పంపమని, చదవమని చెప్పాలి.
  3. పిల్లల వెబ్‌సైట్‌లోకి ఇతరులు చొరబడకుండా ఆసైట్స్ కు సరైన రక్షణ లేదా భద్రతా చర్యలు (సెక్యూరిటీ సాప్ట్ వేర్) చేపట్టాలి.
  4. ఒక్కసారి వారి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచినట్లయితే దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేరని గుర్తు చేయాలి.
  5. ఆన్‌లైన్ లో సెక్స్ టాక్ నుంచి దూరంగా ఉంచడానికి పిల్లలతో సరియైన పద్ధతిలో మాట్లాడుతూ ఉండాలి.
  6. ఏదైనా అనుమానాస్పద విషయాల గురించి అనవసరంగా ఎదేదో ఊహించకుండా వారిపై నమ్మకం ఉంచాలి.
  7. ఒక వేళ వారెప్పుడైనా ఆన్‌లైన్‌లో అసౌకర్యంగా లేదా భయంగా అన్పించినపుడు ఆ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడానికి ప్రోత్సహించాలి. దాని వలన పరిస్థితి అర్థమై దాని నివారణకు సరైన చర్యలు తీసుకోగలుగుతాం.
  8. పిల్లల స్నేహితుల లిస్ట్ ను తరచుగా గమనిస్తూ ఉండాలి.
  9. కంప్యూటర్‌ను ఇంట్లో అందరికీ కనిపించే విధంగా ఉంచాలి. దాని వలన పిల్లలు ఏమి సర్ఫింగ్ చేస్తున్నారో తెలుస్తూ ఉంటుంది.
  10. ప్రతీ ఒక్క సైట్‌కు సంబంధించిన ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
  11. పిల్లలు ఎవరూ లేని సమయంలో గాని బాగా రాత్రి వేళల్లో ఇంటర్‌నెట్‌ను ఉపయోగించడానికి ఇష్టపడుతుంటే మగమనించాలి. దాని గురించి సరైన పద్ధతిలో వారికి నచ్చ జెప్పాలి
ముగింపు సోషల్ మీడియాను మీరు అభిమానించండి లేదా అసహ్యించుకోండి. కానీ దానిని విస్మరించడం మాత్రం మీకు సాధ్యం కాదు. భారతదేశంలో మనం శరవేగంగా పెరుగుతున్న సోషల్ మీడియాలో పురోగమన అంశాలను పరిగణనలోకి తీసుకొని తిరోగమన అంశాలను పక్కకు పెట్టి ముందుకు సాగాలి.
Published date : 03 Dec 2013 12:28PM

Photo Stories