Skip to main content

నల్లధనం - అంచనాలు - పరిణామాలు

స్వాతంత్య్రానంతరం గత 64 సం.ల కాలంలో దే శంలో ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ మరోవైపు ఆర్థిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం పెరిగింది. భారత రాజ్యాంగంలో సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యాన్ని పొందుపరిచినప్పటి కీ ఆ దిశగా జరిగిన ప్రయత్నాలు తక్కువగానే భావించవచ్చు. 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థను రూపొందించాలనే ధ్యేయం అమలులో ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలలో సంస్కరణలకు ముందు, తర్వాత సంభవించిన పరిణామాలు ఆదాయ అసమానతల పెరుగుదలకు కారణమయ్యాయి. నల్లధనం, ద్రవ్యోల్బణం ఆదాయ అసమానతలు పెరగడానికి దోహదపడ్డాయి. వ్యక్తులు, కంపెనీలు, సొసైటీలు లెక్కల్లో చూపకుండా ఆర్జించిన ఆదాయాన్ని నల్లధనం అంటారు. పన్ను ఎగవేత, నల్లధనాన్ని యాంటీ సోషల్(సంఘ వ్యతిరేక) కార్యకలాపంగా భావించినప్పటికీ ఆర్థిక వ్యవస్థపై ఇవి దుష్ఫలితాలను చూపిస్తాయి. అధిక ద్రవ్యోల్బణం, సాధారణ, మధ్యంతర ఎన్నికలు, పన్ను ఎగవేత కారణంగా వాస్తవంగా ఆర్జించిన లాభాలు నల్లధనంగా మారుతున్నాయి.

నల్లధనం నిర్మూలనకు ప్రభుత్వం ఐదంచెల వ్యూహం:
  • నల్లధనం నిర్మూలనకు ప్రపంచవ్యాప్త యుద్ధం (గ్లోబల్ క్రూసేడ్)లో పాలుపంచుకోవడం.
  • సక్రమమైన శాసనా విధానాలు రూపొందించడం
  • న్యాయ విరుద్ధమైన ఫండ్స్ (illicit funds)ను గుర్తించడానికి అవసరమైన సంస్థల ఏర్పాటు.
  • కొత్త మ్యాన్‌పవర్ అభివృద్ధికి సంబంధించి పద్ధతులను అభివృద్ధి పరచడం.
  • సిబ్బందిలో నేర్పరితనం పెంపొందించడానికి శిక్షణా కార్యక్రమాలు పెంపొందించడం.
దేశవ్యాప్తంగా నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనల నేపథ్యంలో నల్లధనం పుట్టుకకు కారణాలు, నివారణ పద్ధతులు సూచించడానికి ప్రభుత్వం జూన్ 2011న హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జనవరి 30, 2012న నివేదిక సమర్పించింది.

ఈ నివేదికలోని ముఖ్యాంశాలు:
  • దేశంలోని రెండు జాతీయ పార్టీలు సంవత్సరానికి ఎన్నికల వ్యయ రూపంలో రూ.10,000 కోట్లు నుంచి రూ.15,000 కోట్లు వ్యయం చేస్తున్నాయి.
  • ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద ప్రస్తుతం ఉన్న గరిష్ట శిక్షా కాలాన్ని 5 నుంచి 7 ఏళ్లకు, 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాలి.
  • అఖిల భారత జ్యుడీషియల్ సర్వీసు, నేషనల్ టాక్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంతోపాటు ఆదాయపన్ను శాఖకు అదనంగా జ్యుడీషియల్ అధికారాలు ఇవ్వాలి.
  • భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు తమ విదేశీ ఆర్థిక లావాదేవీలు ఒక పరిమితిని మించిన పక్షంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు తెలియచేయాలి.
నల్లధనం అంచనాలు:
దేశం బయట వెల్లడించని బ్యాంకు ఖాతాలలో భారతీయులకు సంబంధించిన ద్రవ్యం ఏ మేర ఉంటుందనే విషయంపై సరైన సమాచార లభ్యత క్లిష్టతరంగా ఉంది. దీనికి సంబంధించి చేపట్టిన అనేక అంచనాల విలువలో వ్యత్యాసం ఎక్కువగా ఉంది.

దేశం లోపల, విదేశాలలో నల్లధం పరిమాణాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనే ప్రభుత్వ సంస్థలకు మార్చి 2011న ప్రభుత్వం అనుమతినిచ్చింది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నల్లధనం అంచనా వేసే ప్రక్రియలో అసాంఘిక కార్యకలాపాలైన స్మగ్లింగ్, చీకటి మార్కెట్ లావాదేవీలు, లంచాలు స్వీకరించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా భారత్‌లో నల్లధనానికి సంబంధించి ప్రపంచవ్యాప్త అంచనాకు కింది అంశాలపై దృష్టి కేంద్రీకరించింది.
  • వస్తు సేవల ఉత్పత్తిలో లభ్యమయ్యే ఉత్పత్తి కార కాల ఆదాయాలు
  • ఆస్తుల అమ్మకాలపై మూలధన రాబడికి సంబంధించి సృష్టించే నల్లధనం
  • ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిర మూలధన కల్పనలో సృష్టించే నల్లధనం
  • ప్రైవేటు కార్పొరేటు రంగానికి సంబంధించి సృష్టించే నల్లధనం
  • ఎగుమతులకు సంబంధించి సృష్టించే నల్లధనం
  • దిగుమతి లెసైన్స్‌ల అమ్మకం, ప్రైవేటు రంగ దిగుమతులకు సంబంధించి ఓవర్ ఇన్‌వాయిసింగ్ ద్వారా సృష్టించే నల్లధనం
1975-76 లో భారత్ నల్లధనం రూ.9958 కోట్ల నుంచి రూ.11,870 కోట్ల వరకు ఉండగలదని, ఈ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 15 నుంచి 18 శాతానికి సమానంగా ఉందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అంచనా వేసింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం 1980-81లో దేశంలో నల్లధనం జి.డి.పిలో 20 శాతంగాను 1983-84లో 19 నుంచి 21 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ప్రఖ్యాత ఆర్థిక వేత్త సూరజ్. బి. గుప్తా NIPFP అంచనాలకు భిన్నంగా 1980-81లో నల్లధనం జి.డి.పిలో 42 శాతంగానూ, 1987-88లో 51 శాతంగానూ ఉందని అంచనా వేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నల్లధనం అంచనాలకు వినియోగించిన పద్ధతికి విరుద్ధంగా గుప్తా అంచనాలను రూపొందించారు.

ఈ సంస్థ (NIPFP), సూరజ్ బి.గుప్తా నల్లధనం కొలవడానికి వినియోగించిన పద్ధతిలో కొన్ని లోపాలున్నాయని, వాస్తవంగా నల్లధనం పరిమాణం 1990-91లో జి.డి.పిలో 35 శాతంగానూ, 1995-96లో 40 శాతంగానూ ఉందని అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ నివేదిక 2006 ప్రకారం, స్విట్జర్లాండ్ బ్యాంక్‌లలోని ఇతర దేశాలకు సంబంధించిన డిపాజిట్ల పరంగా అధిక డిపాజిట్లు కలిగిన దేశాలలో భారత్, రష్యా, ఇంగ్లండ్, ఉక్రెయిన్, చైనాలు వరుస క్రమంలో మొదటి ఐదు స్థానాలను ఆక్రమించాయి. ఈ నివేదిక ప్రకారం స్విస్ బ్యాంకులలో 1456 బిలియన్ డాలర్ల మేరకు భారతీయుల డిపాజిట్లు ఉన్నాయి.

లెక్కలోనికి రాని ద్రవ్యానికి సంబంధించి NIPFP 1985లో మొదటిగా పరిశోధన నిర్వహించింది. తిరిగి 25 ఏళ్ల తర్వాత ఈ సంస్థతోపాటు మిగిలిన మూడు సంస్థలను నల్లధనం పుట్టుకకు కారణాలు, వాటికి సంబంధించిన అంచనాలను రూపొందించడానికి అమెరికా ఆర్థికవేత్త అయిన దేవ్‌కర్ల్ 1948 నుంచి 2008 మధ్యకాలంలో 462 బిలియన్ డాలర్ల (20 లక్షల కోట్లకు పైగా) విలువకు సమానమైన ద్రవ్యం భారత్ నుంచి బయట దేశాలకు తరలి వెళ్లింది అని వ్యాఖ్యానించడం కారణమైంది. ఈ మొత్తంలో సుమారు 50 శాతం 1991 తర్వాత ముఖ్యంగా 2000 నుంచి 2008 మధ్య కాలంలో ఎక్కువగా బయట దేశాలకు తరలి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఆర్థిక కార్యకలాపంలోనూ నల్లధనం ఏర్పడటానికి అవకాశం ఉంది.

భారత్‌లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బులియన్, జ్యుయెలరీ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్లు, లాభాపేక్ష లేని సంస్థలు, విదేశీ వాణిజ్యం, అంతర్జాతీయ లావాదేవీల తోపాటు అసంఘటిత సేవా రంగంలోని కార్యకలాపాలు నల్లధనం పెరగడానికి ఇటీవల కాలంలో కారణాలయ్యాయి.

నల్లధనం ఏర్పడటానికి కారణాలు
  • ప్రపంచంలో భారత్ అధిక పన్నులు విధించే దేశంగా రూపొందడం వల్ల నల్లధనం పరిణామం పెరిగింది. స్వాతంత్య్రానంతరం అధిక పన్నుల రాబడి లక్ష్యంలో భాగంగా పరోక్ష పన్నులపై ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడటం ఈ స్థితికి కారణమైంది.
  • పన్ను చట్టాలు కఠినంగా ఉండటం కారణంగా సామాన్య ప్రజలకు వీటిపట్ల అవగాహన ఏర్పడకపోవడంతోపాటు నిజాయితీగా పన్ను చెల్లించాలనే అభిప్రాయం ఉన్నవారు కూడా రిటర్న్స్ సక్రమంగా ఫైల్ చేయకపోవడం
  • ప్రస్తుతమున్న ఆర్థికపరమైన నియంత్రణలు చాలా క్లిష్టంగా ఉండటంతోపాటు ఇతర ప్రభుత్వ నియంత్రణలు పన్నుల ఎగవేతకు కారణమవుతున్నాయి.
  • భారీ పరిశ్రమల్లో జరిగే లావాదేవీలు, ప్రభుత్వ రంగంలో లావాదేవీలు, ప్రభుత్వ వ్యయంలోనూ పెరుగుతున్న అవినీతి నల్లధనం పెరగడానికి కార ణమవుతున్నాయి.
  • రాజకీయ వ్యవస్థ నల్లధనం పుట్టుకకు కారణమవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ అంశాలలో లభిస్తున్న స్వేచ ్ఛ దేశంలో అవినీతి, నల్లధనం పెరగడానికి కారణమవుతుంది. రాజకీయ పార్టీలు లెక్కల్లో చూపించని ద్రవ్యాన్ని ఎన్నికల ప్రచారానికి స్వీకరించడం వల్ల కూడా నల్లధనం పెరుగుతుంది.
  • అసాంఘిక కార్యకలాపాలైన స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల వాడకం పెరుగుదల.
ప్రజల్లో క్షీణిస్తున్న నైతిక, సమాజ సాంప్రదాయాలు
  • పలుకుబడి కలిగిన సంస్థలు తమ అవసరానికి మించి దిగుమతి లెసైన్స్‌లు, కోటాలను ప్రభుత్వం నుంచి పొంది వాటిని నగదు ప్రీమియం వద్ద విక్రయించడం.
  • పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ లెసైన్స్‌లను త మ పలుకుబడి ద్వారా పొందిన సంస్థలు అధిక ధర వద్ధ వేరే సంస్థలకు విక్రయించడం.
  • పన్నుల ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం.
  • పన్ను వసూలు చేసే అధికార యంత్రాంగం పటిష్టంగా లేకపోవడం వల్ల దిగువ స్థాయిలో అవినీతి నల్లధనాన్ని ప్రోత్సహిస్తుంది.
అధిక నల్లధనం-ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
  • అధిక ద్రవ్యోల్బణం ఏర్పడటానికి నల్లధనం కారణమవుతుంది. లెక్కల్లో చూపించని ద్రవ్యాన్ని వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు వివిధ అవసరాల నిమిత్తం మార్కెట్‌లో చలామణీలోకి తీసుకురావడం ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడటానికి కారణమైంది. తద్వారా లక్షిత వర్గాల ప్రజల జీవన ప్రమాణం కుంటుపడుతుంది.
  • ఆర్థిక అసమానతలు పెరగడానికి నల్లధనం కారణమవుతుంది. ధనికులు మరింత ధనికులుగాను, పేదవారు మరింత పేదవారుగా మారడానికి నల్లధనం కారణమవుతుంది. నల్లధనం కారణంగా భౌతిక సంబంధమైన ఆస్తుల కేంద్రీకరణ జరిగి ఆర్థిక అసమానతలు పెరగడం ద్వారా సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
  • భారత్ నుంచి విదేశాలకు బదిలీ చేసిన అవినీతి సొమ్ము దేశంలోకి తిరిగి హవాలా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, భారత కంపెనీలు జి.డి.ఆర్‌ల రూపంలో విదేశాల నుంచి సేకరించే మూలధనం రూపంలో తిరిగి దేశంలోకి ప్రవేశిస్తుంది.
నల్లధనం పెరిగినప్పుడు పోటీ సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడిన పక్షంలో ప్రభుత్వం అవలంబించే స్థూల ఆర్థిక విధానాలు లక్ష్యసాధనలో వైఫల్యం చెందుతాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం, ధరల స్థిరత్వం, వ్యాపార చెల్లింపుల శేషంలో సమతౌల్యం సాధించడం అనే లక్ష్యాల సాధనకు అవరోధం ఏర్పడుతుంది.
  • పన్ను చెల్లించే వ్యక్తి తన ఆదాయం లేదా లాభంపై పన్ను చెల్లించాలి. తన అమ్మకాలు లేదా రాబడిని తప్పుగా చూపించడమనేది పన్ను ఎగవేతకు ఒక సులభమైన మార్గం. మరోవైపు సంస్థ అమ్మకాలను తన అనుబంధ సంస్థ అమ్మకాలుగా చూపించడంతోపాటు ఆయా సంస్థలు పన్నుల వైవిధ్యం కలిగిన ప్రాంతాలలో కేంద్రీకృతమైనప్పుడు అంతర్జాతీయ పన్నులు, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ లాంటి అంశాలు ఎదురవుతాయి.
  • ప్రభుత్వం లక్షిత వర్గాల అభివృద్ధి కోసం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నల్లధనం పరిమాణం ఎక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థలలో తగిన మొత్తంలో వనరుల సమీకరించుకునే విషయంలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నల్లధనం సాంఘిక, ఆర్థికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
  • నల్లధనాన్ని అనుత్పాదక కార్యక్రమాలపై ఎక్కువగా వినియోగిస్తున్నందువల్ల ఉత్పాదక కార్యకలాపాలపై పెట్టుబడి తగ్గి ఆర్థికాభివృద్ధి క్షీణిస్తుంది.
Published date : 30 Jun 2012 02:44PM

Photo Stories