Skip to main content

ప్రజలపై రూపాయి క్షీణత ప్రభావం

డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్,ఐబీఎస్ హైదరాబాద్.
ఇటీవల కాలంలో రూపాయి విలువ క్షీణత.. వృద్ధిరేటులో ఒడిదుడుకులకు కారణమవడమే కాక సాధారణ పౌరుని ఆర్థిక స్థితిగతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశాబ్దాల్లో సాధించిన సగటు వార్షిక వృద్ధి 3.5 శాతం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పనితీరును గమనిస్తే వచ్చే 12, 15 నెలల కాలంలోవృద్ధిరేటు దీనికే పరిమితం కాగలదనిపిస్తోంది. రూపాయి విలువ క్షీణత రాబోయే కాలంలోనూ ఇదే విధంగా కొనసాగితే దేశ జీడీపీ వృద్ధిరేటు నాలుగు శాతానికి పరిమితం కాగలదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర బ్యాంకు ఇటీవల కాలంలో అవలంబిస్తున్న కఠిన ద్రవ్య విధానం, ప్రపంచ మూలధన మార్కెట్లో అనిశ్చితి వాతావరణం నేపథ్యంలో వచ్చే ఆర్నెల్లలో రూపాయి విలువలో క్షీణత కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ వృద్ధిరేటులో క్షీణత కారణంగా వాణిజ్య బ్యాంకులకు రికవరీ కాని రుణాలు పెరుగుతున్నాయి. తద్వారా బ్యాంకింగ్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. ద్రవ్యలోటు యాజమాన్యం క్లిష్టతరమై ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఏర్పడింది.

సాధారణ పౌరునిపై ప్రభావం:
డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ క్షీణత వల్ల ముడి చమురు, ఎరువులు, మందులు, ముడి ఇనుప ఖనిజం వంటి దిగుమతుల వ్యయం పెరుగుతుంది. వీటిని రోజువారీ వినియోగంలో సాధారణ పౌరులు విరివిగా వినియోగించకపోయినప్పటికీ అవి వారి ఆర్థిక పరిస్థితులపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా వ్యయం పెరిగి ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుదలకు దారితీస్తుంది. తద్వారా కుటుంబ బడ్జెట్‌పై ఈ స్థితి ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) ఉత్పత్తులైన సబ్బులు, డిటర్జెంటులు, షాంపులు, డియోడరెంట్స్‌ల తయారీలోనూ ముడి చమురును ముడి సరకుగా వినియోగిస్తున్నందున వీటి ధరల్లో పెరుగుదల సాధారణ ప్రజల వినియోగ వ్యయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ముడిసరకుల దిగుమతి వ్యయం పెరుగుతున్నందువల్ల ఆయా కంపెనీలు తీవ్ర వ్యయ ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి. హిందుస్థాన్ లీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇప్పటికే వినియోగ వస్తువుల ధరలు పెంచాయి. సాధారణ పౌరులు తమ వినియోగ వ్యయంలో ఎక్కువగా వీటిపై వెచ్చించినపుడు ఆహారేతర ఉత్పత్తులపై వ్యయం తగ్గి సమష్టి డిమాండ్ తగ్గుదలకు దారితీస్తుంది. సమష్టి డిమాండ్ తగ్గుదల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
  • పప్పు ధాన్యాల దిగుమతులు ఇటీవల కాలంలో పెరిగాయి. పెరుగుతున్న మధ్య తరగతి ప్రజల ఆదాయాల కారణంగా పప్పు ధాన్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ముడి పామాయిల్ దిగుమతుల ధరలు పెరిగిన కారణంగా ఇతర వంట నూనెల ధరలు పెరిగాయి. దేశంలో 60 నుంచి 70 శాతం వంట నూనెల అవసరం దిగుమతుల ద్వారా తీరుతోంది. 2011 నవంబర్-డిసెంబర్‌లో రిఫైండ్ సోయాబీన్ ఆయిల్ 10 కిలోల ధర రూ.651 కాగా 2013 సెప్టెంబర్‌లో అది రూ.720కు చేరింది.
  • డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గుదల విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారిపై అధిక భారం మోపుతుంది. విదేశీ విద్య కోసం వాణిజ్య బ్యాంకులు రుణాన్ని రూపాయల్లో సమకూరుస్తాయి. కానీ, విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ట్యూషన్ ఫీజును ఆయా దేశాల కరెన్సీలలో చెల్లించాలి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా డాలర్ సమ్మతించదగిన కరెన్సీగా ఉన్నందువల్ల రూపాయితో డాలర్ కొనుగోలు భారంగా పరిణమిస్తుంది. వాణిజ్య బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాన్ని తీసుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ విద్య సాధ్యమవుతుంది.
నిరుద్యోగ సమస్య:
భారత పౌరులకు విదేశీ యానం అధిక భారంగా పరిణమిస్తుంది. ఇంధన ధరలు పెరిగిన కారణంగా విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు విదేశాల్లో వసతి, భోజన సౌకర్యాల కోసం అధిక మొత్తంలో రూపాయిలను ఖర్చు చేయాల్సి వస్తోంది. విదేశీ వస్తువుల కొనుగోలుకు సంబంధించి డాలర్ లేదా విదేశీ కరెన్సీని వ్యయం చేయాల్సి వచ్చినప్పుడు ఆర్థిక భారం పెరుగుతుంది. రూపాయి క్షీణతకు గురికావడానికి ముందు కాలంలో ‘హాలీడే ప్యాకేజీలు’ బుక్ చేసుకున్న వారికి కొంత మేర ఉపశమనం కలిగినా, ఇతర ఖర్చుల విషయంలో అధిక భారం పడుతుంది.

రూపాయి విలువ క్షీణత కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు సంభవిస్తాయి. లక్షిత వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు కుంటుపడతాయి. తద్వారా పేదరికం పెరుగుతుంది. ఓ స్థాయిని మించిన సాధారణ ధరల స్థాయి స్వదేశీ పెట్టుబడులను కూడా క్షీణింపజేస్తుంది. స్వదేశీ పెట్టుబడుల క్షీణత కారణంగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లి నిరుద్యోగ సమస్య పెరుగుతుంది.

పేదరికం పెరుగుదల:
రూపాయి విలువ క్షీణత కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల లక్షిత వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు కుంటుపడతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి ఆహార సబ్సిడీ భారం పెరుగుతుంది. వ్యవసాయ రంగ ప్రగతి సాధనలో భాగంగా ఎరువుల సబ్సీడీ, యాంత్రీకరణల కోసం అందించే సబ్సిడీభారం పెరుగుతుంది. ఈ స్థితి ప్రభుత్వ రెవెన్యూ వ్యయం పెరుగుదలకు దారితీసి మూలధన వ్యయం తగ్గుతుంది. మూలధన వ్యయం తగ్గిన కారణంగా అభివృద్ధి ప్రాజెక్టులపై పెట్టుబడులు తగ్గుతాయి. ఈ స్థితి భావితరాల ప్రజల్లో నిరుద్యోగం పెరుగుదలకు దారితీస్తుంది. తద్వారా పేదరికం పెరుగుతుంది.దవ్యోల్బణ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ప్రజల వినియోగ వ్యయం పెరిగి పొదుపు రేటు తగ్గుతుంది. పొదుపు రేటులో తగ్గుదల.. పెట్టుబడి రేటు క్షీణతకు దారితీస్తుంది. పెట్టుబడి రేటులో తగినంత వృద్ధి లేనప్పుడు ఆర్థికాభివృద్ధి క్షీణిస్తుంది.

పారిశ్రామిక రంగంపై ప్రతికూల ప్రభావం:
ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులైన కంప్యూటర్‌లు, టీవీలు, మొబైల్ పరికరాల ధరల పెరుగుదల సాధారణ పౌరుల వినియోగ వ్యయాన్ని పెంచుతుంది. చమురు, గ్యాస్‌లతోపాటు భారత్ విద్యుత్ ఉత్పాదనలో భాగంగా ‘థర్మల్ కోల్’ను దిగుమతి చేసుకుంటున్నందు వల్ల రూపాయి విలువ క్షీణత కారణంగా దిగుమతి వ్యయాలు పెరిగి దేశంలో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. ఇటీవల కాలంలో విద్యుత్ కోత, లో వోల్టేజీ లాంటి సమస్యలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం తగ్గుదలతో పాటు విద్యుత్ డిమాండ్ అధికమైన కారణంగా విద్యుత్ టారిఫ్‌ను వివిధ రాష్ట్రాల విద్యుచ్ఛక్తి బోర్డులు పెంచాయి. ఈ స్థితి వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. మరోవైపు సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలకు అనుపాతంగా ఆదాయాల్లో పెరుగుదల లేని కారణంగా వివిధ వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు కుంటుపడుతున్నాయి.

నిర్వహణ భారం:
పతి పరిశ్రమ దిగుమతుల ఆధారంగా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఉత్పత్తి వ్యయాలతో పాటు నిర్వహణ వ్యయాలు పెరుగుతాయి. అధిక ధరల కారణంగా ఆయా సంస్థల రాబడి త గ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు రీఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రయత్నించవచ్చు. ఈ స్థితి ఉపాధి కల్పనపై రుణాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది.

రూపాయి విలువ క్షీణత కారణంగా కరెంట్ అకౌంట్ లోటు పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధిలో భాగంగా కొంత మేర కరెంట్ అకౌంట్ లోటును నిర్వహించాల్సి వచ్చినప్పటికీ.. రుపాయి విలువ క్షీణత అధికంగా ఉన్న కారణంగా కరెంట్ అకౌంట్ లోటు పెరిగింది. అధిక కరెంట్ అకౌంట్ లోటు ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకం. డాలర్ రూపంలో రాబడి కలిగిన ఐటీ కంపెనీలకు రుపాయి విలువలో తగ్గుదల లాభదాయకంగా ఉంటుంది. రుపాయి విలువ క్షీణత ఒక పరిమితి వరకు ఉన్నప్పుడు మాత్రమే ఆయా కంపెనీలు లబ్ధి పొందుతాయి. తద్వారా ఆ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అధిక ఉపాధి వల్ల ఆదాయ స్థాయి పెరిగి సమష్టి డిమాండ్‌లో పెరుగుదల ఏర్పడుతుంది. ప్రపంచ తిరోగమనం నేపథ్యంలో ఐటీ రంగం రూపాయి విలువ క్షీణత వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేకపోయింది.
  • నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ)కు రుపాయి విలువ క్షీణత లాభదాయకంగా ఉంటుంది. విదేశాల్లో పని చేసే భారతీయులు తమ విదేశీ కరెన్సీ వేతనాన్ని రూపాయల్లోకి మార్చుకోవడం ద్వారా లబ్ధి పొందుతారు.
  • ప్రస్తుత ఆర్థిక వాతావరణం నేపథ్యంలో రుపాయి విలువ క్షీణత ప్రభావం సాధారణ పౌరుల స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని చూపగలదని భావించడానికి కింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • ఆహారం, ఇతర ఉత్పత్తుల ధరలను నియంత్రించే సామర్థ్యం ప్రభుత్వానికి కొరవడటం.
  • రూపాయి క్షీణతను అరికట్టే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకు తన విధాన రేట్లను పెంచుతుందనే ఊహాగానాలు.
  • వృద్ధి రేటు క్షీణతతో పాటు రాబోయే త్రైమాసికం (క్వార్టర్)లోనూ వృద్ధి అంచనాలు అంత ఆశాజనకంగా లేకపోవడం.
  • క్షీణించిన విదేశీ పెట్టుబడులు.
  • దిగుమతులపై ఆధారపడిన సంస్థల లాభదాయకత తగ్గడం.
  • విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య అత్యంత ఖరీదుగా మారడం.
భారత్‌కు సంబంధించి అతి పెద్ద తయారీ రంగ కార్యకలాపమైన ఆటోమొబైల్ రంగం రూపాయి విలువ క్షీణత కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. రూపాయి విలువ తగ్గుదల ఆటోమొబైల్ రంగంపై మూడు విధాలుగా ప్రభావం చూపించింది.
ఎ) దిగుమతి పరికరాల వినియోగం వల్ల దిగుమతుల వ్యయం పెరిగింది.
బి) కొన్ని కంపెనీలు విదేశీ మాతృ సంస్థలకు రాయల్టీలు చెల్లించవలసి వచ్చినప్పుడు విదేశీ కరెన్సీలో చెల్లించాల్సి రావడంతో అధిక భారంగా పరిణమించింది.
సి) విదేశీ బహిర్గత వాణిజ్య రుణాలు, విదేశీ కరెన్సీ (Convertible bonds) రూపంలో రుణాలు పెరిగిన కారణంగా ఆయా సంస్థలు వీటిని తిరిగి చెల్లించే సమయంలో సమస్యలు ఎదుర్కోవడం.

ఇవీ చర్యలు:
Bavitha భారత్‌లో ఉత్పాదకత, పోటీతత్వం పెంపునకు అవసరమైన విధానాల రూపకల్పన అవసరం. ఎగుమతి ప్రాధాన్యత గల పరిశ్రమలకు ప్రోత్సాహ కాలు, రాయితీలు అందించాలి.
  • పారదర్శకతతో కూడుకున్న విదేశీ వాణిజ్య విధానాన్ని రూపొందించాలి. కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో పాటు నగదు-నిల్వల నిష్పత్తి పెంచాలి. ఈ చర్య ఆర్థిక వ్యవస్థపై స్థిరత్వ సాధనకు తోడ్పడమేకాకుండా సాధారణ పౌరునిపై రుపాయి క్షీణత వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించవచ్చు.
  • ఎగుమతుల పెంపు ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జనపై దృష్టి సారించాలి.
  • ప్రైవేటు కంపెనీలకు సంబంధించి బహిర్గత వాణిజ్య రుణాలపై నిబంధనలు విధించాలి.
  • అంతర్గతంగా వృద్ధిని పెంపొందించే రంగాలపై దృష్టి సారించడం ద్వారా ఉపాధి కల్పన, సుస్థిర వృద్ధి సాధనకు ప్రయత్నించాలి.
  • యూరో జోన్ సంక్షోభ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కనిపించే ప్రమాదం ఉంది. యూరోపియన్ బ్యాంకుల నుంచి మూలధన ప్రవాహాలు మన దేశంలో ప్రవేశిస్తున్నందువల్ల యూరో జోన్‌లో ఏర్పడే సంక్షోభ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఉంటుంది.
Published date : 12 Sep 2013 03:42PM

Photo Stories