జనాభా.. ఆర్థికాభివృద్ధి.. పరిణామాలు
Sakshi Education
అధిక జనాభావృద్ధి, ఆర్థికవృద్ధి మధ్యగల సంబంధం విషయంలో శతాబ్దకాలానికిపైగా చర్చ కొనసాగుతోంది. ప్రముఖ ఆర్థికవేత్త మాల్థస్ అభిప్రాయంలో అధిక జనాభా వృద్ధి, ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉండటంతోపాటు వనరులపై ఒత్తిడి పెరుగుతుందని తద్వారా తలసరి ఆదాయంలో వచ్చిన తగ్గుదల కారణంగా ప్రజల జీవన నాణ్యత తగ్గుతుంది.
మాల్థస్ అభిప్రాయానికి విరుద్ధంగా తూర్పు ఆసియా దేశాల్లో జనాభా వృద్ధి ఆర్థిక ప్రగతికి దారితీసింది. దాంతోపాటు అక్కడి ప్రజల జీవన నాణ్యత పెరుగుదలకు దోహదం చేసింది. ఆయా దేశాల్లోని మొత్తం జనాభాలో చదువుకున్న యువత శాతం ఎక్కువగా ఉండడంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు. తద్వారా ఉత్పాదకత మెరుగైంది. ఆర్థికాభివృద్ధి విషయంలో మానవ వనరులను ఆయా దేశాలు కీలక యంత్రాలుగా గుర్తించాయి. ఉపాధి అవకాశాలు విస్తృతమవడంతో ఆదాయం,పొదుపు పెట్టుబడులలో ఏర్పడిన పెరుగుదల ఆర్థికాభివృద్ధి వేగవంతమవడానికి కారణమైంది.
భారత్ - జనాభావృద్థి ధోరణి:
ప్రపంచ విస్తీర్ణంలో కేవలం 3.4 శాతం వాటాను మాత్రమే కలిగిన భారత్.. జనాభాలో మాత్రం 17.5 శాతం (2011 లెక్కల ప్రకారం భారత జనాభా 121.02 కోట్లు) వాటాను దక్కించుకుంది. భారత్ జనాభా అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల ఉమ్మడి జనాభాకు సమానం. ఈ స్థితి దేశంలో భూమిపై పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తెలియజేస్తుంది. స్వాతంత్య్రానంతరం దేశంలో ఆరోగ్య సౌకర్యాలు మెరుగైన కారణంగా మరణాల రేటులో తగ్గుదల సంభవించింది. 1951 నుంచి 2010-11 మధ్యకాలంలో జననాల రేటులో వచ్చిన తగ్గుదల కంటే మరణాల రేట్లలో సంభవించిన తగ్గుదల ఎక్కువ కావడం గమనార్హం. గత 50 సంవత్సరాల కాలంలో శిశు మరణాల రేటులో సుస్థిరమైన తగ్గుదల సంభవించింది. 20వ శతాబ్దం రెండో అర్థబాగంలో శిశుమరణాలు ప్రతి వెయ్యి జననాలకు 218 కాగా 2011లో 44కు తగ్గాయి. పేదరికం అధికంగా ఉన్నా.. ఆరోగ్య సంరక్షణ మెరుగుపడడంతో ప్రసూతి మరణాల రేటులోనూ తగ్గుదల సంభవించింది. గత ఆరు దశాబ్దాల కాలంలో దేశంలో జననాల రేటులో కొంతమేర తగ్గుదల సంభవించింది. కేరళ, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో జననాల రేటులో తగ్గుదల ఎక్కువగా నమోదైంది. మిగిలిన రాష్రాల్లో జననాల రేటు ఇప్పటికి ఎక్కువగానే ఉండడాన్ని గమనించవచ్చు.
అధిక జనాభా- పరిణామాలు:
అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో అధిక జనాభావృద్ధి ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిపై రుణాత్మక ప్రభావాన్ని చూపించింది. భారత్‌లో అధిక జనాభా వృద్ధి కారణంగా వ్యవసాయ భూమిపై జనాభా ఒత్తిడి పెరిగింది. తద్వారా తలసరి సాగు భూమి తగ్గింది. దాంతో కమతాల పరిమాణం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత కుంటుపడింది. మరోవైపు పెరుగుతున్న జనాభా అనుత్పాదక అవసరాల నిమిత్తం వనరులను డిమాండ్ చేస్తుండడంతో మూలధన కల్పన తగ్గుతుంది. అధిక జనాభావృద్ధి కారణంగా ఆయా దేశాలు అధిక నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఆహార సమస్య, వసతి, రవాణా, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలకు సంబంధించిన సేవల లభ్యతలో కొరత పెరుగుతుంది. ఆయా దేశాల్లో పెరుగుతున్న వినియోగం కారణంగా మూలధన కల్పన, పెట్టుబడులు తగ్గుతాయి. శక్తి, నీరు, అడవులు వంటి వనరుల అధిక వినియోగం కారణంగా పర్యావరణ పరంగా సమతుల్యత లోపించి ప్రజల జీవన నాణ్యత తగ్గుతుంది. భారత్‌లో అధికార యంత్రాంగం కేంద్రీకృత విధానం కారణంగా జనాభా స్థిరీకరణకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. భారత్‌లో శ్రామికశక్తి, వ్యవసాయరంగంపై ఆధారపడుతుండడంతో తలసరి ఆదాయం అల్పస్థాయిలో ఉంటుంది. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం కారణంగా గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లారు. తద్వారా పట్టణ జనాభా పెరిగింది. అధిక పట్టణీకరణ కారణంగా మురికివాడలు పెరగడం, నిరుద్యోగం, నేరాల రేటు అధికమవడం, జీవన ప్రమాణాల స్థాయిలో తగ్గుదల వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాయు కాలుష్యం, నీటి సమస్యలు, అధిక ఉష్ణోగ్రత వంటి పర్యావరణ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.
జనాభా నియంత్రణ-వివిధ దేశాల చర్యలు:
చైనా:
చైనాలోజనాభావృద్ధి రేటు తగ్గించడానికి 1979లో డెంగ్ జియావోపింగ్ (Deng Xiaoping), ఏక సంతానం(One child policy) విధానాన్ని ప్రవేశపెట్టారు. అధికారిక అంచనాల ప్రకారం ఈ విధానం చైనాలో 400 మిలియన్‌ల జననాలను నియం త్రించగలిగింది. ప్రభుత్వం పాపులేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్‌చ సెంటర్ (Population and information Research centre)ను ఏర్పాటు చేసింది. ఇది జనాభా సంఖ్య గురించిన వివరాలు, ప్రభుత్వ విధానాల అమలుకు సంబంధించి ప్రభుత్వానికి సహాయం చేస్తుంది. వన్ ఛైల్‌డ విధానం ప్రకారం పౌరులు శిశువు జననానికి ముందే విధిగా జనన సర్టిఫికెట్ పొందాలి. ఈ విధానాన్ని అంగీకరించిన వారికి ప్రత్యేక ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక శిశువు కంటే ఎక్కువ శిశువులను కలిగి ఉన్నవారు తమ ఆదాయంలో 50 శాతం పన్నుగా చెల్లించాలి అనే నిబంధనలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 1980లలో ప్రాంతాల వారీగా జనాభా నియంత్రణకు ప్రభుత్వం బర్‌త కోటా విధానాన్ని (Birth Quota System) ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి ప్రకారం స్థానిక అధికారులు ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుదల లక్ష్యాన్ని మించకుండా చర్యలు చేపట్టారు.
ఇరాన్:
ఇటీవలకాలంలో జననాల రేటు తగ్గింపులో ఇరాన్ విజయవంతమైంది. వివాహ లెసైన్‌స పొందడానికి ముందు పురుషులు, స్త్రీలు తప్పనిసరిగా గర్భ నిరోధక కోర్సులను అధ్యయనం చేయాలి. చిన్న కుటుంబం Contraception (గర్భనిరోధం) లకు సంబంధించి ప్రజల్లో ఇరాన్ అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది.
ముగింపు:
జనాభావృద్ధి నియంత్రణ ఆర్థిక, విద్య, ఆరోగ్యం వంటి అంశాలతో ముడిపడి ఉంది. ఈ అంశాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచి శీఘ్ర ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రభుత్వం ప్రయత్నించాలి. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై ఖర్చు చేసే ధనం పేదరికం తగ్గింపు, ఆరోగ్య ప్రమాణాల మెరుగు, లింగ సమానత్వం (Gender equality) సాధించడం, శ్రామికశక్తి భాగస్వామ్యం పెంపునకు దోహదపడుతుంది. ప్రెగ్నెన్సీ (pregnency)లో తేడా 3 నుంచి 5 సంవత్సరాలు ఉండటం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శిశుమరణాలు 46 శాతం మేరకు తగ్గాయి. బంగ్లాదేశ్‌లో ఒక కమ్యూనిటీకి చెందిన కుటుంబ నియంత్రణ పాటించిన మహిళలకు సంబంధించిన సర్వే ప్రకారం కుటుంబ నియంత్రణ పాటించిన మహిళలు.. ఇతర మహిళల కంటే 1/3 వంతు ఆదాయాన్ని అదనంగా ఆర్జించగలుగుతున్నారు. భారత్‌లో జనాభా పెరుగుదల నియంత్రణ విషయంలో ముఖ్య సంస్కరణలు చాలా అవసరం.
- ప్రపంచ విస్తీర్ణంలో కేవలం 3.4శాతం వాటాను మాత్రమే కలిగిన భారత్.. జనాభాలో మాత్రం ప్రపంచ జనాభాలో 17.5 శాతం(2011 లెక్కల ప్రకారం భారత జనాభా 121.02 కోట్లు) వాటాను దక్కించుకుంది.
- 2026 నాటికి 0.9 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్ జనాభా 140 కోట్లకు చేరు కోగలదని అంచనా.
- భారత్‌లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కుటుంబ నియంత్రణ అమలును పర్యవేక్షించే బాధ్యతను, అధికారాన్ని పంచాయతీ వ్యవస్థకు ఇచ్చారు.
- అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో అధిక జనాభావృద్ధి ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిపై రుణాత్మక ప్రభావాన్ని చూపించింది.
- చైనాలోజనాభావృద్ధి రేటు తగ్గించడానికి 1979 లో డెంగ్ జియావోపింగ్(Deng Xiaoping), ఏక సంతానం (One child policy) విధానాన్ని ప్రవేశపెట్టారు.
- 2026 నాటికి 0.9 శాతం వార్షిక వృద్ధి రేటుతో భారత్ జనాభా 140 కోట్లకు చేరుకోగలదని అంచనా.
- ప్రముఖ ఆర్థికవేత్త టిమ్ డైసన్ అభిప్రాయంలో 2026 నాటికి భారత్ జనాభా 142 కోట్లుగా ఉండగలదు.
- యూఎన్‌ఎఫ్‌పీఏ (United Nations Population Fund-UNFPA State of World's Population) నివేదిక 2011 ప్రకారం 2025 నాటికి భారత్ జనాభా 1.4 బిలియన్లకు చేరుకొని చైనాను అధిగమిస్తుంది. 2025 నాటికి చైనా జనాభా 1.39 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
- 2001-26 మధ్యకాలంలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో జనాభా వృద్ధి అధికంగా ఉంటుంది. ఈ నాలుగు రాష్ట్రాల జనాభా 45 నుంచి 55 శాతం మధ్య పెరుగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల 20 నుంచి 30 శాతం మధ్య ఉండగలదు.
- ప్రతి మహిళకు జన్మించే శిశువులు సగటున 2010లో 2.1 కాగా 2026 నాటికి రెండుకు తగ్గుతుంది.
- ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడనట్లయితే మరణాల రేటు పెరిగే సూచనలు కనిపిస్త్తున్నాయి. క్యాన్సర్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు అధికంగా ప్రబలే సూచనలున్నాయి.
- 2026 నాటికి పట్టణ జనాభా 36 శాతంగా ఉండగలదు.
- 2026 నాటికి మిలియన్ ప్లస్ జనాభా ఉండే నగరాలు 60 నుంచి 70 మధ్య ఉండగలవు.
- ప్రస్తుతం భారత్ జనాభాలో 25 ఏళ్ల వయసులోపు ఉన్న జనాభా 50 శాతం. కాగా 35 ఏళ్లలోపు ఉన్న జనాభా మొత్తం జనాభాలో 65 శాతం. 2020 నాటికి భారతీయుల సగటు వయసు 29 సంవత్సరాలు ఉండగలదు. కాగా 2020 నాటికి చైనీయుల సగటు వయసు 37 సంవత్సరాలు. జపాన్ దేశస్థుల సగటు వయసు 48గా ఉండగలదని అంచనా. 2030 నాటికి భారత్‌లో డిపెన్‌డెన్సీ రేషియో (Dependency Ratio) 0.4 గా ఉండగలదు. ఈ విధమైన పరిస్థితులు భారత్‌లో డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను స్పష్టం చేస్త్తున్నాయి. విద్య, శిక్షణ, ఉపాధి పెంపు వంటి కార్యక్రమాల ద్వారా పనిచేసే జనాభా సామర్ధ్యాన్ని పెంచినపుడు ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని, భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రూపొందగలదని అంచనా.
- భారత్ 1951లో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ పథకం అమలుకు చర్యలు తీసుకుంది.
- భారత్ 1952లోనే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించింది.
- 1966లో పూర్తిస్థాయి కుటుంబనియంత్రణ శాఖను ఏర్పాటు చేసింది.
- 1976లో నూతన జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించి కుటుంబ నియంత్రణను తప్పనిసరి చేసే అధికారాన్ని రాష్ర్ట ప్రభుత్వాలకిచ్చారు.
- 8వ ప్రణాళికలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రాధాన్యతా రంగంలో చేర్చి జనాభా పెరుగుదలను అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు.
- జనాభా పెరుగుదలను అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించడానికి 1991 డిసెంబర్‌లో కరుణాకరన్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
- జనాభా నియంత్రణలో భాగంగా కుటుంబ నియంత్రణ (Family planning) ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసే చర్యల్లో భాగంగా మేమిద్దరం, మాకిద్దరు (We Two Ours Two) అనే నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రభుత్వం విజయవంతమైంది.
- ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించే ప్రోత్సాహకాలను కూడా ఇద్దరు పిల్లలు ఉన్న ఉద్యోగులకే పరిమితం చేసింది. స్టెరిలైజేషన్‌కు (Sterilization) అనుమతించిన కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది.
- జాతీయ జనాభా విధానాన్ని (2000) ప్రకటించడం ద్వారా త్వరితగతిన (Immediate) మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను రూపొందించారు. 2045నాటికి జనాభా స్థిరీకరణ సాధించాలని దీర్ఘకాల లక్ష్యంగా తీసుకున్నారు.
- 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కుటుంబ నియంత్రణ అమలును పర్యవేక్షించే బాధ్యతను, అధికారాన్ని పంచాయతీ వ్యవస్థకు ఇచ్చారు.
Published date : 27 Jun 2013 04:50PM