Skip to main content

భారత్‌లో ద్రవ్యోల్బణం.. సమగ్ర విశ్లేషణ

డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్,ఐబీఎస్ హైదరాబాద్
యునెటైడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అధికారంలోకి వచ్చాక.. దేశంలో ద్రవ్యోల్బణం పరంగా నెలకొన్న పరిస్థితులు.. కారణాలు.. ప్రభుత్వం అనుసరించిన స్థూల ఆర్థిక దృక్పథం.. వ్యవసాయ,పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, ఆర్థిక రంగంలో ప్రభావం చూపిన అంశాలపై విశ్లేషణ..

యూపీఏ ప్రభుత్వం 2004లో అధికారంలోకి రావడానికి ముందు ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 నుంచి 7 శాతంగా ఉండగలదని ముందస్తు అంచనాలు వెల్లడయ్యాయి. అయితే వాస్తవానికి 8 శాతానికిపైగా వృద్ధి నమోదైంది. 1979 నుంచి 2003-04 మధ్య సగటు వృద్ధి 5.7 శాతం. అదే సమయంలో తూర్పు ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియాలతో పోల్చితే భారత్ వృద్ధి సాధనలో వెనుకంజలో నిలిచింది. 2003-04లో మొత్తం దేశ జనాభాలో 58 శాతం మందికి వ్యవసాయ రంగమే ఆధారంగా నిలిచింది. అదే సమయంలో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 22 శాతంగా నమోదైంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి 9.1 శాతంగా నమోదు కాగా, అది 2004-05లో 1.1 శాతానికి తగ్గడం గమనార్హం. నైరుతి రుతుపవనాలు తక్కువ వర్షపాతాన్ని కురిపించడంతో ఆ సమయంలో ఖరీఫ్ పంట ఉత్పత్తి క్షీణించింది. అక్టోబర్ 2003లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 6.2 శాతం వృద్ధి నమోదుకాగా, ఈ వృద్ధి అక్టోబర్ 2004లో 10.1 శాతానికి చేరింది. డిసెంబర్ 2004లో ఈ వృద్ధి క్షీణించడంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 8 శాతానికి తగ్గింది. 1996-97 తర్వాత 2000-01 మినహా మిగిలిన కాలంలో సేవారంగం స్థిరమైన వృద్ధిని సాధించింది. సేవా రంగానికి సంబంధించి 2004లో వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచార రంగంలో అధిక శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి ముందు సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ ఆశాజనకంగా ఉందని చెప్పొచ్చు.

స్థూల ఆర్థిక దృక్పథం:
యూపీఏ పాలన ప్రారంభానికి ముందు సంవత్సరంలో స్థిరధరల వద్ద (1993-94) స్థూల దేశీయోత్పత్తి 2003-04లో రూ.14,24,500 కోట్లుగా నమోదైతే, యూపీఏ ప్రభుత్వ హయాంలో జీడీపీ గణనీయంగా పెరిగింది. స్థిరధరల వద్ద (2004-05) 2007-08లో రూ. 38,96,636గా నమోదైన జీడీపీ.. 2012-13లో రూ. 55,03,476కు పెరిగింది. ప్రజల తలసరి ఆదాయంలోనూ గణనీయమైన పెరుగుదల సంభవించింది. స్థిరధరల వద్ద 2003-04లో తలసరి ఆదాయం రూ. 18,317 కాగా, 2011-12లో స్థిర ధరల వద్ద రూ. 38,037కు పెరిగింది. పెరిగిన తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణస్థాయిలో పెరుగుదలను సూచిస్తుంది. తలసరి ఆదాయంలో మెరుగుదల వినియోగ వ్యయం పెరగడానికి కారణమైంది. తద్వారా వస్తు, సేవల డిమాండ్‌లో పెరుగుదల నమోదైంది. సమష్టి డిమాండ్ కంటే సమష్టి సప్లయ్‌లో తగ్గుదల కారణంగా గత దశాబ్దంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు సంభవించాయి.

  • 2003-04లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 210.8 మిలియన్ టన్నులు కాగా, తదుపరి కాలంలో ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. 2007-08లో 230.8 మిలియన్ టన్నులకు, 2012-13లో 250.1 మిలియన్ టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఇదే కాలానికి సంబంధించి జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండటంతో డిమాండ్ కూడా పెరిగింది. ఈ అంశం ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడడానికి కారణమైంది.
  • ద్రవ్య సరఫరా పెరుగుదలను ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడడానికి ముఖ్య కారణంగా పేర్కొనవచ్చు. విశాల ద్రవ్యంగా పరిగణించే ఎం-3లో గణనీయమైన వృద్ధి సంభవించింది. ఎం-3 వృద్ధి 2003-04లో 16.4 శాతంగా నమోదు కాగా, అది 2007-08లో 21.4 శాతానికి చేరుకుంది. 2009-10లో 16.8 శాతంగానూ నమోదైంది. ద్రవ్య సరఫరాలో పెరుగుదలకు అనుపాతంగా ఉత్పత్తిలో వృద్ధి నమోదుకాకుంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విధమైన పరిస్థితిని యూపీఏ ప్రభుత్వ హయాంలో నిశితంగా గమనించవచ్చు.
  • భారత్‌లో ద్రవ్యోల్బణ కొలమానమైన టోకుధరల సూచీ (డబ్ల్యూపీఐ) 2003-04లో 4.6శాతంగా నమోదు కాగా, ఆర్థిక సంక్షోభం తదుపరి కాలంలో ఈ సూచీలో పెరుగుదల సంభవించింది. 2008-09లో డబ్ల్యూపీఐ 8.1 శా తం, 2010-11లో 9.6శాతం, 2011-12లో 8.9 శాతం, 2012-13లో 7.6 శాతంగా నమోదైంది. ఇదే కాలానికి పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీలోనూ పెరుగుదల సంభవించింది.
  • షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల పరపతిలోనూ గత పది సంవత్సరాలలో పెరుగుదల రేటు అధికంగా ఉంది. తద్వారా ద్రవ్య సరఫరా అధికమై ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతుల వృద్ధి అధికంగా ఉండటం కరెంట్ అకౌంట్ లోటు (current account deficit - CAD) పెరుగుదలకు దారితీసింది. ఇది రూపాయి విలువలో ఒడిదుడుకులకు కారణమైంది. ఈ స్థితి దిగుమతుల ధరల పెరుగుదలకు దారితీసింది. తద్వారా ఉత్పత్తి వ్యయాలు అధికమై ధరల పెరుగుదల అనివార్యమైంది.
  • వేతన ఉపాధి పథకాల అమలు గ్రామీణ ప్రజల ఆర్థికస్థితిగతులను మెరుగుపరిచింది. దాంతో ఈ స్థితి సమష్టి డిమాండ్ పెరుగుదలకు దారితీసింది.
వ్యవసాయరంగ అభివృద్ధి:
1990వ దశకం రెండో అర్ధభాగం నుంచి వ్యవసాయ రంగంలో వృద్ధి క్షీణించింది. 1987-88 నుంచి 1996-97 మధ్యలో వ్యవసాయ రంగం సగటు సాంవత్సరిక వృద్ధి 3.61శాతం కాగా, తదుపరి కాలంలో వృద్ధి మందగించింది. 1996-97 నుంచి 2005-06 మధ్య సగటు వృద్ధి 2.2 శాతానికి తగ్గింది. 2006-07 తర్వాత వ్యవసాయ రంగం కొంతమేర పురోగమించింది. 11వ ప్రణాళికలో పంట ఉత్పత్తి వృద్ధిలో కొంతమేర పెరుగుదల సంభవించింది. 2009-10లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా గత దశాబ్దంలో అనేక పంటల ఉత్పత్తి వృద్ధిలో తేడా కంటే ఉత్పాదకత వృద్ధిలో తేడా (వేరియేషన్‌‌స) ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. కొన్ని పంటల కింద ఉన్న భూ విస్తీర్ణంలో పెరుగుదల సంభవిస్తే మరికొన్ని పంటల విస్తీర్ణంలో తగ్గుదల ఏర్పడింది. పప్పుధాన్యాల ఉత్పాదక పెరుగుదల సంతృప్తికరంగా లేదు. చెరుకు ఉత్పాదకత స్తంభించింది. వివిధ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగ ప్రగతిలోనూ తేడాలు గత దశాబ్దంలో అధికమయ్యాయి. 2004-05 ధరల వద్ద వ్యవసాయరంగంలో వార్షిక వృద్ధి సగటు గుజరాత్‌లో అత్యధికంగా 15 శాతంగా నమోదైంది. 2002-03 తర్వాత గుజరాత్ వ్యవసాయ రంగంలో అధిక వృద్ధి సాధించింది. తర్వాతి స్థానంలో ఛత్తీస్‌గఢ్ నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయరంగ సగటు సాంవత్సరిక వృద్ధి గత దశాబ్దంలో 6.1 శాతంగా నమోదైంది. వ్యవసాయ ఉత్పత్తిలో 4 శాతానికిపైగా వృద్ధి సాధించిన రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి. ఒడిశాలో వ్యవసాయ రంగ ఉత్పత్తి వృద్ధి 3 శాతానికి పరిమితం కాగా, గత దశాబ్దంలో జార్ఖండ్‌లో రుణాత్మక వృద్ధి నమోదైంది. ఉత్పాదకస్థాయి తక్కువగా ఉన్న కర్ణాటక, అసోంలలో వ్యవసాయ ఉత్పత్తిలో వృద్ధి 1 శాతంలోపు మాత్రమే నమోదైంది. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ రంగ పెట్టుబడులు జీడీపీలో 4 శాతానికి పెంచడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. 2004-05 నుంచి 2006-07 మధ్యలో వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరిగినప్పటికీ.. తదుపరి కాలంలో తగ్గుదల సంభవించింది. ఇటీవల కాలంలో ప్రైవేటు రంగ పెట్టుబడులు పెరిగిన కారణంగా మొత్తం వ్యవసాయ రంగంలో పెట్టుబడుల పెరుగుదలలో ప్రగతి సంభవించింది.

పారిశ్రామిక వృద్ధిలో ఒడిదుడుకులు:
2002-03లో పారిశ్రామిక రంగంలో వృద్ధి 7 శాతంగా నమోదు కాగా, తొమ్మిదో ప్రణాళికలో సగటు వృద్ధి 5 శాతానికి తగ్గింది. 10వ ప్రణాళికలో సగటున 8.2 శాతం వృద్ధి సాధించిన పారిశ్రామిక రంగం 2008-09లో 2.7 శాతానికి పరిమితమైంది. గత రెండు సంవత్సరాలలో (2011-12, 2012-13) జీడీపీ వృద్ధి క్షీణించడానికి పారిశ్రామిక వృద్ధిరేటు తగ్గుదల కారణమైంది. 2011-12లో 3.5 శాతం, 2012-13లో 3.1 శాతం వృద్ధినే పారిశ్రామిక రంగం నమోదు చేసుకొంది. విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం వృద్ధిలోనూ ఇటీవల కాలంలో తగ్గుదల సంభవించింది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి తగ్గిన కారణంగా వినియోగ వస్తువుల ఉత్పత్తి తగ్గడంతో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడ్డాయి.

భవిష్యత్ కార్యాచరణ:
  • ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి తగిన చర్యలు తీసుకోవాలి.
  • శ్రామిక శక్తికి అదనంగా తోడయ్యే అసంఖ్యాకమైన ప్రజలకు ఉత్పాదక ఉపాధి అందించి పేదరిక తగ్గుదలకు చర్యలు చేపట్టాలి.
  • భారత్ ప్రస్తుతం వినియోగం నుంచి పెట్టుబడి వైపు తన దృష్టిని మరల్చాలి. ప్రభుత్వ రంగం పొదుపు, కుటుంబ రంగ పొదుపును పెంచడానికి తగిన చర్యలు అవసరం.
  • స్థూల ఆర్థిక స్థిరీకరణ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యలోటు తగ్గించే చర్యలకు ప్రాధాన్యమివ్వాలి.
  • వ్యవసాయ రంగానికి సంబంధించి వర్తక నిబంధనలను మెరుగుపరచడం, ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెంపు, సకాలంలో ఉత్పాదితాల సరఫరా, ఇతర సంస్థాపరమైన చర్యలు అవసరం.
  • తయారీ రంగ వృద్ధి క్షీణత నివారణకు చర్యలు చేపట్టడం ద్వారా వినియోగ వస్తు ఉత్పత్తి వృద్ధిని ప్రోత్సహించాలి.
ప్రధానమంత్రి అభిప్రాయం
General Essays
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విజయవంతం కాలేకపోయిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల అభిప్రాయపడ్డారు. సమ్మిళిత వృద్ధి సాధనలో భాగంగా ప్రభుత్వం అవలంబించిన విధానాల కారణంగా బలహీన వర్గాల ప్రజల వద్ద లభ్యమయ్యే ద్రవ్య పరిమాణం పెరగడం ద్రవ్యోల్బణం ఏర్పడడానికి ముఖ్య కారణంగా ఆయన పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో ఏర్పడిన నిరంతర పెరుగుదల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)లో పెరుగుదలకు కారణమైంది. ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ శాతం మంది ప్రజల ఆదాయంలో పెరుగుదల రేటు అధికమని ప్రధాని అభిప్రాయపడ్డారు. కూరగాయలు, పండ్లు వంటి ఉత్పత్తుల సరఫరా, మార్కెటింగ్‌ను మెరుగుపరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత మెరుగ్గా పని చేయాల్సి ఉందన్నారు. 2012-13లో వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైనప్పటికీ రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి రేటు మెరుగుపడే అవకాశం ఉందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థికవృద్ధి మెరుగయ్యే సూచనల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్వదేశంలోని అవరోధాలను అధిగమించగలవని, తద్వారా వృద్ధిరేటు మెరుగుపడగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో భారత్‌తోపాటు వర్ధమాన దేశాల్లోనూ వృద్ధి మందగించిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.
Published date : 23 Jan 2014 12:10PM

Photo Stories