Skip to main content

ఆర్థిక అసమానతలు.. ఆకలి కేకలు

డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్,ఐబీఎస్ హైదరాబాద్
ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యంగా ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జెనీవా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) ఏర్పాైటైంది. వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ రాజకీయ నేతలు, ఎంపిక చేసిన మేధావులు, ఆర్థిక నిపుణులు, పాత్రికేయులు ఈ వేదిక నిర్వహించే శీతాకాల సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ఏటా లాటిన్ అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో ఆరు నుంచి ఎనిమిది ప్రాంతీయ సమావేశాలు.. చైనా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో రెండు వార్షిక సమావేశాలను ఈ వేదిక నిర్వహిస్తుంది. 2014, జనవరి 22-25 మధ్య దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక 44వ వార్షిక సదస్సు జరిగింది. ప్రపంచ పునర్నిర్మాణం- సమాజం, రాజకీయం, వ్యాపారం (The Reshaping of the world consequences for society, politics, and business) ఇతివృత్తంతో సమావేశం జరిగింది.

ఆర్థిక అసమానతల నేపథ్యంలో పెరుగుతున్న పేదరిక సమస్యకు పరిష్కారం చూపించే విషయంలో వేదిక విఫలమైందని చెప్పొచ్చు. ఈ సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలు...

ఆర్థిక ప్రగతి - ఆశావాదం:
అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ప్రగతిపట్ల జాగరూకతతో కూడిన ఆశావాదాన్ని ప్రపంచ ఆర్థిక వేదిక వ్యక్తపరుస్తుంది. స్వల్ప కాలంలో అంతర్జాతీయ వృద్ధి ప్రగతికి అనువైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ దీర్ఘకాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా వృద్ధిరేటులో ఒడుదుడుకులు సంభవిస్తున్నా యి. ప్రస్తుతం కొన్ని ఆర్థిక వ్యవస్థలలో ప్రోత్సాహకర వృద్ధి సంకేతాలున్నాయి. ఆయా ఆర్థిక వ్యవస్థలు అవలంబించిన విస్తరణ, ఆర్థిక విధానాలు దీనికి కారణమయ్యాయి. మరోవైపు వృద్ధితోపాటు ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా ఆయా ఆర్థిక వ్యవస్థలు పురోగమనాన్ని ప్రోత్సహించే విస్తరణ, ఆర్థిక విధానాలను విడనాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆర్థిక వృద్ధిరేటు ప్రపంచ వ్యాప్తంగా సంతృప్తికరంగా లేదు. వేగవంతమైన మార్కెట్లలోనూ వృద్ధి క్షీణతను గమనించవచ్చు. అర్జెంటీనాలో పెసో (అర్జెంటీనా కరెన్సీ) సంక్షోభం కారణంగా 1997 నుంచి 2000 మధ్య కాలంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. వేతనాల పెరుగుదల, పతనమైన కరెన్సీ విలువ కారణంగా ైచె నా వృద్ధిరేటు మందగించింది. యూరోజోన్‌లో ముఖ్య దేశమైన ఫ్రాన్స్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. మరోవైపు జర్మనీ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. యునెటైడ్ కింగ్‌డమ్ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.

ఆర్థిక అసమానతలు..
అభివృద్ధి చెందిన దేశాలలో ముఖ్యంగా అమెరికా, యుైనె టెడ్ కింగ్‌డమ్‌లో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఇవి ఆయా ఆర్థిక వ్యవస్థలలో సామాజికరంగ అభివృద్ధితో పాటు ఆర్థిక సుస్థిరతకు అవరోధాన్ని కల్పించగలవు. అసమానతలు సమాజంలో నిరాశా నిస్పృహలను పెంచడం ద్వారా ఆర్థికవృద్ధి క్షీణతకు గురిచేస్తాయి. యువత తమకు భవిష్యత్ లేదని భావించినపుడు ఆయా దేశాలలో అశాంతి పెరిగి దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లగలదు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన ఆర్థిక వేత్త జెన్నిఫర్ బ్లాంకే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరుగుదలలో పాటు ధనిక, పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు వేగంగా పెరిగాయి. అభివృద్ధి చెందిన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో సాంఘిక అభద్రతా భావం (టౌఛిజ్చీ ఠట్ఛట్ట)పెరిగింది. దీనికి కారణం ఆర్థిక అసమానతలే. ఈ ఆర్థిక అసమానతలపై అవగాహన పెరగడం, పరపతి మార్కెట్ల వల్ల కొన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందడం; అధిక వ్యయంతో కూడిన విద్య అనేక దేశాల్లో సాంఘిక అభద్రతా భావం పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. ఆర్థిక అసమానతల కారణంగా పెరుగుతున్న పేదరిక తీవ్రతను వేదిక గుర్తించింది.

44వ సమావేశం- ముఖ్యాంశాలు:
  • గుడ్ గవర్నెన్స్ ద్వారా లభించిన ప్రతిఫలంలో (డివిడెండ్) ఆఫ్రికా దేశాలు సాధించిన ప్రగతి, ఆర్థికాభివృద్ధి ముఖ్యమైనదని ఘనా అధ్యక్షుడు జాన్ మహమా అభివర్ణించారు. ఈ స్థితి ఘనాలో విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడుల పెరుగుదలకు దారి తీసిందన్నారు.
  • అనేక ఆఫ్రికా దేశాలు సుస్థిరమైన గవర్నెన్స్ సాధించాయని ఆర్థిక వృద్ధి గురించి ఆలోచించే క్రమంలో రాజకీయ సుస్థిరత సాధించ డం ప్రధానమని నైజీరియా అధ్యక్షుడు గుడ్‌లక్ జోనాథన్ అన్నారు.
  • యువతలో నిరుద్యోగితను తగ్గించే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్య ఆవశ్యకతను రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా అధ్యక్షురాలు ఎలీన్ జాన్సన్ షర్లీఫ్ నొక్కి వక్కాణించారు.
  • నైజీరియా ప్రభుత్వం ప్రారంభించిన 'YOU WIN' కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. స్వయం ఉపాధి పెంపుగా నైజీరియా ఆర్థికమంత్రి గోజీ యొకంజో ఇవియాలా పేర్కొన్నారు. యువత ఉపాధి కొరకు వేచిచూడకుండా వారే స్వతహాగా అవకాశాలను సృష్టించుకొని, ఇతరులకు కొలువులు చూపే దిశగా ప్రయత్నించాలని ఆయన ఉద్బోధించారు.
  • పౌష్టికాహార లోపాన్ని నివారించే క్రమంలో 40 ప్రపంచ కంపెనీలు కలిసి పనిచేస్తాయని సదస్సులో ప్రకటించారు. 2020 నాటికి 127 మిలియన్ల మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోప నివారణకు కృషిచేస్తాయని ప్రకటించింది.
  • ఆకలి నిర్మూలన (జీరో హంగర్) సాధించే క్రమంలో ప్రైవేటు రంగ పాత్రను వేదిక గుర్తించింది. ప్రపంచ ఆహార కార్యక్రమం అమల్లో ముఖ్య ప్రైవేటు రంగ భాగస్వాములైన రాయల్ డీఎస్‌ఎం, యునీలీవర్ సంస్థలు ఆకలి నిర్మూలనకు కట్టుబడి ఉండాలని వేదిక స్పష్టం చేసింది.
  • ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కొత్త విధానపరమైన సవాళ్లను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టిన్ లగార్డే అభిప్రాయపడ్డారు.
పేదరిక నిర్మూలన:
90వ దశకం తొలి భాగంలో మధ్య, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో ఆదాయస్థాయిలో తగ్గుదల కనిపించింది. సోవియట్ పతనం కారణంగా తలసరి స్థూల దేశీయోత్పత్తిలో క్షీణత ఏర్పడింది. ఫలితంగా పేదరిక తీవ్రత పెరిగింది. 2008లో 1.29 బిలియన్ ప్రజలు నిరపేక్ష పేదరికంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వీరిలో 400 మిలియన్ల ప్రజలు భారత్‌లోనూ, 173 మిలియన్ ప్రజలు చైనాలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నట్లుగా పేర్కొంది. సబ్ సహారన్ ఆఫ్రికాలో 2008లో 47 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం తీవ్ర పేదికరం ప్రపంచ సవాల్‌గా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తీవ్ర పేదరికాన్ని గమనించవచ్చు.

డెలాయిట్ సర్వే- 2014:
రాబోయే దశాబ్దంలో ప్రపంచ శ్రామిక శక్తిలో అధిక వాటా ను కలిగియుండే యువత.. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రభుత్వ సామర్థ్యంపై నమ్మకం కోల్పోయినట్లు డెలాయిట్ సర్వే అభిప్రాయపడింది. 28 దేశాలకు చెందిన 18-35 ఏళ్ల వయసున్న 8 వేల మంది అభిప్రాయాలను సర్వే కోసం క్రోడీకరించారు. అనేక దేశాల్లో వయోజనులతో పోలిస్తే యువ శ్రామికశక్తిలో నిరుద్యోగం రెండు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని సర్వే పేర్కొంది. 2025 నాటికి ప్రపంచ శ్రామికశక్తిలో యువ శ్రామికశక్తి వాటా 75 శాతంగా ఉండగలదు. ఉపాధి, సంపదను పెంపొందించడం ద్వారా వ్యాపా రం సమాజంపై ధనాత్మక ప్రభావం చూపగలదని సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ప్రపంచ సంపద పంపిణీ- 1500 సంవత్సరం:
తలసరి స్థూల దేశీయోత్పత్తి అంచనాల ప్రకారం ప్రపంచంలో 1500 సంవత్సరంలో ఐరోపా ప్రాంతాలు అత్యంత ధనిక దేశాలు. తూర్పు ఆసియా, దక్షిణాసియా దేశాలలో స్థూల దేశీయోత్పత్తి ఎక్కువగా నమోదైంది. 1500 సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మధ్య ఆఫ్రికా, ఆగ్నేయ ఆఫ్రికా ప్రాంతాల్లో తక్కువగా నమోదైంది. ఈ ప్రాంతాలు 2000 తర్వాతి కాలంలోనూ తక్కువ స్థూల దేశీయోత్పత్తినే నమోదు చేసుకున్నాయి. ప్రపంచ జీడీపీలో ఆయా ప్రాంతాల వాటా ఇప్పటికీ తక్కువగానే ఉంది.

ప్రపంచ ఆదాయ అసమానతలు:
ప్రపంచ బ్యాంకు దత్తాంశం ఆధారంగా చేసుకొని, 'ది కాన్ఫరెన్స్ బోర్డ్ ఆఫ్ కెనడా' ప్రపంచ ఆదాయ అసమానతలను అంచనా వేసింది. ప్రపంచ ఆదాయంలో 42 శాతం ప్రపంచ జనాభాలో ధనికులైన 10 శాతం మంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నది. ప్రపంచ జనాభాలో 10 శాతం పేద ప్రజల వాటా ప్రపంచ ఆదాయంలో ఒక శాతం మాత్రమే. 80వ దశకం, 90వ దశకం మధ్య భాగంలో అనేక దేశాల్లో ఆదాయ అసమానతలు పెరగగా, 2000 తర్వాత ఈ అసమానతలు కొంతమేర తగ్గాయి. దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా దేశాలలో ఆదాయ అసమానతలు తక్కువ ఉండగా, అమెరికా, కెనడాలలో ఆదాయ అసమానతలు మధ్యస్థంగా ఉన్నాయి. 2011లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలోనూ ఆదాయ అసమానతలు, అవినీతిని ప్రపంచ సవాళ్లుగా పేర్కొన్నారు. ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ మార్కెట్ వ్యవస్థల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు తగ్గినప్పటికీ అనేక దేశాల్లో వివిధ వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగినట్లు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఫ్రీమన్ 2011 దావోస్ సమావేశంలో పేర్కొన్నారు. ఫోర్బ్స్ మేగజీన్ 2011లో ప్రపంచంలో 1210 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపదను 4.5 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. 2012తో పోల్చినప్పుడు 2013లో ధనికులైన 400 మంది అమెరికన్ల సంపదలో 19 శాతం పెరుగుదల నమోదైనట్లు 'ఫోర్బ్స్' తెలిపింది. 2012లో వీరి ఉమ్మడి సంపద 1.7 ట్రిలియన్ డాలర్లు కాగా, 2013లో 2.02 ట్రిలియన్ డాలర్లకు పెరిగిం ది. 2012లో ప్రతి వ్యక్తి సగటు నికర సంపద 4.2 బిలియన్ డాలర్లు కాగా 2013లో 5 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ప్రపంచంలో పురుషుల ఆదాయం మహిళల ఆదాయం కంటే రెండు రెట్లు మించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ పురుషుల సంపాదన మహిళల కంటే ఎక్కువగా ఉంది. మహిళలు, పురుషుల మధ్య ఆదాయ అసమానతలు దక్షిణాసియాలో అధికం. ఈ ప్రాంతంలో పురుషుల సంపాదన మహిళల సంపాదన కంటే దాదాపు అయిదు రెట్లు ఎక్కువ. దక్షిణాసియాలో ఆదాయం పరంగా వీరి మధ్య వ్యత్యాసం తక్కువ. ఈ ప్రాంతంలో పురుషుల సంపాదన, మహిళల కంటే రెట్టింపు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఆదాయంలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, చైనా రెండో స్థానంలో ఉంది. జనాభాలో అధిక వార్షిక ఆదాయం మహిళలకు సంబంధించి నార్వే, డెన్మార్క్‌లలో ఎక్కువ.

Published date : 06 Feb 2014 05:39PM

Photo Stories