Skip to main content

పోటీపరీక్షల్లో పర్యావరణంతో ముడిపడిన అర్థశాస్త్ర అంశాలకు ఎలా ప్రిపేర్‌కావాలి?

-ఎస్.హైమావతి, విశాఖపట్నం.
Question
పోటీపరీక్షల్లో పర్యావరణంతో ముడిపడిన అర్థశాస్త్ర అంశాలకు ఎలా ప్రిపేర్‌కావాలి?
  1. పర్యావరణ అర్థశాస్త్రం (Environmental Economics).. మానవాభివృద్ధికి, పర్యావరణానికి మధ్యగల అంతర్గత సంబంధాన్ని వివరిస్తుంది. అధిక ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు వివిధ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు రూపొందించాల్సిన పథకాలు, ఆయా పథకాల అమలుకు తీసుకోవాల్సిన ఆర్థిక నిర్ణయాలను పర్యావరణ అర్థశాస్త్రం చర్చిస్తుంది. వీటిపై అవగాహన పెంపొందించుకోవాలి.
  2. వస్తువుల ఉత్పత్తిని పెంచటం ద్వారా గరిష్ట లాభాలు ఆర్జించాలంటే పర్యావరణ వనరులను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో అర్థశాస్త్ర విభాగాలైన నిశ్చయాత్మక, ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రాలు.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థల మధ్య అంతర్గత సంబంధాన్ని విశ్లేషిస్తాయి. పర్యావరణ ఆస్తులపై ఆర్థిక కార్యకలాపాల ప్రభావాన్ని నిశ్చయాత్మక అర్థశాస్త్రం తెలుపుతుంది. అయితే ఇది ఎలాంటి తీర్పులు ఇవ్వదు. ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రం మాత్రం పర్యావరణ వస్తువులను దోపిడీ చేస్తూ, జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయటం సమంజసమా? అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. పర్యావరణ సమతుల్యతకు చేసే పథకాల రచన వల్ల కలిగే లాభనష్టాలు, నష్టాల నివారణకు అనుసరించే మార్గాలు ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రం పరిధిలోకి వస్తాయి. ఆయా అంశాలను సమకాలీన పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
  3. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని సాధించేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించటం, అధిక పారిశ్రామికీకరణ కారణంగా శీతోష్ణస్థితి, వాతావరణం మార్పు చెందుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో వివిధ రంగాలకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేయాలి. అడవుల విస్తరణ, విస్తీర్ణాన్ని సాధించాల్సిన లక్ష్యాలు, వాటి సాధనకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  4. స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికాబద్ద ఆర్థిక ప్రగతిలో భాగంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. జాతీయాదాయం, తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాల్లో అధిక ప్రగతి నమోదైంది. దేశంలో సహజ వనరుల వినియోగంలో విచక్షణ పాటించకపోవటం, పునరుత్పన్నం కాని వనరులను ఇష్టానుసారం ఉపయోగించటం, పర్యావరణ-జీవ వైవిధ్యం ప్రాధాన్యతను గుర్తించకపోవటం వల్ల దేశంలో పర్యావరణ తులారాహిత్యం పెరుగుతోంది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత్ వాటా తక్కువగా ఉన్నప్పటికీ, పారిశ్రామిక కాలుష్యాలైన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో దేశానికి అధిక వాటా ఉండటం గమనించాల్సిన అంశం.
  5. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన జనాభాలో 85 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. ఈ దేశాల్లో గ్రామీణ జనాభా రెట్టింపై, పర్యావరణ పరిరక్షణకు సవాలుగా పరిణమించింది. పట్టణ జనాభా వృద్ధి కారణంగా మౌలిక వసతుల కల్పనపై ఒత్తిడి పెరిగింది. అదే విధంగా కాలుష్యం పెరగడంతో పర్యావరణ క్షీణత ఏర్పడింది. ఒకే పంటను ఎక్కువసార్లు పండించటం, పురుగు మందుల అధిక వినియోగం కారణంగా భూసారం తగ్గింది. భూమి కోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, గుంతల్లో వ్యర్థాలను పూడ్చటం వంటి వాటివల్ల భూమి నాణ్యత క్షీణిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల విధానపర చర్యలను తెలుసుకోవాలి.
  6. ప్రపంచ వ్యాప్తంగా మానవ కార్యకలాపాలు, భారీ పారిశ్రామికీకరణ ప్రక్రియ.. పర్యావరణ సమతుల్య సాధనకు అవరోధంగా నిలిచాయి. పర్యావరణ తులారాహిత్యానికి సంబంధించి పరిమాణాత్మక, ద్రవ్యపరమైన అంచనాలను రూపొందించటం కష్టతరమైనప్పటికీ, ఇటీవల కాలంలో కొన్ని దేశాలకు ఈ రకమైన అంచనాలు వెలువడ్డాయి. వీటిపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు విడుదల చేసిన నివేదికల్లోని ముఖ్యాంశాలను తెలుసుకోవాలి.
  7. శ్రేయస్సును కొలవటంలో స్థూలజాతీయోత్పత్తి అంచనాలు ఎంతవరకు ఉపకరిస్తాయనే విషయంలో ఆర్థిక వేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు సందేహాలు వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఆర్థికాభివృద్ధి, జాతీయ శ్రేయస్సును కొలిచేందుకు జీఎన్‌పీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ జీఎన్‌పీ కొలమానం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అధ్యయనం చేయాలి.

Photo Stories