Skip to main content

కోచింగ్‌ తీసుకోకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా?

– గుండమల్ల సతీష్‌కుమార్, సంస్థాన్‌ నారాయణపురం, యాదాద్రి భువనగిరి.
Question
కోచింగ్‌ తీసుకోకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా?
స్వీయ సామర్థ్యాన్ని విశ్లేషించుకొని ఒక పరీక్షకు శిక్షణ తీసుకోవాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే సొంత ప్రిపరేషన్‌తో విజయం సాధించిన వారు ఎందరో ఉన్నారు. పూర్తిస్థాయి కోచింగ్‌ లేకుండా సివిల్స్‌లో సైతం సక్సెస్‌ను అందుకున్న వారు ఉన్నారు. అయితే స్వీయ సన్నద్ధతతో పరీక్షలు రాయాలనుకునే వారికి ఆత్మవిశ్వాసం, ఎలాగైనా విజయం సాధించాలనే తపన, పటిష్ట ప్రణాళిక, కష్టపడేతత్వం ఉండాలి. ఒక్క పోస్టు ఉన్న నోటిఫికేషన్‌కైనా పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పట్టుదలతో చదివితే తప్ప విజయం సాధ్యంకాదు. తొలుత లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు గ్రూప్‌–2 లక్ష్యమైతే.. తొలుత పేపర్ల వారీగా సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఆపై గత విజేతలు, తెలిసిన ఫ్యాకల్టీ సహాయంతో ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి. గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తూ, ఏ అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించాలి. ప్రశ్నలు అడుగుతున్న సరళినీ అర్థం చేసుకోవాలి. తర్వాత రోజువారీ పూర్తిచేయాల్సిన అంశాలతో టైంటేబుల్‌ రూపొందించుకోవాలి. చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా ఒక పుస్తకంలో షార్ట్‌నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. ఈ నోట్స్‌ను వారానికి ఒకసారి మళ్లీ చదవాలి. అభ్యర్థులు కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా, ఎప్పటికప్పుడు ప్రిపరేషన్‌ సాగుతున్న తీరుపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. దీనికోసం సబ్జెక్టుల వారీగా మాక్‌టెస్ట్‌లు రాయడం ముఖ్యం. వాటిని మూల్యాంకనం చేసుకొని, ప్రిపరేషన్‌ పరంగా లోపాలను సరిదిద్దుకోవాలి. రోజూ దినపత్రికలను చదువుతూ ముఖ్యాంశాలను నోట్‌ చేసుకోవాలి. సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలను స్నేహితులు లేదా తెలిసిన ఫ్యాకల్టీ సహాయంతో ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఇంటర్నెట్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ‘సాక్షి’ భవిత, విద్య పేజీలు; www.sakshieducation.com  ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి. ఎస్‌ఐ తరహా పోస్టులకు సిద్ధమవాలనుకుంటే సబ్జెక్టుల ప్రిపరేషన్‌తో పాటు ఈవెంట్లకు కూడా ప్రాధాన్యమివ్వాలి.

Photo Stories