పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి ఏవిధమైన ప్రశ్నలు వస్తాయి? దీనికి ఎలా సన్నద్ధమవ్వాలి?
- కె.రవితేజ, విశాఖపట్నం.
Question
పోటీ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి ఏవిధమైన ప్రశ్నలు వస్తాయి? దీనికి ఎలా సన్నద్ధమవ్వాలి?
పోటీపరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ ముఖ్య విభాగం. దీంట్లో భాగంగా వెర్బల్, నాన్‌వెర్బల్, లాజికల్ రీజనింగ్ అంశాలుంటాయి. క్రమ పరీక్ష, భిన్న పరీక్ష, క్యాలెండర్, దిశలు, దూరాలు, రక్త సంబంధాలు, పోలిక పరీక్ష తదితర అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో సమయం చాలా విలువైంది. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కచ్చితత్వం కూడా అలవడుతుంది. క్రమ పరీక్ష, నంబర్ పోలిక, భిన్న పరీక్ష, డేటా ఇంటర్ ప్రిటేషన్ (డీఐ)కు సంబంధించిన సమస్యలను సాధించడానికి 1 నుంచి 20 వరకు ఎక్కాలు; 1 నుంచి 25 వరకు వర్గాలు, ఘనాలు తెలిసి ఉండాలి. తద్వారా వేగంగా సమాధానాలు గుర్తించవచ్చు. అదేవిధంగా కోడింగ్-డీకోడింగ్లోని ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించడానికి A నుంచి Z వరకు, Z నుంచి A వరకు సంఖ్యా క్రమం తెలిసి ఉండాలి. దిశలు-దూరాలు అధ్యాయంలోని సమస్యలను సాధించడానికి అన్ని దిశలు తెలిసి ఉండాలి.