Skip to main content

వినూత్న బోధనకు కేరాఫ్ ఐఐటీ బాంబే

జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే వారిలో అత్యధిక మంది లక్ష్యం.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - బాంబేలో సీటు సాధించడం. ముఖ్యంగా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంత ప్రాముఖ్యం కలిగిన ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతుండటం తన అదృష్టం అంటున్నాడు తెలుగు విద్యార్థి తేజ మడక. ప్రస్తుతం తేజ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. బోధన, పరిశోధన, ప్రాంగణ నియామకాల్లో అనుసరిస్తున్న వినూత్న విధానాల వల్లే అత్యధికులు ఐఐటీ -బాంబే వైపు ఆకర్షితులవుతున్నారంటూ తేజ చెబుతున్న క్యాంపస్ కబుర్లు...
మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం. నాన్న రైతు, అమ్మ గృహిణి. ఇంటర్ వరకు నాకు లక్ష్యాలేమీ లేవు. ఇంటర్‌లో లెక్చరర్స్ ప్రసంగాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తితో ఇంటర్‌లో కష్టపడి చదివి 97 శాతం మార్కులు సాధించా. జే ఈఈ అడ్వాన్స్‌డ్‌లో 273వ ర్యాంకు వచ్చింది. లెక్చరర్స్ సూచన మేరకు ఐఐటీ-బాంబేలో చేరాను. ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు చదివిన క్యాంపస్‌లో నేనూ చదువుతుండటం నిజంగా నా అదృష్టం.

తెలుగు విద్యార్థులు 30-40%
జీవితం గురించి ఏమీ తెలియని దశలో ఇక్కడికి వచ్చిన నాకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందీ క్యాంపస్. విజ్ఞానంతో పాటు మంచి స్నేహితులు, చక్కగా దిశానిర్దేశం చేసే సీనియర్లు, సదా ప్రోత్సహించే గురువులను నాకందించింది. ఇక్కడ చేరడం వల్లనే హిందీ, ఇంగ్లిష్ బాగా నేర్చుకోగలిగాను. ఇక్కడ తెలుగు విద్యార్థులు 30-40 శాతం ఉంటారు. అందులోనూ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచ్‌లలో ఎక్కువ మంది ఉంటారు. క్యాంపస్‌లో చేరేటప్పుడే స్టూడెంట్ మెంటార్‌షిప్ ప్రోగ్రాం కింద ప్రతి కొత్త విద్యార్థికీ ఇద్దరు సీనియర్లను కేటాయిస్తారు. వీరు క్యాంపస్‌కు సంబంధించిన చాలా విషయాలపై అవగాహన కల్పిస్తారు.

డిఫరెంట్ టీచింగ్ మెథడాలజీ:
ఇక్కడ ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న సమయాన్ని స్లాట్‌లుగా విభజించి రోజుకు నాలుగు క్లాసులు నిర్వహిస్తారు. వారానికి 20 గంటలు క్లాసులు, మూడుసార్లు ల్యాబ్ ఉంటాయి. ఇండస్ట్రీ, రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా బోధన ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించినవారికి అవార్డుతోపాటు నగదు బహుమతి అందిస్తారు. ఒత్తిడి ఎదుర్కోవడానికి స్ట్రెస్ మేనేజ్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై కూడా క్లాసులుంటాయి. సబ్జెక్టు పరంగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు.

ఇక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్లలో దాదాపు 95 శాతం మంది పీహెచ్‌డీ చేసిన వారే.
ఇక్కడ ఫ్యాకల్టీ, స్టూడెంట్ నిష్పత్తి 1:13 గా ఉంటుంది.
జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు హాజరయ్యే వారికి ఆర్థిక సహాయం చేస్తారు.
క్లాస్ రూం టీచింగ్‌తోపాటు వీడియో లెక్చర్స్, ఆన్‌లైన్ మెటీరియల్ వంటి టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ విధానాలు కూడా ఉంటాయి.
ఈ క్యాంపస్ మొత్తం మీద సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్ చాలా పెద్దది. ఈ విభాగంలోనే పది రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి.
ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్, పూర్వ విద్యార్థుల సొసైటీ సంయుక్తంగా స్కాలర్‌షిప్‌లు అందిస్తాయి.
ప్రతి ఏటా జరిగే టెక్నికల్ ఫెస్ట్‌లో విద్యార్థులు తమకొచ్చే వినూత్న ఆలోచనలను వివరించొచ్చు. అంతేకాకుండా తాము తయారు చేసిన యంత్ర పరికరాలు, రూపొందించిన అప్లికేషన్లను ఈ ఫెస్ట్‌లో ప్రదర్శించొచ్చు.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్, ఇంక్యుబేషన్ సెల్ ద్వారా స్టార్టప్స్‌పై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తారు.
ప్రాంగణ నియామకాల్లో చరిత్ర సృష్టించినా, ప్రపంచ స్థాయి కంపెనీల కార్లను తలదన్నేలా రేసింగ్ కారును రూపొందించినా, ప్రథమ్ అనే శాటిలైట్‌ను తయారు చేసినా అది ఐఐటీ -బాంబేకే సొంతం.
సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి కొదవలేదు.
Published date : 30 Sep 2016 12:25PM

Photo Stories