Skip to main content

సామాజిక అభివృద్ధిలో ‘సివిల్’

‘నిర్మాణాలకు సంబంధించి శాస్త్రీయ నైపుణ్యాలు అందించే సివిల్ ఇంజనీరింగ్... సామాజిక అభివృద్ధికి తోడ్పడుతూ మంచి కెరీర్ ఆప్షన్‌గా కొనసాగుతోంది’ అని ఐఐఎస్సీ బెంగళూరు సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ పి.పి.మజుందార్ తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, వాటర్ రిసోర్స్ సిస్టంలో పీహెచ్‌డీ పూర్తిచేసి 25 ఏళ్లకు పైగా బోధన అనుభవం గల ఆయన పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ఇంటర్ డిసిప్లినరీ సెంటర్ ఫర్ వాటర్ రీసెర్చ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ పి.పి.మజుందార్‌తో గెస్ట్ కాలం...
ప్రస్తుతం అధిక శాతం మంది ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఐటీ, సీఎస్‌ఈ వంటి ఆధునిక కోర్సులను ఎంచుకుంటున్నారు. సివిల్ ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీతో ముడిపడిన బ్రాంచ్ కావడంతో, ఆ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనైతే తమ కెరీర్‌పైనా ప్రభావం చూపుతుందని ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.

సామాజిక అభివృద్ధికి దోహదం
ఇటీవల కాలంలో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సివిల్ ఇంజనీరింగ్‌లోనూ వినూత్న మార్పులు జరుగుతున్నాయి. ఉన్నత విద్య స్థాయిలో వాటర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, జీఐఎస్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్ వంటి కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆయా రంగాల్లో సామాజిక అవసరాలకు పరిష్కారాలు చూపించే నైపుణ్యాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పరిధి విస్తరిస్తోంది. నిర్మాణ రంగంలో కీలకంగా మారుతోంది. ప్రభుత్వ విధానాల ద్వారా అమలవుతున్న పలు గృహ నిర్మాణ పథకాల కార్యాచరణలోనూ సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు తోడ్పడుతున్నారు.

విస్తృత ఆలోచనలతో
సివిల్ ఇంజనీరింగ్‌లోని కొన్ని స్పెషలైజేషన్లు నేరుగా సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతాయి. ఇందుకు ప్రధాన ఉదాహరణగా వాటర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ వంటి వాటిని చెప్పొచ్చు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటి సదుపాయం, వనరుల సుస్థిరత.. వాటర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ద్వారా లభిస్తుంది. ఇక ఫ్లడ్ మేనేజ్‌మెంట్/ఇంజనీరింగ్ ద్వారా వరదల నివారణ, ఉపశమనం దిశగా తీసుకునే చర్యల విషయంలో నైపుణ్యం లభిస్తుంది.

అవకాశాలు అనేకం
ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలు పొందాలంటే వారి వ్యక్తిగత దృక్పథమే ప్రధాన గీటురాయి. అకడమిక్ నైపుణ్యాలు పొందే క్రమంలో అందుబాటులో ఎన్నో అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకునే తీరుపైనే విద్యార్థులు తాము సొంతం చేసుకునే నైపుణ్యాల స్థాయి ఆధారపడి ఉంటుంది. ఎన్‌పీటీఈఎల్, ఐఐటీలు, కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ పలు ఆన్‌లైన్ కోర్సులను అందిస్తూ, వర్చువల్ లేబొరేటరీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వాటిని అభ్యసిస్తే కళాశాల స్థాయిలో పొందలేని నైపుణ్యాలతో పాటు ప్రస్తుత పరిస్థితులకు సరితూగే నాలెడ్జ్ కూడా సొంతమవుతుంది.

పరిశోధనలు పెరగాలి
సివిల్ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు మరింత పెరగాలి. ముఖ్యంగా సహజ వనరులు తరిగిపోవటం, క్రమేణా పెరుగుతున్న ప్రకృతి విపత్తుల నేపథ్యంలో వాటి నివారణ, నిర్వహణపరమైన అంశాల్లో కొత్త పరిశోధనలు జరగాలి. వాటర్‌షెడ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి వాటికి అడ్వాన్స్‌డ్ విధానాల అన్వేషణ జరిగితే సహజ వనరుల సంరక్షణతోపాటు, వరదల నివారణ, నీటి సంరక్షణ వంటి ఏర్పాట్లు చేసే అవకాశం లభిస్తుంది.

ర్యాంకులను ఆపాదించలేం
మన దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే, ఇన్‌స్టిట్యూట్‌లకు అంతర్జాతీయంగా ఇచ్చే ర్యాంకులను ఆపాదించడం సరికాదు. ఇటీవల ఐఐఎస్‌సీ - బెంగళూరు టైమ్స్ ర్యాంకింగ్స్‌లో 99వ ర్యాంకు పొందడం హర్షణీయమే. అయితే అన్నిసార్లు ఇలా ర్యాంకులు వస్తాయని భావించలేం. ఆయా ర్యాంకుల రూపకల్పనలో తీసుకునే ప్రామాణికాలే ఇందుకు ప్రధాన కారణం. వీటి విషయంలో మనకు పరిమితులు అనేకం.

ర్యాంకులు ప్రామాణికం కాదు
చాలా మంది ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఆయా సంస్థలు ఇచ్చే ర్యాంకుల ఆధారంగా, ఇన్‌స్టిట్యూట్‌ల ప్రాధాన్యతలను ఎంపిక చేసుకుంటారు. అయితే విద్యార్థులు ర్యాంకులను ఒక అంశంగా పరిగణిస్తూ, తమ ఆసక్తికి అనుగుణంగా వ్యవహరించాలి. తమకు నచ్చిన బ్రాంచ్, అందుబాటులో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లను అన్వేషించాలి. ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న సదుపాయాలపై వ్యక్తిగత పరిశీలన చేయాలి. ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్ ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు గమనం సరైన మార్గంలో వెళుతుంది.
Published date : 18 Dec 2015 03:42PM

Photo Stories