Skip to main content

నాణ్యత పెంపునకు కార్యక్రమాలు

సాంకేతిక విద్య ముఖ్యంగా బీటెక్‌లో నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో క్రమేణా సీట్లు తగ్గించే యోచనలో ఉందనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఏఐసీటీఈ యోచిస్తున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో వీటి పర్యవసానాలపై ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధేతో ఇంటర్వ్యూ...
వాస్తవానికి దేశవ్యాప్తంగా పలు కళాశాలల యాజమాన్యాలే స్వయంగా సీట్లు, ప్రోగ్రామ్‌ల తగ్గింపునకు దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో దేశంలో 556 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేతకు అనుమతి పొందాయి. మరో 1422 ఇన్‌స్టిట్యూట్‌లు, డిపార్ట్‌మెంట్‌ల మూసివేత దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, నాణ్యత ప్రమాణాలు పాటించడంలో వాటికి ఎదురవుతున్న ఇబ్బందులు దీనికి కారణం అని చెప్పొచ్చు.

నాణ్యత పెరగటం ఖాయం
కళాశాలలు లేదా ప్రోగ్రామ్‌ల తగ్గింపు ద్వారా విద్యార్థుల సంఖ్య తక్కువవడంతో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరుగుతుంది. అందుబాటులో ఉన్న ఫ్యాకల్టీ, వనరులు ఆ మేరకు అవసరాలకు సరితూగేలా ఉంటాయి. అయితే సీట్లు, కళాశాలల తగ్గింపు వల్ల కొంత ప్రతికూల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా మూసివేసిన కళాశాలల్లోని విద్యార్థులను, ఫ్యాకల్టీని ఇతర కళాశాలల్లో ఏకీకృతం చేయడం వల్ల అప్పటికే మంచి పనితీరు ప్రదర్శిస్తున్న కళాశాలల పనితీరు కొంత ప్రభావానికి లోనవుతుంది.

పథకాలు సిద్ధం
సాంకేతిక విద్యలో ముఖ్యంగా బీటెక్ స్థాయిలో నాణ్యత, నైపుణ్యాల పెంపు విషయంలో ఏఐసీటీఈ పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎఐఊ (ఎౌఛ్చ ఐజ్టీజ్చ్టీజీఠ్ఛి జౌట అఛ్చిఛ్ఛీఝజీఛి ూ్ఛ్టఠీౌటజు) కార్యక్రమం ద్వారా స్వల్పకాలిక పద్ధతిలో విదేశీ ఫ్యాకల్టీ భారత్‌లో బోధించేందుకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేశాం. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించటంతోపాటు అంతర్జాతీయ పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. యూజీ స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబర్చి, ఎంటెక్‌లో చేరే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌తోపాటు బోధన రంగంలో కెరీర్ కోరుకునే వారికి అత్యంత ఆకర్షణీయమైన పథకాన్ని రూపొందించాం. ఉన్నత భారత్ అభియాన్.. విద్యార్థులు పొందిన సాంకేతిక నైపుణ్యాలను తమ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగించే విధంగా వారిని తీర్చిదిద్దుతుంది. ఫలితంగా విద్యార్థులకు నైపుణ్యాలతోపాటు సమాజ అభివృద్ధిలో పాల్పంచుకునే అవకాశం లభిస్తుంది.

మార్గదర్శన్ పథకం
నాణ్యత, నైపుణ్యాల పెంపు విషయంలో ఏఐసీటీఈ చేపడుతున్న మరో పథకం.. మార్గదర్శన్. ఒక ప్రాంతంలో అకడమిక్, మౌలిక సదుపాయాలు వంటి వాటిలో అత్యుత్తమంగా ఉన్న కళాశాలను ఎంపిక చేసి ఇతర కాలేజీలకు మెంటార్‌గా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటాం. ‘ఉత్తమ కళాశాల’గా ఎంపిక చేసిన కాలేజీకు ఏఐసీటీఈ నిధులు కూడా మంజూరు చేస్తుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చిన నేపథ్యంలో ఈ పథకం స్థానికంగానే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

ప్రమాణాలే కీలకం
దేశంలో ఇప్పుడు దాదాపు మూడున్నర వేల ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వాటికి తగిన విధంగా సదుపాయాలు లేని మాట వాస్తవం. దేశంలోని అన్ని వర్గాలకు సాంకేతిక విద్యను అందించాలని పలు కమిటీలు చేసిన సిఫార్సులే ఈ స్థాయిలో కళాశాలలు ఏర్పడటానికి కారణం. ప్రారంభంలో తనిఖీల సమయంలో ఏఐసీటీఈ నిబంధనలు, ప్రమాణాలకు సరితూగేలా వ్యవహరించినప్పటికీ.. క్రమంగా ఆయా కళాశాలలు ప్రమాణాలను కొనసాగించలేకపోతున్నాయి.

ఎన్‌బీఏ అనుమతి తప్పనిసరి
ఒకవైపు మెజారిటీ సంఖ్యలో సీట్లు, కోర్సులు తగ్గించాలని దరఖాస్తులు వస్తుంటే మరోవైపు సీట్లు పెంచాలని కూడా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్‌బీఏ) అనుమతి తప్పనిసరి. ఎన్‌బీఏ అమలు చేస్తున్న కఠిన నిబంధనల ఫలితంగా అత్యుత్తమ పనితీరు కనబర్చిన కళాశాలలకు మాత్రమే సీట్లు, ప్రోగ్రామ్‌ల పెంపునకు అనుమతి లభిస్తుంది.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా..
దేశ వ్యాప్తంగా, అదే విధంగా అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలున్న తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలను ఒకట్రెండేళ్లలో గాడిలో పెట్టేందుకు కృషి చేస్తాం. ఏఐసీటీఈ నిబంధనలను కచ్చితంగా పాటించే విధంగా నిరంతర పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టి వీలైనంత త్వరలో దేశంలో మళ్లీ ఇంజనీరింగ్ విద్యను పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా రూపొందిస్తాం.
Published date : 30 Oct 2015 12:40PM

Photo Stories