Skip to main content

ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌తో ఉపయోగం

‘అంతర్జాతీయ విద్యా సంస్థలతో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా భారతీయ ఇన్‌స్టిట్యూట్‌లకు అంతర్జాతీయ ర్యాంకుల పరంగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇన్‌స్టిట్యూట్‌ల ఎంపిక విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఐటీ - చెన్నైలోని ఇంటర్నేషనల్ అండ్ అలూమ్నీ రిలేషన్స్ ఆఫీస్ డీన్ ప్రొఫెసర్ ఆర్.నాగరాజన్ సూచిస్తున్నారు. ఆయన ఐఐటీ చెన్నైలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, యేల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తిచేశారు. ఐబీఎం వంటి ప్రముఖ సంస్థలో బోధన రంగంలో పని అనుభవం గడించిన ప్రొఫెసర్ ఆర్.నాగరాజన్‌తో గెస్ట్ కాలమ్...
అకడమిక్ రంగంలో ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తున్న మాట ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్. ఇవి కేవలం కోర్సులకే పరిమితం కాకూడదు. విద్యార్థులకే కాకుండా అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ స్థాయిలో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ విస్తరించాలి. ఫలితంగా ఇన్‌స్టిట్యూట్‌లకు అంతర్జాతీయ ఫ్యాకల్టీని రప్పించేందుకు అవకాశం ఉంటుంది. విదేశీ విద్యార్థులు సైతం మన దేశానికి వచ్చి విద్యను అభ్యసించేందుకు ఆస్కారం లభిస్తుంది. మన విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం చేజిక్కుతుంది.

అంతర్జాతీయ గుర్తింపు
ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌ను, కొలాబొరేటివ్ ప్రోగ్రామ్స్‌ను రూపొందిస్తే విదేశీ ఫ్యాకల్టీ, విద్యార్థులు వీటివైపు ఆకర్షితులవుతారు. తద్వారా మన ఇన్‌స్టిట్యూట్‌లకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. ఇన్‌స్టిట్యూట్‌లకు ర్యాంకులు ఇచ్చే సమయంలో విదేశీ ఫ్యాకల్టీ, విద్యార్థులను కూడా పారామీటర్స్‌గా తీసుకుంటారు. ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ ర్యాంకుల కోణంలో ఉపయుక్తంగా ఉంటుంది. మన ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రధాన సమస్యగా మారిన ఫ్యాకల్టీ కొరతకు పరిష్కారం లభిస్తుంది.

విద్యార్థులు అప్రమత్తంగా..
ప్రస్తుతం కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు.. అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు ఉన్నాయని, ఆ మేరకు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నామని ప్రకటిస్తున్నాయి. అయితే వీటిలో అడుగుపెట్టేముందు విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆయా ప్రోగ్రామ్స్‌కు సంబంధించి, ఒప్పందం చేసుకున్న యూనివర్సిటీకి సంబంధిత ప్రభుత్వ గుర్తింపుపై అవగాహన పెంపొందించుకోవాలి. అకడమిక్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌కు సంబంధిత ప్రభుత్వ నియంత్రణ సంస్థ గుర్తింపు అవసరం. విద్యార్థులు తాము చేరబోయే ప్రోగ్రామ్‌కు ఆ గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలి. దీంతోపాటు విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండేందుకు అనుమతి ఉన్న గరిష్ట వ్యవధి, అందుకు సంబంధించిన ఇమిగ్రేషన్ నిబంధనల గురించి ముందుగానే తెలుసుకోవాలి.

అవగాహన ముఖ్యం
విదేశీ యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం కోర్సులో, కొన్ని నెలలు చదివే అవకాశాన్ని అకడమిక్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ కల్పిస్తున్నాయి. అయితే అక్కడి ఇన్‌స్టిట్యూట్‌లు ఇచ్చే గ్రేడింగ్, కోర్సు స్వరూపాల గురించి తెలుసుకోవాలి. తమ కోర్ కోర్సుకు అనుగుణంగా ఆ కోర్సు ఉందో లేదో అవగాహన పెంపొందించుకోవాలి. విదేశీ విద్యార్థులకు వీసాలు, అనుమతుల విషయంలో యూఎస్‌లో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌ను ఒక మార్గంగా ఎంపిక చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా వీసా నిబంధనలు అమల్లో ఉన్నాయి. జే-1 వీసా షరతులకు అనుగుణంగా అర్హతలు ఉంటేనే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా అక్కడి ఇన్‌స్టిట్యూట్‌లలో అడుగు పెట్టే అవకాశం లభిస్తుందని గుర్తించాలి.

ఆందోళన అనవసరం
ఐఐటీల సంఖ్యను పెంచడంపై ఆందోళన అనవసరం. ముఖ్యంగా ఫ్యాకల్టీ సమస్య, మౌలిక సదుపాయాల వంటి అంశాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు సరికాదు. ప్రతి కొత్త ఐఐటీకి మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా పూర్వపు ఐఐటీలను నియమిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ఫ్యాకల్టీ, బోధన అనే సమస్య ఏ మాత్రం ఎదురుకాదు.

కోర్‌కు క్రేజ్..
చాలా మంది విద్యార్థులు కోర్ బ్రాంచ్‌లకు క్రేజ్ తగ్గిందని భావిస్తున్నారు. అయితే వాణిజ్య అభివృద్ధి పరంగా ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు పెరుగుతున్నాయి. దీంతో ఇతర బ్రాంచ్‌ల కంటే ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగాల గణాంకాలను పరిశీలిస్తే కోర్ బ్రాంచ్‌లకు క్రేజ్ తగ్గలేదనే విషయం స్పష్టమవుతుంది. ఆసక్తి ఉన్న ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫలితంగా భవిష్యత్తులో అకడమిక్‌గా ప్రతిభ చూపడానికి, తద్వారా చక్కని కెరీర్ సొంతం చేసుకోవడానికి ఆస్కారం లభిస్తుంది.
Published date : 22 Jan 2016 12:30PM

Photo Stories