Skip to main content

డిజిటల్ యుగంలో యువత కూడా డిజిటల్‌గా మారాలి

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. సంక్షిప్తంగా ఐటీ. యువతలో అత్యంత క్రేజీ. ఇంజనీరింగ్ విద్యార్థులైతే కోర్సులో చేరినప్పుటి నుంచే ఐటీ రంగం కొలువులపై గురిపెడతారు. నాలుగో సంవత్సరంలో అడుగుపెడుతూనే ఐటీ రంగంలో నియామక సరళి, పొందాల్సిన నైపుణ్యాలు, అవకాశాలపై ఆరా తీస్తుంటారు. మరికొద్ది రోజుల్లో క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐటీలో నియామకాలు ఎలా ఉండనున్నాయి.. ఎలాంటి స్కిల్స్‌ను కంపెనీలు కోరుకుంటున్నాయి.. వంటి అంశాలపై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ వి.రాజన్నతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
సెప్టెంబర్ నుంచి క్యాంపస్ హైరింగ్స్
విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. కంపెనీలు కొన్ని కళాశాలలకే వెళతాయని లేదా టైర్-1 సిటీస్‌లోని కళాశాలలకే ప్రాధాన్యమిస్తాయనే భావనను విద్యార్థులు వీడాలి. కంపెనీలు ఎప్పుడూ బెస్ట్ టాలెంట్ కోసం అన్వేషిస్తాయి. కాబట్టి సంస్థలు నియామకాల కోసం ఏవో కొన్ని ఇన్‌స్టిట్యూట్స్, లేదా కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయనుకోవడం సరికాదు. కాబట్టి అలాంటి ఆందోళనలు వీడి క్యాంపస్ రిక్రూట్ మెంట్స్‌లో విజయం దిశగా కృషి చేయాలి.

ఐటీ రంగం అద్భుత పురోగతి
మన దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల విలువ 108 బిలియన్ డాలర్లు. భారత ఐటీ చరిత్రలోనే ఇంత మొత్తం ఐటీ ఎగుమతులు నమోదుకావడం తొలిసారి. ఇది ఐటీ రంగంలో అత్యంత శుభ పరిణామం. ఈ ఆర్థిక సంవత్సరంలో పది నుంచి 13 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా. ఐటీ రంగం పురోగతిలో మానవ వనరుల (ఉద్యోగుల) పాత్ర అత్యంత కీలకం. దేశ ఐటీ రంగంలో మొత్తం 37 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త నియామకాల్లోనూ ఆరు శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు రెండు లక్షల మంది గత ఆర్థిక సంవత్సరంలో నియమితులైనవారే! ఈ సంవత్సరం కూడా నియామక సరళి గతేడాది మాదిరిగా ఉండనుంది. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ పరంగా 60:40 లేదా 55:45 నిష్పత్తిలో నియామకాలు జరిగే అవకాశముంది.

ప్రధాన సెగ్మెంట్లు ఇవే
ఐటీ రంగంలో ఉపాధి కల్పన అంటే.. కేవలం ఐటీ కంపెనీలనే కాదు. ఐటీ ద్వారా కస్టమర్లకు సేవలందించే సంస్థల్లోనూ ఐటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. ఆ క్రమంలో ఫైనాన్షియల్ సెక్టార్(బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్) ముందంజలో నిలుస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో రిటైల్, టెలికం, మ్యాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్లు ఉన్నాయి.

ఇది డిజిటల్ యుగం
ఏ రంగంలోనైనా డిజిటైజేషన్‌దే పెద్దపీట. గత ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ రంగం మార్కెట్ విలువ 146 బిలియన్ డాలర్లకు చేరింది. 2020 నాటికి 225 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. నెట్‌వర్క్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే అంతకుముందు హార్డ్‌వేర్ ఆధారితంగా పనిచేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు నెట్‌వర్క్స్‌ను సైతం సాఫ్ట్‌వేర్ ఆధారంగా మానిటరింగ్ చేసే సాంకేతికత వచ్చేసింది. విద్యార్థులు కూడా కొత్త నైపుణ్యాలపై శిక్షణ పొందాలి. ఎస్‌డీఎన్/ఎన్‌ఎఫ్‌ఈ, టెల్కోక్లౌడ్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.

నెక్స్ట్ జనరేషన్
యువత ఎప్పుడూ ఒకడుగు ముందుండేలా, భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేలా వ్యవహరించాలి. లెర్నింగ్‌లో సైతం డిజిటల్ విప్లవం కనిపిస్తోంది. ఆన్‌లైన్ కోర్సెస్, మూక్స్, వీడియో లెక్చర్స్ ద్వారా లెర్నింగ్ ఎంతో సులువుగా మారింది. వీటిద్వారా నిరంతరం కొత్త నైపుణ్యాలపై శిక్షణ పొందాలి. అప్పుడే ఏ రంగమైనా నిలదొక్కుకోగలరు.

కరిక్యులం.. కొత్త టూల్స్
కరిక్యులంపై ఫోకస్ పెడుతూనే కొత్త టూల్స్ అధ్యయనం చేయాలి. కరిక్యులంలో మూడు కోర్ సబ్జెక్ట్స్‌పై పట్టు సాధించాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. నాన్- ఐటీ విద్యార్థులు రెండు లేదా మూడు కోర్ సబ్జెక్ట్‌లపై పరిపూర్ణత సాధించడంతోపాటు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఐపీ నెట్‌వర్క్స్, కంప్యూటర్ నెట్‌వర్క్స్‌ను నేర్చుకోవాలి.

భవిష్యత్తు ఉజ్వలం
జాబ్ మార్కెట్ పరంగా ఎంప్లాయబిలిటీలో భారత్ ఎంతో ముందంజలో ఉంది. ఐటీ రంగం భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదు. విద్యార్థులు పొందాల్సిన నైపుణ్యాల పరంగా వినూత్నంగా వ్యవహరించాలి. బీటెక్‌లో చేరుతున్నవారు నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తు గురించి, ఉద్యోగ మార్కెట్ గురించి ఆలోచించకుండా అకడమిక్స్‌పై, కరిక్యులంపై దృష్టి పెట్టి చదవడం అలవర్చుకోవాలి. నిరంరతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీలపై శిక్షణ పొందాలి.

స్టార్టప్స్‌కు సరైన సమయం
స్టార్టప్ ఔత్సాహికులకు సైతం ఇప్పుడు అనుకూల పరిస్థితి ఉంది. ప్రపంచంలోనే భారత్ మూడో స్టార్టప్ క్యాపిటల్‌గా మారింది. దీనికితోడు మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ప్రోగ్రామ్‌లతో మరింత ప్రోత్సాహకర వాతావరణం నెలకొంది. ఉత్పత్తి రంగంలోనూ ఔత్సాహిక యువ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు అవకాశాలు తలుపు తట్టడం ఖాయం.

మొబిలిటీ దృక్పథం కావాలి
యువత మొబిలిటీ దృక్పథం అలవర్చుకోవాలి. అవకాశం ఎక్కడ లభించినా పని చేసేందుకు సిద్ధం కావాలి. ఇప్పుడు ఏ రంగమైనా అవకాశాలు విస్తృతం. అయితే ఆయా రంగాల్లోని సంస్థలు కొన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచాయి. ఉదాహరణకు మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను తీసుకుంటే.. తమిళనాడు, పుణెల్లో అధిక శాతం ఉత్పత్తి సంస్థలు నెలకొన్నాయి. అక్కడ ఉద్యోగం లభించినా చేరేందుకు సిద్ధంగా ఉండాలి.

మూడు లక్షణాలతో మెరిసే భవిష్యత్తు
యువత మూడు లక్షణాలు సొంతం చేసుకోవాలి. అవి: సబ్జెక్ట్ నాలెడ్‌‌జ, పాజిటివ్ అటిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్. వీటిలో మొదటిది అకడమిక్ కరిక్యులం, శిక్షణ ద్వారా సొంతం చేసుకోవచ్చు. మిగతా రెండు తమ చేతులు/ చేతల్లో ఉండేవే. ఈ రెండిటి విషయంలోనే జాగ్రత్తగా వ్యవహరించాలి. అకడమిక్‌గా ఎన్ని నైపుణ్యాలు ఉన్నా.. పాజిటివ్ అటిట్యూడ్, కమ్యూనికేషన్‌లు ఉంటేనే మంచి అవకాశం లభిస్తుంది.
Published date : 30 Jun 2016 06:00PM

Photo Stories