Skip to main content

ఐఐటీ మద్రాస్...ఎన్నో ప్రత్యేకతలు

ఐఐటీ మద్రాస్.. క్రిష్ గోపాల క్రిష్ణన్, రోహిణి చక్రవర్తి, జీకే అనంత సురేశ్, ఆనంద్ రాజారామన్, అనంత్ అగర్వాల్ వంటి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన అత్యున్నత విద్యా సంస్థ. అంతటి ఘన చరిత్ర కలిగిన విద్యాసంస్థలో చదువుకునే అవకాశం రావడం తనకు దక్కిన అరుదైన అవకాశం అంటున్నాడు అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోహిత్. అంతేకాదు చదువుతోపాటు సినిమాలు, షికార్లు, కబుర్లు, స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు వంటివాటికి కొదవలేదంటున్న రోహిత్ చెబుతున్న క్యాంపస్ కబుర్లు...
ఐఐటీలో సీటే లక్ష్యంగా..
మాది వైజాగ్. ఇంటర్ వరకు నా విద్యాభ్యాసం అక్కడే సాగింది. 96 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించాను. నాన్న బీకే నాయుడు.. ఏపీసీపీడీసీఎల్ ఉద్యోగి. అమ్మ కల్పన గృహిణి. అమ్మానాన్న చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా పెంచారు. నన్ను అత్యున్నత స్థాయిలో చూడాలని నిత్యం కలలు కనేవారు. నేను కూడా అందుకు తగ్గట్లుగానే చదివేవాడిని. ఇంటర్‌లో ఉండగానే ఐఐటీలో సీటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కష్టపడి చదివితే జేఈఈ అడ్వాన్‌‌సడ్‌లో మంచి ర్యాంకు వచ్చింది. నా కెరీర్‌కు అన్ని విధాలా సరైందని భావించి ఐఐటీ-మద్రాసులో చేరాను.

అందరిలానే నాక్కూడా...
ఇక్కడ చేరిన కొత్తలో నాకు అన్నీ కొత్తగా కనిపించేవి. కొత్త ప్రాంతం, కొత్త కల్చర్, రకరకాల వ్యక్తులు ఇలా అంతా గజిబిజిగా ఉండేది. ఈ పరిస్థితులకు అలవాటుపడేందుకు కొంత సమయం పట్టింది. జీవితంలో అత్యంత కీలకమైన దశను వృథా కానీయకుండా బంగారు భవితను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఐఐటీ కల్పించింది. అంతేకాకుండా భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న మనస్తత్వాలు కలిగిన వారిని ఒకచోటకు చేర్చి సువిశాల ప్రపంచాన్ని కళ్లముందుంచింది. కాలేజీలో చేరిన తొలి రోజు నుంచే దృఢమైన జీవిత లక్ష్యాన్ని ఏర్పరుచుకునే విధంగా ప్రోత్సహించింది. ఉన్నత ఆలోచనలు, అలవాట్లు, జీవన విధానాలను నేర్పించి ఒక మనిషి ఎదుగుదలకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించింది.

చదువుతోపాటు అన్నీ...
ఇక చదువు విషయానికొస్తే... ఇక్కడ క్లాసులు రెండు బ్యాచ్‌లుగా జరుగుతాయి. కొన్ని బ్రాంచ్‌లకు ఉదయం 8 నుంచి 12 వరకు..మరి కొన్ని బ్యాచ్‌లకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. క్లాసులు అయిపోగానే కొంత మంది స్పోర్ట్స్, కొంత మంది కల్చరల్ యాక్టివిటీస్, మరి కొంత మంది రీసెర్చ్ ఇలా ఎవరి వ్యాపకాల్లో వాళ్లు నిమగ్నమవుతారు. వాటితో పాటు కాలేజీలో అప్పుడప్పుడు ఇంటర్ కాలేజీ వ్యాసరచన పోటీలు, సెమినార్లు, గెస్ట్ లెక్చర్లు ఉంటాయి. వీటితో పాటు కల్చరల్ ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్ జరుగుతుంటాయి. సీఎఫ్‌ఐ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్) ద్వారా స్టార్టప్స్‌పై ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ ఇస్తారు. హాస్టల్ లైఫ్‌ని జీవితంలో మరిచిపోలేం. కామన్‌రూంలలో చెప్పుకున్న కబుర్లు, షేర్ చేసుకున్న నాలెడ్జ్, రూమ్స్‌లో ఆడిన ఇండోర్ గేమ్‌లు ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతులు.

ఎన్నో ప్రత్యేకతలు
ఐఐటీ-మద్రాస్ 620 ఎకరాల సువిశాల ప్రాంగణం. చెట్లుచేమలతో చూడ్డానికి అడవిని తలపిస్తుంది. అనేక అడవి జంతువులు, పక్షులు సైతం కళ్ల ముందే తిరుగుతుంటాయి. ఇవన్నీ చూస్తే కాలేజీలో ఉన్న ఫీలింగ్ పోయి విహారయాత్రకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. అంతేకాక ఏ ఐఐటీలో లేని అత్యాధునిక టెక్నాలజీ, ల్యాబ్‌లు, మన సంప్రదాయాలను గుర్తుకుతెచ్చే హెరిటేజ్ సెంటర్ ఇక్కడ ఉన్నాయి. ఏ పని చేసినా దాని నుంచి కొంత అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని గ్రహించాలన్నదే నా సిద్ధాంతం. అందుకు తగిన విధంగా ముందుకెళ్తున్నాను.
Published date : 10 Sep 2016 01:31PM

Photo Stories