వచ్చే ఏడాది తిరుపతి ఐఐటీలో అడ్మిషన్లు
Sakshi Education
తిరుపతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తిరుపతి ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో తరగతులు ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీటెక్, ఇంటిగ్రేటింగ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లో తరగతులను ప్రారంభించనున్నారు.
రెండు విభాగాల్లోనూ తొలి ఏడాది 240 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఐఐటీ క్యాంపస్ నిర్మాణ పనులకు ఈనెల 17న కేంద్ర మావన వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో 16 ప్రాంతాల్లో ఐఐటీ క్యాంపస్‌లను కేంద్రం ఏర్పాటు చేసింది. విభజన నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. దాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఆదిలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. తిరుపతికి సమీపంలో ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద 454 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఐఐటీ యాజమాన్య బృందం పరిశీలించి, ఏర్పాటుకు అనువైన ప్రాంతమని కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దాంతో మేర్లపాక వద్దే ఐఐటీ ఏర్పాటు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 2015-16 విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటుచేసి.. తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం సమీపంలో 21 సెంచురీ గురుకులం క్యాంపస్, రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలోని మరో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల భవనాలు ఖాళీగా ఉన్నాయని వీటిలో ఎక్కడో ఒకచోట తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుచేయవచ్చునని సూచించింది. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోన్న కేంద్రం.. వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published date : 10 Jan 2015 12:48PM