Skip to main content

తెలంగాణలో 500 ఇంజనీర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెలువరించే తొలి నోటిఫికేషన్‌లోనే నీటి పారుదల శాఖ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది.
తొలి విడతలో సుమారు 500 ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, రోస్టర్ తేల్చేందుకు సాంఘిక సంక్షేమ శాఖకు ఫైలును పంపింది. అక్కడ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఆర్థిక శాఖకు ఫైలు పంపి ఆమోదం పొందే కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పనులకు తోడు ప్రాజెక్టుల పనులను వేగిరం చేసే పనిలో పడింది. ఈ పనుల నిర్వహణకు క్షేత్రస్థాయిలో ఎంతో అవసరమైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజనీర్ల (ఏఈ) పోస్టులే అత్యధికంగా ఖాళీగా ఉండటంతో ఆ భారం ఇతర అధికారులపై పడుతోంది. దీన్ని చక్కదిద్దాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవలే ఖాళీల సంఖ్యపై కసరత్తు చేసి వాటిని ముఖ్యమంత్రి కార్యాలయా(సీఎంఓ)నికి పంపింది. మొత్తంగా ఏఈఈ, ఏఈ పోస్టులు 2,440 అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 1,805 పోస్టుల్లో అధికారులు ఉండగా, మరో 635 పోస్టులు ఖాళీలున్నట్లు గుర్తించారు. చెరువు పనుల గుర్తింపు, అంచనాల తయారీ, క్షేత్ర స్థాయి పరిశీలన, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు, పనుల విలువ మదింపు తదితరాల్లో ఏఈఈ, ఏఈ అధికారులదే కీలకపాత్ర అయినందున వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఇటీవల సమీక్ష సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా అందుకు ఆయన ఓకే చెప్పారు. దీంతో వెనువెంటనే 500 పోస్టుల భర్తీ కోరుతూ ఫైలును సీఎంఓకు పంపగా దాన్ని అక్కడి నుంచి రిజర్వేషన్లు తేల్చేందుకు సాంఘిక సంక్షేమ శాఖకు పంపారు. అక్కడ వీలైనంత త్వరగా ఆమోదం పొందే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

పోస్టుల వారీగా ఖాళీలు

పోస్టు

ఉండాల్సినవి

ఉన్నవి

ఖాళీలు

ఈఎన్‌సీ

3

2

1

సీఈ

15

7

8

ఎస్‌ఈ

39

34

5

డీఈఈ

626

571

55

ఏఈఈ/ఏఈ

2,440

1805

635

Published date : 12 May 2015 12:02PM

Photo Stories