Skip to main content

తెలంగాణలో 22 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌ను ఈనెల 22 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జూలై 30 నాటికల్లా చివరి దశ కౌన్సెలింగ్‌ను పూర్తి చేయనుంది. జూలై 31 ఆదివారం కావడం, ఆగస్టు 1న బోనాల పండుగ సెలవు దినం కావడంతో ఆగస్టు 2 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఆ లోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులకు వచ్చే మూడేళ్లలో వసూలు చేయాల్సిన ఫీజులను తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటికే ఖరారు చేసింది. అయితే ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభ తేదీ ఇదివరకు ఖరారు కానందున మరోసారి వాటి పరిశీలన జరుపుతోంది. ఈ మేరకు టీఏఎఫ్‌ఆర్‌సీ త్వరలోనే సమావేశమై కొత్త ఫీజులకు సంబంధించిన ఫైలును ఈ వారంలో ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. మరోవైపు మొదటి ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూలును ఎంసెట్ ప్రవేశాల కమిటీ రెండు మూడు రోజుల్లో సమావేశమై ఖరారు చేయనుంది.
Published date : 01 Jun 2016 02:49PM

Photo Stories