తెలంగాణలో 2 ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీం కోర్టు నోటీసులు
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వాసవీ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.
అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) సిఫారసు చేసిన ఫీజుల కంటే ఈ కాలేజీలు అధికంగా వసూలు చేస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. వాసవీ కాలేజీ అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ ఆ కాలేజీ పేరెంట్స్ అసోసియేషన్ ఇదివరకే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 4న విచారించింది. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారించింది. ఏఎఫ్‌ఆర్సీ నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ధర్మాసనం ఇదివరకే పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని, విచారణను జనవరి 29కి వాయిదావేసింది.
Published date : 05 Dec 2018 01:35PM