Skip to main content

తెలంగాణ ఇంజనీరింగ్ సీట్లలో భారీగా కోత

సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఈసారి భారీగా కోత పడింది. సీట్లే కాదు కాలేజీల సంఖ్య కూడా తగ్గిపోయింది.
గతేడాది మొత్తంగా 1.16 లక్షల సీట్లకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా ఈసారి 79,705 సీట్లకే గుర్తింపు ఇచ్చింది. గతేడాది 220 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా.. ఈసారి 158 కాలేజీలకే గుర్తింపు ఇస్తున్నట్టు ఆదివారం రాత్రి జేఎన్‌టీయూహెచ్ ప్రకటించింది. నిర్దిష్ట ప్రమాణాలు, ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్న మేరకే కాలేజీల్లో పలు కోర్సులు, బ్రాంచీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. దీంతో చాలా కాలేజీలు ఒకట్రెండు కోర్సులకే పరిమితమయ్యాయి. 40 కాలేజీలు ఈసారి అనుబంధ గుర్తింపు కోసమే దరఖాస్తు చేసుకోకపోగా, మరో 43 కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించింది. వాటిలో 36 వేలకు పైగా సీట్లకు కోత పెట్టింది. ఇక అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని కాలేజీల్లో 1.24 లక్షల సీట్లకు అనుమతి ఇవ్వగా జేఎన్‌టీయూహెచ్ 158 కాలేజీల్లోని 671 కోర్సుల్లో 79,705 సీట్లకే అనుబంధ గుర్తింపునిచ్చింది. అంటే దాదాపు 46 వేల సీట్లకు కోత పడింది. ఇక ఎంసెట్‌లో 1.04 లక్షల మంది అర్హత సాధించి ర్యాంకులు పొందగా.. 63,777 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం వారంతా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రకటన సోమవారం రానుంది. వాటిల్లో 14 వేల వరకు సీట్లు ఉండగా.. 10 వేల సీట్ల వరకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. దీంతో ఈసారి మొత్తంగా 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

241 కాలేజీల్లో అనుబంధ గుర్తింపు 158 కాలేజీలకే :
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అనుబంధ గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 241 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటి దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో జేఎన్‌టీయూహెచ్ తనిఖీలను నిర్వహించింది. అలాగే మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించింది. రెండు విభాగాల తనిఖీ నివేదికలను పోల్చి చూసి 158 కాలేజీల్లో 79,705 సీట్లలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది.

సగం ఫార్మసీ కాలేజీలకు నో :
జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 89 ఫార్మసీ, 30 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. ఈసారి 46 ఫార్మసీ కాలేజీల్లోని 4 వేల సీట్లలో ప్రవేశాలకే అనుబంధ గుర్తింపు లభించింది. అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల్లో కోర్సులు, సీట్ల వివరాలను ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్‌కు పంపించింది.

బీటెక్‌లో కోర్సుల వారీగా అనుమతి ఇచ్చిన సీట్లు ఇవీ..

కోర్సు

సీట్లు

ఏరో నాటికల్

240

ఆటోమొబైల్

60

బయో మెడికల్

30

బయో టెక్నాలజీ

60

కెమికల్

120

సివిల్ ఇంజనీరింగ్

9,999

సీఎస్‌ఈ

21,930

ఈసీఈ

21,798

ఈఈఈ

10,363

ఈఐఈ

240

ఐటీ

2340

మెకానికల్

12,345

మెకానికల్ (మెకట్రానిక్స్)

60

మెటలర్జికల్
అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్

60

ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్

60

మొత్తం

79,705

Published date : 04 Jul 2016 04:06PM

Photo Stories