సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకాబోతోంది.
మాజీమంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ప్రత్యేక చొరవతో ఈ కాలేజీ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇందుకోసం ఉన్నత విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలోని ఆ కమిటీ ప్రతినిధులు సెప్టెంబర్ 4నసిరిసిల్లలో స్థల పరిశీలన జరిపారు. సిరిసిల్లలోని టెక్స్‌టైల్ పార్కు సమీపంలో 80 ఎకరాల ప్రభుత్వభూమి అందుబాటులో ఉందని కమిటీ గుర్తించింది. అక్కడ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చింది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందజేయనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆమోదం లభించిన తరువాత కాలేజీ నిర్మాణ పనులను ప్రారం భించవచ్చని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిటీ ముందుకుసాగుతోంది. అప్పడు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొని వచ్చే విద్యాసంవత్సరంలో తరగతులను ప్రారంభించే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. వాటిల్లో 3,071 సీట్లు మాత్రమే అందు బాటులో ఉన్నాయి. ఆ సీట్లను పెంచాలని, కొత్త యూనివర్సిటీ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ కాలేజీ ఏర్పాటైతే యూనివర్సిటీ కాలేజీల్లో సీట్ల సంఖ్య పెరుగనుంది. జేఎన్‌టీయూ పరిధిలో నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అందులో ఒకటి కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్ కాలేజీ కాగా, మరొ కటి సుల్తాన్‌పూర్‌లో, ఇంకొకటి మంథనిలో, మరో కాలేజీ జగిత్యాలలో ఉన్నాయి.
Published date : 06 Sep 2019 03:40PM