Skip to main content

ప్రమాణాలు పాటించని కాలేజీలకు అనుమతి నిరాకరణ

సాక్షి, అమరావతి: ఆ కాలేజీలో 240 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులున్నారు.. కానీ కంప్యూటర్లు మాత్రం 50 లోపే! ఇదేకాదు.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో కొన్ని కాలేజీలు విద్యార్థులు ఎక్కువగా చేరే కోర్సులకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే.. విద్యార్థుల చేరికలకు, సెక్షన్ల పెంపునకు అనుగుణంగా ల్యాబ్‌లు, కంప్యూటర్లు ఉండటం లేదు. 10 నుంచి 20 మంది విద్యార్థులకు ఓ కంప్యూటర్‌ను అమర్చి మమ అనిపిస్తున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్న కాలేజీలు ఆమేరకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. అవన్నీ అంతో ఇంతో పేరున్న కాలేజీలు కావడంతో విద్యార్థులు వాటివైపు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. మరోపక్క కన్వీనర్ కోటా కింద కూడా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ భారీగా పొందుతున్నాయి. చివరకు అక్కడ చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ప్రమాణాలూ పతనమవుతున్నాయి.

డిమాండ్‌ను బట్టి అమ్మకానికి సీట్లు
ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ ఇటీవల పలు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఇలాంటి పలు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐసీటీఈ, వర్సిటీల్లో పైరవీలు జరిపి కొన్ని యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. మరోవైపు ఇతర కాలేజీల్లో ఆయా కోర్సుల సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 32 విభాగాలకు సంబంధించిన కోర్సులున్నాయి. వీటిలో 70 శాతం కన్వీనర్ కోటా కింద 1,06,203 సీట్లు ఉండగా 60,315 సీట్లు భర్తీ అయ్యాయి. 45,888 సీట్లు మిగిలాయి. భర్తీ అయిన సీట్లన్నీ సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ సివిల్ వంటి ముఖ్యమైన విభాగాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ సీట్లను కూడా కొన్ని కాలేజీల్లోనే అదనపు సెక్షన్ల పేరిట భర్తీ చేస్తున్నారు. ఇక మేనేజ్‌మెంట్ కోటాలోని 30 శాతం సీట్లను కూడా డిమాండ్‌ను బట్టి అమ్మకానికి పెడుతున్నారు.

దెబ్బతింటున్న ప్రమాణాలు..
సరైన ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సెక్షన్లకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు మాత్రమే అదనపు సెక్షన్లకు అనుమతించాలని, పరిమితికి మించి మంజూరు చేయవద్దని ఏఐసీటీఈని కోరాలని కమిషన్ భావిస్తోంది.

ఈ విద్యాసంవత్సరంలో సీట్ల భర్తీ, ఖాళీల వివరాలు

కోర్సు

సీట్లు

భర్తీ

మిగులు

ఈసీఈ

25,960

17,887

8,073

సీఎస్‌ఇ

23,241

19,319

3,922

ఎంఇసీ

18,291

6,648

11,643

ఈఈఈ

14,134

6,062

8,072

సివిల్

13,647

5,029

8,618

ఐటీ

3,262

3,081

181

అగ్రి

627

328

299

కెమికల్

449

406

43

ఈఐఈ

299

142

157

పీఇటీ

250

97

153

సీఎస్‌టీ

185

185

0

మైనింగ్

184

27

157

ఆటోమొబైల్

138

28

110

సీఐటీ

138

138

0

సీఎస్‌ఎస్

138

138

0

ఎఫ్‌డీటీ

102

60

42

Published date : 06 Jan 2020 04:19PM

Photo Stories