పెరిగిన ఫీజులను చెల్లించేదెవరు?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఆ నాలుగు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరాలని అనుకుంటున్నారా? అయితే వాటిల్లో ఫీజులు పెరిగాయి.
కన్వీనర్ కోటాలో ఆ కాలేజీల్లో సీటు కోసం ప్రయత్నించే వారు వెబ్‌సైట్లో పేర్నొన్న ఫీజులను చూశాకే ఆప్షన్లను ఇచ్చుకోండి. ప్రవేశాల క్యాంపు కార్యాలయం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఫీజులపై సీబీఐటీ, వాసవి, శ్రీనిధి, ఎంజీఐటీ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు వాటి ఫీజులను పెంచుతూ గతేడాది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసిందని, కోర్టు తుది తీర్పునకు లోబడి వాటిల్లో ఫీజులు ఉంటాయని ప్రవేశాల కమిటీ పేర్కొంది. అయితే కాలేజీ వారీగా వెబ్‌సైట్‌లో పాత ఫీజులను పేర్కొన్నప్పటికీ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. మరోవైపు యాజమాన్యాలు మాత్రం పెరిగిన ఫీజును చెల్లించాలని ఇప్పటికే చేరిన విద్యార్థులను అడుగుతున్నాయి. ఆయా కాలేజీల్లో చేరిన వారంతా ఎంసెట్‌లో టాప్ 10 వేల ర్యాంకులోపు సాధించినవారే. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం వారికి పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంది. కోర్టు తుది తీర్పు వెలువడనందున అదనంగా పెంచిన ఫీజులపై ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదు. ఇప్పుడు ఆ ఫీజును ఎవరు చెల్లించాలన్న విషయంలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది.
ఇవీ ఆ కాలేజీల వారీగా ఫీజుల వివరాలు (రూపాయల్లో)..
ఇవీ ఆ కాలేజీల వారీగా ఫీజుల వివరాలు (రూపాయల్లో)..
కాలేజీ | పాత ఫీజు | హైకోర్టు పేర్కొన్న ఫీజు |
శ్రీనిధి | 97,000 | 1.37 లక్షలు |
వాసవి | 97,000 | 1.60 లక్షలు |
సీబీఐటీ | 1,13,500 | 2 లక్షలు |
ఎంజీఐటీ | 1 లక్ష | 1.60 లక్షలు |
Published date : 30 May 2018 04:18PM