కాన్పూర్ ఐఐటీ విద్యార్థుల జాక్‌పాట్..12 మందికి రూ. కోటికి పైగా జీతం
Sakshi Education
కాన్పూర్: ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీకి చెందిన 12 మంది విద్యార్థులు జాక్‌పాట్ కొట్టారు. క్యాంపస్ ప్లేస్ మెంట్ డ్రైవ్‌లో ఎంపికైన వీరు ఏడాదికి కోటి రూపాలయలకు పైగా జీతం అందుకోనున్నారు. ఐటీ జెయింట్లు ఒరాకిల్ రూ. 1.3 కోట్లతో ముగ్గురిని, గూగుల్ రూ. 1 కోటితో ఆరుగురిని ఎంపిక చేసుకున్నాయి. రూ. కోటి జీతంలో లింక్డిన్ ఇద్దర్ని, టవర్ రీసెర్చ్ సంస్థ ఒకర్ని ఎంపిక చేశాయని ఐఐటీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 250 కంపెనీలు ఈ డ్రైవ్‌లో పాల్గొనాల్సి ఉండగా.. ప్రస్తుతం 90 కంపెనీలే వచ్చాయని, అన్ని పూర్తయిన తర్వాత రూ. కోటి జీతం దక్కించుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, రూ. 50 లక్షల నుంచి రూ. 75 లక్షల మధ్య జీతం దక్కించుకున్న వారి సంఖ్య డజన్లలో ఉందని ఆయన వెల్లడించారు. డ్రైవ్‌లో పాల్గొన్న కంపెనీల్లో 50 అంతర్జాతీయ, 40 దేశీయ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. వీటిలో మైక్రోసాఫ్ట్, సోనీ, సాంసంగ్, హెచ్‌ఎస్‌బీసీ, టాటా, ఐటీసీ, హీరో మోటార్స్ తదితర ప్రఖ్యాతి పొందిన సంస్థలున్నాయన్నారు. ఆదివారం ప్రారంభమైన ఈ డ్రైవ్.. ఈ నెల 22 వరకూ కొనసాగుతుందని వెల్లడించారు.
Published date : 07 Dec 2013 11:19AM