జూన్ 29 నుంచి ఇంజనీరింగ్, జులై 15 నుంచి మెడిసిన్ కౌన్సెలింగ్ - ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అస్పష్టత.. - తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి
Sakshi Education
ఎంసెట్-2014 ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. పారదర్శకంగా నిర్వహించిన యంత్రాంగాన్ని అభినందించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రిగా సోమవారం మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించిన ఆయన నేరుగా మాసబ్‌ట్యాంక్ లోని జేఎన్‌టీయూ ఫైన్‌ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియానికి చేరుకున్నారు. మంత్రిగా తొలి కార్యక్రమంగా ఎంసెట్-2014 ఫలితాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై పూర్తిస్థాయి సమీక్ష జరిగిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. జూన్ 29 నుంచి ఇంజనీరింగ్,జులై 15 నుంచి మెడిసిన్కౌన్సెలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతికపరమైన అనుమతుల విషయంలో జాప్యం జరిగితే మరో రెండు మూడురోజుల ఆలస్యంగా కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. గతేడాది ఉమ్మడిగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం ఫీజు రీయింర్స్‌మెంట్, నిర్వహణ వంటి అంశాలపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌తో చర్చించిన అనంతరం తమ నిర్ణయాలను వెల్లడిస్తామన్నారు. ఫీజు రీయింర్స్‌మెంట్ ఫీజు ఉంటుందా! రద్దు చేస్తారా! అనే విలేకర్ల ప్రశ్నకు అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం ఉంటుందని మంత్రి చెప్పారు. అన్ని విభాగాలు విడిపోయాక సాంకేతిక విద్యా ఒక్కటే ఉమ్మడిగా కలిసి ఉండటం సాధ్యపడదని స్పష్టంచేశారు. ప్రతిదీ కొత్తగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యావసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. లోకల్, నాన్‌లోకల్ అంశంపై ఇరు రాష్ట్రాలు చర్చించాకే నిర్ణయం ఉంటుందన్నారు. ఈ ఏడాది కొత్తగా ఓఎంఆర్ షీట్లను ఈ ఏడాది తొలిసారి వెబ్‌సైట్ ఉంచనున్నట్లు చెప్పారు. ఈ నెల 10 వ తేదీ సాయంత్రం 5 నుంచి 13వ తేదీ సాయంత్రం వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ర్యాంకు కార్డులు కూడా 14 వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
మే 22 న నిర్వహించిన ఎంసెట్-2014 పరీక్షకు 3,95,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ 2,82,815, అగ్రికల్చరల్, మెడిసిన్ కోర్సులకు 1,12,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌లో 70.77 శాతం, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగంలో 83.16 శాతం మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ పరీక్షకు 2,66,820 మంది హాజరవగా వారిలో 1,88,831 మంది అర్హత సాధించారు. మెడిసిన్, అగ్రిక ల్చర్ కోర్సులకు 1,06,396 మంది పరీక్షరాయగా 88,487 మంది ఉత్తీర్ణులయ్యారు.
Published date : 10 Jun 2014 01:05PM