Skip to main content

జెఎన్‌టీయూహెచ్‌కు సీట్ల సంఖ్యను తగ్గించే అధికారం లేదు

  • ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్: పలు ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల సంఖ్యను తగ్గిస్తూ జేఎన్‌టీయూహెచ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ రెండు రోజుల క్రితం సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఆయా కాలేజీలకు ఏఐసీటీఈ నిర్దేశించిన పూర్తిస్థాయి సీట్ల సంఖ్యనే కౌన్సెలింగ్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులనే కోర్టు ఖరారు చేసింది. ఇదే సమయంలో జేఎన్‌టీయూ చూపిన లోపాలను నిర్దిష్ట సమయంలోగా సవరించుకోవాలని, లేకుంటే వాటి అఫిలియేషన్ల రద్దుకు వర్సిటీ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సీట్ల సంఖ్య తగ్గింపును తప్పుబడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను జేఎన్‌టీయూ సవాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. జేఎన్‌టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఉపాధ్యా య, విద్యార్థి నిష్పత్తిని పాటించని కాలేజీల్లోనే సీట్ల సంఖ్యను కుదించినట్లు ఆయన వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏఐసీటీఈ నిర్దేశించిన సీట్ల సంఖ్యను తగ్గించడానికి వర్సిటీకి అధికారం ఎక్కడుందని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏఐసీటీఈ, జేఎన్‌టీయూహెచ్‌కు మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సీట్ల సంఖ్యను తగ్గించే ముందు ఆయా కాలేజీలకు నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఆ పని వర్సిటీ చేసినట్లు లేదని అభిప్రాయపడింది. ఇది సరికాదంది. జేఎన్‌టీయూ లేవనెత్తిన లోపాలను కాలేజీలు సరిదిద్దుకోవాలని, అందుకు విధించే గడువుపై ఇరు పక్షాలూ మాట్లాడుకోవాలని సూచించింది. ఆ గడువులోపు లోపాలను సరిదిద్దుకోకుంటే, అఫిలియేషన్ల రద్దుపై వర్సిటీ నిర్ణయం తీసుకోవచ్చంది.
Published date : 30 Aug 2014 11:54AM

Photo Stories