జేఈఈ మార్కుల నిర్ధారణపై వివరణ ఇవ్వండి.. కేంద్రానికి హైకోర్టు ఆదేశం
Sakshi Education
హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2014లో ర్యాంకు నిర్ధారణ కోసం కేవలం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం మార్కులనే క్వాలిఫయింగ్ మార్కులుగా పరిగణిస్తుండటంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు గురువారం కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి, జేఈఈ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ తదితరులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ ఆదేశించిన విధంగా వివరణ ఇవ్వని పక్షంలో దేశవ్యాప్తంగా జరిగే జేఈఈ పరీక్షపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జేఈఈ మెయిన్ క్వాలిఫయింగ్ మార్కుల నిర్ధారణ కోసం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం మార్కులను కలిపి పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎ.వి.గౌతమ్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రామ్మోహనరావు గురువారం విచారించారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
Published date : 27 Jun 2014 12:17PM