జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్ విద్యార్థులతో క్లాసులు!
Sakshi Education
హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్‌లో కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు విద్యాప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు ఎంటెక్ విద్యార్థులతో తరగతులు బోధించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై గురువారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేయడంతో పాటు తరగతుల నిర్వహణలో అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలను ఎత్తిచూపారు. ప్రొఫెసర్లతో తరగతులు నిర్వహించాల్సి ఉండగా కేవలం తాత్కాలిక పద్ధతిన అధ్యాపకులను నియమించి తరగతులను నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తాత్కాలిక పద్ధతిన నియమించిన అధ్యాపకులను సైతం తొలగించి బీటెక్ విద్యార్థులకు ఎంటెక్ విద్యార్థులతో క్లాస్‌లు నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్ పతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిష్టాత్మకమైన జేఎన్‌టీయూహెచ్‌లో ఎంవోయూ కోర్సులను ప్రవేశపెడుతూ కేవలం డబ్బు కోసం ఐడీడీఎంపీ, ఐఐడీడీఎంపీ విద్యార్థుల భ విష్యత్తును ఆగం చేస్తున్నారని, ప్రొఫెసర్లపై అధిక ఒత్తిడికి కారణం అవుతున్నారని విమర్శించారు. విద్యార్థుల ధర్నా విషయం తెలుసుకున్న ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు పరిపాలనా భవనం వద్దకు తరలివచ్చి ధర్నాలో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రెండు రోజుల్లో రెగ్యూలర్ అధ్యాపకులతో క్లాస్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జష్‌రాజ్, కార్యదర్శి చందు, విద్యార్దులు మనోజ్ రాథోడ్, ఉదయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 14 Aug 2015 02:07PM