Skip to main content

ఇంటర్ రెండేళ్ల మార్కులతోనే జేఈఈ ర్యాంకులు

హైదరాబాద్: ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మార్కులను పరిగణనలోకి తీసుకుని జేఈఈ మెయిన్ ర్యాంకులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు రెండేళ్ల మార్కులను పంపించాలంటూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి లేఖ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పలువురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించగా.. కేంద్రం తన వైఖరి చెప్పాలంటూ హైకోర్టు గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ ర్యాంకుల నిర్ధారణలో 12వ తరగతి/తత్సమాన కోర్సుల మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని గత డిసెంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెండూ బోర్డు పరీక్షలే అయినందున రెండేళ్ల మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఫస్టియర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సెకండియర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు అంగీకరించడంలేదు. పైగా ఇందులో రాష్ట్రం నుంచి పరీక్షకు హాజరైన వారి మధ్య పోటీ ఉండనుంది. రాష్ట్రం నుంచి పరీక్ష రాసిన వారి 12వ తరగతిలోని మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తూ నార్మలైజేషన్ చేసి తుది ర్యాంకులను సీబీఎస్‌ఈ ఖరారు చేస్తుంది. ఫలితంగా ఇంటర్ ఫస్టియర్‌లో ఎక్కువ మార్కులు పొంది, జేఈఈపైనే దృష్టిపెట్టి సెకండియర్‌లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు వెనకబడిపోయే పరిస్థితి ఉంది.
Published date : 28 Jun 2014 11:32AM

Photo Stories