Skip to main content

ఇంజనీరింగ్‌లో కొత్త సిలబస్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న కరిక్యులమ్‌లో మార్పులు చేసి కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) కరిక్యులమ్‌ను రూపొందించింది.
రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం సిలబస్‌ను రూపొందించే కార్యక్రమాన్ని ఉన్నత విద్యామండలి చేపట్టింది. తిరుపతి ఐఐటీ డీన్ ప్రొఫెసర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఇందులో వివిధ వర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలల సీనియర్ ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు, ఇతరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిలబస్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. కొత్త సిలబస్ వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

నైపుణ్యాలు, సామాజిక బాధ్యత :
విద్యార్థులు తరగతి గదుల్లో పాఠాలు వినడానికే పరిమితం కావడం వల్ల నైపుణ్యాలు పెరగడం లేదని ఏఐసీటీఈ భావిస్తోంది. అందుకే కొత్త కరిక్యులమ్‌లో ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేసింది. ప్రాక్టికల్స్‌ను పరిశ్రమలతో అనుసంధానించాలని ప్రతిపాదించింది. విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశ్రమలు లేదా సంబంధిత సంస్థల్లో దాదాపు 3 నెలలపాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సమాజ అధ్యయనం కూడా ఒక భాగంగా చేర్చారు.

క్రెడిట్లు 160కి కుదింపు :
పాఠ్యప్రణాళికలో మార్పుల్లో భాగంగా మరో కీలక నిర్ణయాన్ని ఏఐసీటీఈ తీసుకోవడంతో విద్యార్థులపై భారం చాలావరకు తగ్గనుంది. గతంలో డిగ్రీ అర్హత కోసం థియరీలో 220 క్రెడిట్లు సాధించాల్సి వచ్చేది. దీన్ని 160 క్రెడిట్లకు తగ్గించనున్నారు. 160 వరకు క్రెడిట్లు సాధించినవారిని డిగ్రీకి అర్హులుగా పరిగణిస్తారు. ఆపై అదనంగా మరో 20 క్రెడిట్లు సాధిస్తే హానర్స్‌తో కూడిన డిగ్రీకి అర్హులుగా పరిగణిస్తారు.

రాజ్యాంగం, పర్యావరణ పరిరక్షణ అధ్యయనం :
డ్యూయెల్ డిగ్రీ కోర్సుల్లో భాగంగా ఒకేసారి రెండు డిగ్రీలను అభ్యసించే విధానం ఇప్పటికే అమలవుతోంది. ఇంజనీరింగ్‌లో కూడా ఈ రెండో కోర్సు కోసం 60 సబ్జెక్టులను ఏఐసీటీఈ గతంలోనే నిర్ణయించింది. ఇప్పడు కొత్తగా ఇంజనీరింగ్ విద్యార్థులు వేదాలు, పురాణాలు వంటివి కూడా అధ్యయనం చేయొచ్చు. రాజ్యాంగం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను తప్పనిసరి చేస్తున్నారు. అయితే వీటికి క్రెడిట్లు ఇవ్వరు. ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీ సిలబస్‌ను రూపొందిస్తోందని ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పి.నరసింహారావు తెలిపారు.

యూజీలో క్రెడిట్ల విధానం :
అంశం క్రెడిట్లు
1 హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్(మేనేజ్‌మెంట్ కోర్సులతో సహ) 12
2 బేసిక్ సైన్‌‌స కోర్సులు 25
3 ఇంజనీరింగ్ సైన్‌‌స కోర్సుల్లో (వర్కుషాప్, డ్రాయింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ తదతర అంశాలకు) 24
4 ప్రొఫెషనల్ కోర్ కోర్సులు 48
5 ప్రొఫెషనల్ ఎలక్టివ్ కోర్సులు (స్పెషలైజేషన్ బ్రాంచ్‌లు) 18
6 ఓపెన్ సబ్జెక్టులు, ఎంపిక చేసుకున్న టెక్నికల్ అంశాలకు 18
7 ప్రాజెక్టు వర్కు, సెమినార్, ఇంటర్న్‌షిప్ 15
మొత్తం 160

క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్స్ :
ఇంజనీరింగ్ కొత్త సిలబస్‌పై కసరత్తు జరుగుతోంది. క్రెడిట్లను 160కి కుదించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. తరగతి గదుల్లో కాకుండా క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేసేలా ప్రాక్టికల్స్ ఉంటాయి. చదువు పూర్తికాగానే ఉద్యోగాలు వచ్చేలా సిలబస్‌లో మార్పులు
 చేయాల్సి ఉంది.    
- వీవీఎస్ కుమార్, ఉపకులపతి, జేఎన్‌టీయూ-కాకినాడ
 
 అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలి..

 ఆలోచనతో కూడిన ప్రాక్టికల్ విద్య అవసరం. థియరీ మాత్రమే కాకుండా టెక్నికల్ స్కిల్స్ అభివృద్ధి చెందాలి. కొత్త పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సిలబస్ రూపొందించాలి. 
 - భాస్కర్‌చౌదరి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి
 
 విద్యార్థులకు ఎంతో మేలు..
 ఉద్యోగాలకు అవసరమైన రీతిలో ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పు చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. కొత్త సిలబస్‌కు తగ్గట్టుగా కాలేజీల్లో ప్రొఫెసర్లు, అధ్యాపకులను నియమించాలి.
 - బి.లలితాశ్రీ,, బీటెక్ నాలుగో సంవత్సరం, గాయత్రీ విద్యా పరిషత్, విశాఖపట్నం
Published date : 31 Jan 2018 01:37PM

Photo Stories