Skip to main content

ఇంజనీరింగ్‌లో భారీ సంస్కరణలకు ఏఐసీటీఈ శ్రీకారం

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) శ్రీకారం చుట్టింది.
నాణ్యతా ప్రమాణాల పెంపు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులకు చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న నిబంధనలతోపాటు కొత్తగా 6 నిబంధనలను 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా యాజ మాన్యాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ నిబంధనలను అమలుపరిచే కాలేజీలకే వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టేందుకు గుర్తింపును (అప్రూవల్) ఇస్తామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా బీఈ/బీటెక్ కోర్సును నిర్వహించే 3,124 ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు పీజీ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ తదితర 10,400 కాలేజీలన్నీ ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయా ఇంజనీరింగ్ కాలేజీలన్నీ జనవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీలోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.

ఆరు ప్రధానాంశాలపై ప్రత్యేక దృష్టి...
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటివరకు తగిన ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏఐసీటీఈ ఇకపై వాటితోపాటు నాణ్యతా ప్రమాణాలు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టిసారించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి చేపట్టే ప్రవేశాల్లో ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. విద్యార్థుల ఇంటర్న్‌షిప్, ఫ్యాకల్టీ నిరంతరం అప్‌గ్రేడ్ అయ్యేలా శిక్షణ, ఒక్కో కాలేజీ కనీసంగా 5 కంపెనీలతో ఒప్పందాలు, ప్రతి కాలేజీలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఏర్పాటు, ఇంజనీరింగ్ విద్యపై అవగాహన పెంపొందించడంతోపాటు వారిలో సృజనాత్మక ఆలోచన విధానాన్ని పెంపొందించేలా పరీక్షల్లో సంస్కరణలు అమలు చేయాలని స్పష్టం చేసింది.

ఇనిస్టిట్యూషన్ ఇండస్ట్రీ సెల్ :
ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి రెండో సెమిస్టర్ నుంచి ఇంజనీరింగ్ పూర్తయ్యేలోగా 600 నుంచి 700 గంటల ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టును కచ్చితంగా చేయాలి. ఇందుకు 14 నుంచి 20 వరకు క్రెడిట్స్‌ను అమలు చేయాలి. కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా కంపెనీ అవసరాలు తెలియడంతోపాటు విద్యార్థుల సామర్థ్యాలను కంపెనీ ప్రత్యక్షంగా తెలుసుకునే వీలు కలుగుతుంది. తద్వారా వారికి తగిన శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఎక్కువ అవకాశాలు కల్పించే వీలు ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు, విద్యార్థులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు ‘ఇనిస్టిట్యూషన్ ఇండస్ట్రీ సెల్’ను ప్రతి కాలేజీలో కచ్చితంగా ఏర్పాటు చేయాలి. విద్యార్థులను ఔతా్సిహహిక పారిశ్రామికవేత్తలుగా విద్యార్థులు ఎదిగేలా చర్యలు చేపట్టాలి.

అధ్యాపకులకు శిక్షణ :
అధ్యాపకులు నిరంతరం ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంపై అప్‌గ్రేడ్ కావాలి. అందుకోసం వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. కొత్తగా నియమించే ఫ్యాకల్టీతోపాటు అప్పటికే ఉన్న ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వాలి. ఫ్యాకల్టీలో బోధన నైపుణ్యాలు, లీడర్‌షిప్ క్వాలిటీ పెంపొందించేలా ఈ కార్యక్రమాలు ఉండాలి. కొత్తగా ఫ్యాకల్టీగా నియమితులయ్యే వారికి ఏడాదిపాటు ప్రొబేషన్ పీరియడ్ అమలు చేయాలి. అధ్యాపకులకు శిక్షణ 450 గంటల నుంచి 480 గంటల వరకు నిర్వహించాలి.

అంతర్గత నాణ్యతకు భరోసా..
కాలేజీలో విద్యాబోధనలో నాణ్యత ప్రమాణాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. కాలేజీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు ఈ సెల్ ఆధ్వర్యంలో చేపట్టాలి. అలాగే ప్రతి బ్రాంచి నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలి.

పరీక్షల్లో సంస్కరణలు..
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పరీక్షల సంస్కరణలు అమలు చేయాలి. అందుకు అనుగుణంగా సిలబస్‌ను మార్చుకోవాలి. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించేలా అవకాశాలు కల్పించాలి. ఇందుకోసం ఓపెన్ బుక్ పరీక్ష విధానం అమల్లోకి తేవాలి. విద్యార్థులు బట్టిపట్టీ పరీక్షలు రాయడం కాకుండా విషయం ఆధారితంగా ఆలోచించి పరిష్కారాలు చూపేలా ప్రశ్నల సరళిని అమలు చేయాలి. విద్యార్థుల్లో వృత్తి పరమైన నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు చేపట్టాలి.

కంపెనీలతో ఒప్పందాలు :
కాలేజీలు ప్రతి ఇండస్ట్రీ భాగస్వామ్యం ఉండేలా అవగాహన ఒప్పంద విధానాన్ని అమలు చేయాలి. ప్రతి కాలేజీ కనీసంగా ఐదు కంపెనీలతో ఒప్పందాలు కలిగి ఉండాలి. వాటిల్లో తమ కాలేజీ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలి. కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి.

స్పోర్ట్స్ సదుపాయాలు :
విద్యార్థుల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడే క్రీడలను కచ్చితంగా కరికులంలో అమలు చేయాలి. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి.
Published date : 10 Jan 2019 03:15PM

Photo Stories