Skip to main content

ఇంజనీరింగ్‌కు కెమిస్ట్రీ తప్పనిసరి కాదు: ఏఐసీటీఈ

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చదివేందుకు కెమిస్ట్రీని తప్పనిసరి సబ్జెక్టుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టింది.
జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌లో 2021-22 విద్యా ఏడాది నుంచి అమల్లోకి తేనుంది. 2020-21 విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం ఇప్పటికే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష గత జనవరిలో జరిగినందున వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత జేఈఈ మెయిన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 2020-21 విద్యా ఏడాదిలో ఇది అమలు చేసే అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాము 2020-21 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తామని ఏఐసీటీఈని కోరాయి. దీంతో ఏఐసీటీఈ ఇటీవల విడుదల చేసిన 2020-21 అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్‌లోనూ మార్పులు చేసింది. దీంతో మనరాష్ట్రంలో వేలమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

తప్పిన తప్పనిసరి కెమిస్ట్రీ..
ప్రస్తుతం ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ డ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి. వాటినే పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు మెటీరియల్స్ కాంపొజిషన్‌లో మాత్రమే కెమిస్ట్రీ అవసరం అవుతుం దని, అదీ ప్రాథమిక అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బీఈ/బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకునే వారికి కెమిస్ట్రీ అవసరం లేదని పేర్కొంటున్నారు. అందుకనుగుణంగానే బీఈ/ బీటెక్‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివుండాలని, వాటితో పాటు కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్టు/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్‌ను మూడవ సబ్జెక్టుగా చదివిన వారు కూడా అర్హులేనని అప్రూవల్ ప్రోసెస్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు చేసింది. దీంతో ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు పైన పేర్కొన్న సబ్జెక్టులు చదివిన వారు కూడా బీటెక్ చేసేందుకు అర్హులే. కాగా, శనివారం జరగనున్న ఎంసెట్ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Published date : 15 Feb 2020 02:29PM

Photo Stories