ఇంజనీరింగ్‌కు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష?
Sakshi Education
న్యూఢిల్లీ: వైద్య కళాశాలలో సీట్ల భర్తీకి ఎంసెట్‌ను రద్దు చేసి దేశ వ్యాప్త ఒకే పరీక్ష జాతీయ అర్హత పరీక్ష(నీట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇంజనీరింగ్‌కు కూడా ఒకే పరీక్ష విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని జాతీయ సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. ఈ నెల చివర్లో జరగబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నారు. మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నేతృత్వంలోని మంత్రిత్వశాఖ ఇప్పటికే దీనిపై సమాలోచనలు జరిపింది. ఈ విధానం ద్వారా పరీక్ష నిర్వహణలో పారదర్శక సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రాలు ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేస్తుండగా సీబీఎస్‌ఈ జేఈఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేస్తోంది. అయితే ఇలా వేర్వురుగా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. అంతేకాకుండా ఎగ్జిట్ పేరుతో మరో పరీక్షను కూడా కేంద్రం నిర్వహించాలనుకుంటోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలైతే ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగాల్లో చేరాలంటే అంతకు ముందు ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో నిర్వహించే ఎగ్జిట్ పరీక్షను కూడా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. దీనివల్ల మెరుగైన ఇంజనీర్లే విధులు నిర్వర్తిస్తారని చెబుతున్నారు.
Published date : 09 Jan 2017 03:07PM