ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో సమూల ప్రక్షాళనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సిద్ధం అవుతోంది.
నాణ్యత ప్రమాణాలు, కొత్త కాలేజీల మంజూరు, సీట్లు తదితర అంశాలపై ప్రధాన దృష్టి సారించాలని నిర్ణయానికి వచ్చింది. ప్రధానంగా అధిక సంఖ్యలో అనుమతులు ఇచ్చిన సీట్లను భారీగా తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అనుమతుల ప్రక్రియలోనూ సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీటీఈ బృందాలు, యూనివర్సిటీ బృందాలు వేర్వేరుగా తనిఖీలు చేయడం కాకుండా, ఉమ్మడి తనిఖీల ద్వారా అన్ని సదుపాయాలు ఉన్న కాలేజీల్లో ప్రవేశాలకే అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీల్లో సీట్ల కోత విధించాలన్న నిర్ణయానికి వచ్చింది. కాలేజీల్లో వందల్లో సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇవ్వడం, యూనివర్సిటీలు నిరాకరించడం వల్ల న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తనిఖీల ద్వారా చర్యలు చేపడితే సమస్యలు ఉండవన్న ఆలోచనకు వచ్చింది. ఈనెల 5న అన్ని రాష్ట్రాల సాంకేతిక విద్యా శాఖ అధికారులతో ఏఐసీటీఈ సమావేశం నిర్వహిస్తోంది. సమావేశంలో ఇంజనీరింగ్‌లో తీసుకురావాల్సిన సంస్కరణలు, అనుమతుల ప్రక్రియలో మార్పులు, విద్యా ప్రమాణాలు, ప్రధానంగా సీట్ల తగ్గింపు అంశాలపై చర్చించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది.
Published date : 05 Oct 2016 02:44PM