Skip to main content

ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ‘స్లైడింగ్’ లేనట్టే !

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ చేపడతామని ప్రకటిస్తూ వచ్చిన ప్రవేశాల కమిటీ ఇప్పుడు చేతులు ఎత్తేసింది.
జీవోల్లో మార్పులు చేయలేదన్న కారణంతో ఇంటర్నల్ స్లైడింగ్‌కు మంగళం పాడేందుకు సిద్ధమైంది. దీంతో మూడో దశ ప్రవేశాల తర్వాత మిగిలిన సీట్లలో యాజమాన్యాలే ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నాయి. దీంతో ఆ స్లైడింగ్‌లో బ్రాంచీ మారే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ప్రవేశాల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్నల్ స్లైడింగ్ చేపట్టి, సంబంధిత కాలేజీ పరిధిలోనే బ్రాంచీలు మారే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇస్తామని ప్రకటించిన కమిటీ ఇప్పుడు అర్ధంతరంగా చేతులు ఎత్తేసి, ఇంటర్నల్ స్లైడింగ్ చేస్తే యాజమాన్యాలు కోర్టుకు వెళతాయన్న వాదనను తెరపైకి తెస్తోంది.

జీవోలు మార్చాలన్న ధ్యాసే లేదా ?
వాస్తవానికి ఇప్పటివరకు ఆయా కాలేజీల పరిధిలోనే ఇంటర్నల్ స్లైడింగ్‌ను యాజమాన్యాలు చేస్తూ వచ్చాయి. కన్వీనర్ కోటాలో సీట్లు లభించిన విద్యార్థులకు ఆయా కాలేజీలోని ఇతర బ్రాంచీల్లో సీట్లు ఖాళీగా ఉంటే బ్రాంచీ మార్చుకునేందుకు ఈ అవకాశం ఉంది. అయితే ప్రవేశాల కమిటీ కేటాయించిన సీట్లలో చేరి, అందులో కొనసాగితేనే ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. ఒకవేళ విద్యార్థులు బ్రాంచీ మారితే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. ఇప్పటివరకు అదే జరిగింది.

యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారా..?
2018-19 ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశాల కమిటీ మాత్రం ఇంటర్నల్ స్లైడింగ్ కూడా తామే నిర్వహిస్తామని, ఆయా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా వచ్చేలా చర్యలు చేపడతామని కమిటీ ప్రకటిస్తూ వచ్చింది. దీంతో అనేక మంది విద్యార్థులు ఆశల్లో పడ్డారు. తర్వాత బ్రాంచీ మార్చుకున్నా ఇబ్బంది ఉండదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందని ఆశించారు. కానీ ఇప్పుడు అధికారులు జీవోల్లో మార్పు చేయలేదు కదా.. యాజమాన్యాలు కోర్టుకు వెళతాయేమోనన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. దీంతో ప్రవేశాల కమిటీ చేపట్టే ఇంటర్నల్ స్లైండింగ్ ఉండకపోవచ్చని కొందరు అధికారులే చెబుతున్నారు. పాత ఉత్తర్వుల ప్రకారం యాజమాన్యాలే ఇంటర్నల్ స్లైడింగ్ చేస్తాయని చెబుతున్న అధికారులు ముందుగా ఆ ఉత్తర్వులను ఎందుకు మార్చలేదన్న అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే యాజమాన్యాలు ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ ప్రవేశాలు చేపడితే కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో మిగిలే సీట్లను తమకు ఇష్టమైన వారికి ఇచ్చుకోవచ్చు. వాటికి ఎలాగూ డిమాండ్ ఉంది కాబట్టి వాటిని విద్యార్థులకు స్లైడింగ్‌లో కేటాయించకుండా అమ్ముకునే అవకాశం ఉంది. అందుకే కొంతమంది అధికారులు యాజమాన్యాలతో కుమ్మకై ్క ప్రవేశాలకమిటీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఇంటర్నల్ స్లైడింగ్ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు యాజమాన్యాలు చేపట్టే ఇంటర్నల్ స్లైడింగ్ వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు కాబట్టి ముందుగా వచ్చిన సీట్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Published date : 02 Jul 2018 03:16PM

Photo Stories