Skip to main content

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మరింత ఆలస్యం!

హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి నిర్వహించాలనుకున్న కౌన్సెలింగ్ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది. కొత్త కాలేజీలు, అదనపు సీట్ల పెంపునకు సంబంధించిన అనుమతుల గడువును అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మరో ఐదు రోజులు పెంచడమే ఇందుకు కారణం. ఈ గడువును ఈనెల 15 నుంచి 20 వరకు పెంచారు. దీంతో వీలైతే జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాలేజీలకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చాక, ఉభయ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఆ కాలేజీలను కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు అనుమతిస్తారు. దీనికితోడు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి రెండు ప్రభుత్వాల నుంచి ఇంకా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, వివిధ పీజీ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, లా, పోస్టు గ్రాడ్యుయేషన్ లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందుకు శుక్రవారం షెడ్యూలు ఖరారు చేసింది.

వివిధ కోర్సుల కౌన్సెలింగ్ వివరాలివీ..
సెట్ ఫలితాల వెల్లడి తేదీ కౌన్సెలింగ్ తేదీ
పీజీఈసెట్ జూన్ 16 జూలై 14 నుంచి 12 రోజులు
ఎడ్‌సెట్ జూన్ 19 లేదా 20 జూలై 21 నుంచి 2 రోజులు
లాసెట్ జూన్ 21 ఆగస్టు 2వ వారం
పీజీలాసెట్ జూన్ 21 ఆగస్టులో
పీఈసెట్ జూన్ 30 జూలై 10, 11
Published date : 14 Jun 2014 12:02PM

Photo Stories