ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఓకే : హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిసరాల్లోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో 2017-18లో అడ్మిషన్లు రద్దు చేయాలన్న ఏఐసీటీఈ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
అడ్మిషన్లు కొనసాగింపునకు సింగి ల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని మండలి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిల ధర్మాసనం కొట్టేసింది. హైదరాబాద్ పరిసరాల్లోని అరోరా ఎడ్యుకేషనల్ సొసైటీ, రవి రుషి ఎడ్యుకేషనల్ సొసైటీ, చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, తార క రామ ఎడ్యుకేషనల్ సొసైటీ, సంపతి ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 2017-18కి అడ్మిషన్లు నిరాకరిస్తూ ఏఐసీటీఈ జారీ చేసిన ఆదేశాలు అమలవకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఆయా కాలేజీల్లో కొన్ని భవనాలు నిర్మించలేదని, మరికొన్ని కాలేజీలు భవనాలకు తప్పుడు పత్రాలు సమర్పించాయని ఏఐసీటీఈ అడ్మిషన్లకు అనుమతి నిరాకరించింది. ఏఐసీటీఈ అప్పీల్‌పై ధర్మాసనం స్పందిస్తూ.. ఆ కాలేజీలు 4 నుంచి 22 ఏళ్లుగా ఉన్నాయని, పైగా షోకాజ్ నోటీసులో ఆరోపణలకు ఆధారాలు పేర్కొనలేదని చెప్పింది. ఆరోప ణలు తేలేవరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు చేయాలని, అడ్మిషన్లు కొనసాగించాలని తీర్పునిచ్చింది.
Published date : 07 Jul 2017 02:02PM