Skip to main content

ఇంజనీరింగ్ కాలేజీల్లో 10 నుంచి తనిఖీలు

హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపుపై (అఫిలియేషన్) జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం కసరత్తు ప్రారంభించింది. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో ఈనెల 10 నుంచి తనిఖీలు చేయనుంది.
ఇందులో భాగంగా నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటుచేయడంపై దృష్టి సారించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నుంచి గుర్తింపు తెచ్చుకున్న కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 7వరకు గడువు ఉంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, కమిటీల నేతృత్వంలో పదో తేదీ నుంచి తనిఖీలను చేపట్టనుంది. దీంతో యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. మరోవైపు ఈనెల 4 నుంచి జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ ఇదివరకే షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షలను వాయిదా వేయాలని యాజమాన్యాలు కోరాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, ఫ్యాకల్టీకి ఏడాది కాలంగా వేతనాల్లేవని, దీంతో వారు పరీక్షల విధులకు హాజరుకాబోమని చెబుతున్నారని యాజమాన్యాలు వాదిస్తున్నాయి. అందుకే పరీక్షలను వాయిదావేయాలని చెబుతున్నా... జేఎన్‌టీయూ వైఖరికి వ్యతిరేకంగానే ఈ ఆలోచన చేసినట్లు సమాచారం.

యథావిధిగా పరీక్షలు: జేఎన్‌టీయూ
కాగా ఈనెల 4 నుంచి వార్షిక పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని, యాజమాన్యాలు సహకరించాలని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు కోరారు.
Published date : 04 May 2015 03:23PM

Photo Stories