Skip to main content

ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు

  • తాజా కౌన్సెలింగ్‌కు ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు
  • ఈ దశలో అటువంటి ఉత్తర్వులు సాధ్యం కాదని స్పష్టీకరణ
  • రెండో దశ కౌన్సిలింగ్ చేపట్టే ఉద్దేశం లేదన్న అడ్వొకేట్ జనరల్
  • ప్రవేశాల్లో ఆలస్యం కోర్టు ధిక్కారమేనని నివేదన
హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగింపునకు గురై, కోర్టులో సానుకూల ఉత్తర్వులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏ, బీ కేటగిరీల్లో ప్రవేశాల కల్పన నిమిత్తం తమకు అనుమతినివ్వడంతో పాటు, తమ కాలేజీలకు తాజాగా కౌన్సిలింగ్ లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించేలా జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ), హైదరాబాద్‌ను ఆదేశించాలని కోరుతూ ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ దశలో అటువంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎంత మాత్రం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో రెండో దశ కౌన్సిలింగ్‌లోనైనా తమకు స్థానం దక్కుతుందని ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల ఆశలపై తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి నీళ్లు చల్లారు. ఆగస్టు 31లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాల అమలులో భాగంగా రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించే ఉద్దేశమేదీ తమకు లేదని ఏజీ రామకృష్ణారెడ్డి కోర్టుకు తేల్చి చెప్పారు. ఏజీ చెప్పిన ఈ కీలక అంశాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు చేసిన అభ్యర్ధనను తోసిపుచ్చారు. నిబంధనల మేర బోధనా సిబ్బంది ఉన్న కాలేజీలను కౌన్సిలింగ్ జాబితాలో చేర్చాలని ఇదే హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా జేఎన్‌టీయూ ఏ మాత్రం పట్టించుకోలేదని, దానిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, తమ కాలేజీలకు తాజా లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైజయంతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మరో 23 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో హౌజ్ మోషన్ రూపంలో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు.

హామీ ఇచ్చినా పట్టించుకోలేదు...
ఈ నెల 25న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు పిటిషనర్ కాలేజీలన్నీ కూడా రూ.100 స్టాంప్ పేపర్లపై యూనివర్సిటీ కోరిన ప్రకారం లోపాలను సవరించుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని కాలేజీల తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిబంధనల మేర తమ కాలేజీలన్నీ కూడా బోధనా సిబ్బందిని కలిగి ఉన్నందున వాటికి తాజాగా లేదా అనుబంధ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ల భర్తీకి అవకాశమివ్వాలన్నారు.

అలస్యం కోర్టు ధిక్కారమే..
తరువాత జేఎన్‌టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆగస్టు 31లోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ప్రవేశాల ప్రక్రియలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా అది కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగా రెండో దశ కౌన్సిలింగ్ నిర్వహించే ఉద్దేశమేదీ తమకు లేదని ఆయన కోర్టుకు నివేదించారు.
Published date : 02 Sep 2014 11:24AM

Photo Stories