- ఆలోచనలు సాగిస్తున్న ప్రభుత్వం
- విశాఖలో జరిగే విద్యాసదస్సులో దీనిపై చర్చ
- ఆపై కొత్త విధానంపై విధివిధానాల రూపకల్పన
హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో సంస్కరణల దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, పరిశ్రమలకు అవసరమైన రీతిలో నిపుణులను తయారుచేయడం లక్ష్యంగా సంస్కరణలపై కసరత్తు సాగిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు చేయడానికి అధికారులు కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కాలేజీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణత కలిగి ఉండేలా తీర్చిదిద్దాలన్నది ఈ ప్రతిపాదనల సారాంశం. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ఆయా సబ్జెక్టులపై అవగాహన కలిగించేలా కాలేజీల్లో బోధనాభ్యసనాన్ని మొదటి మూడు సంవత్సరాలకు కుదించనున్నారు. నాలుగో సంవత్సరం పూర్తిగా అప్రెంటిస్‌షిప్‌ను అమలుచేయనున్నారు. ఇందుకోసం కాలేజీలను పరిశ్రమలకు అనుసంధానిస్తారు. ప్రస్తుతం నాలుగేళ్లు ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసి కాలేజీనుంచి బయటకు వచ్చే విద్యార్థి తరువాత అప్రెంటిస్‌షిప్ కోసం ఆయా పరిశ్రమల చుట్టూ తిరుగుతున్నారు. అప్రెంటిస్‌షిప్‌కు అవకాశం లేని వారు అదీ చేయడం లేదు. వారిలో నైపుణ్యాలు కొరవడి ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలను అందుకోలేకపోతున్నారు. దీన్ని నివారించేందుకు విద్యార్థులు కాలేజీల్లో ఉండగానే అప్రెంటిస్‌షిప్‌ను పూర్తిచేయించాలన్నది ప్రస్తుత ప్రతిపాదనల సారాంశం. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వీరిని తయారుచేస్తే కోర్సు పూర్తయ్యేనాటికి ఆయా పరిశ్రమల్లోనే వారికి ఉద్యోగాలు దొరకడమో, లేదంటే అక్కడి అప్రెంటిస్‌షిప్ అనుభవంతో వేరే చోట్ల అవకాశాలు దక్కించుకోగలుగుతారని భావిస్తున్నారు. విశాఖపట్నంలో యూనివర్సిటీల ఉపకులపతులు, విద్యారంగ నిపుణులు, ఇతర ప్రముఖులతో త్వరలో నిర్వహించబోయే సదస్సు అజెండాలో దీన్ని ముఖ్యాంశంగా చేరుస్తున్నారు. దీనిపై కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని విద్యాశాఖవర్గాలు వివరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా ఏటా లక్షకు పైగా విద్యార్థులు కోర్సు పూర్తిచేసి బయటకు వస్తున్నారు. వీరిలో అత్యధికులు నైపుణ్యాలు కొరవడి ఏ పరిశ్రమలోనూ అవకాశాలు దక్కించుకోలేపోతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఏడాది ఇంజనీరింగ్‌కోర్సుల్లో చేరే విద్యార్థులనుంచి ఈ అప్రెంటిస్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు యోచిస్తోంది.